హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి ఒక గుణపాఠం

గత దశాబ్దకాలంగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాల పట్ల పాల్గొంటున్న పార్టీలు, నాయకుల కంటే మతతత్వ వాదులు .. ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భారతీయ జనతా పార్టీ విజయాన్ని మతతత్వవాదులు ఎక్కువగా ఆస్వాదిస్తుంటే … కాంగ్రెస్‌ పార్టీ లేదా బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలు పరాజయం పాలైనపుడు ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులు నిరాశ చెందుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మతతత్వ వాదులను కొంచం నిరాశ పరిస్తే … ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులకు కాస్త ఊరటనిచ్చింది. కానీ మంగళవారం వెలువడిన హర్యానా,జమ్మూ కశ్మీర్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలతో   ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదుల ఆశలు ఆవిరి అయినాయి, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో బీజేపీ అత్యధిక స్థానాలు 29 గెలుచుకున్న ఏకైక పార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌ పార్టీ  నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి 42 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వొచ్చినా ..

రాష్ట్ర హోదా దక్కని ఈ రాష్ట్రం ఇంకా కేంద్ర పాలిత ప్రాంతంగా  కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కనుసన్నల్లోనే కార్యకలాపాలు జరిగే అవకాశమున్నది. 2014 ఎన్నికలలో గెలిచిన దానికంటే నాలుగు ఎక్కువ  సీట్లు గెలుచుకోవడం ద్వారా జమ్మూలో బీజేపీ తన పట్టును నిలుపుకుంది. కానీ  ప్రధానంగా ముస్లింలు ఉండే లోయలో బీజేపీ  ఖాతా తెరవడంలో విఫలమైంది, అక్కడ ఆ పార్టీ  బహిరంగ మరియు రహస్య మిత్రులు కూడా ఖాతా తెరవడంలో విఫలమయ్యారు. ఈ  వైఫల్యం జమ్మూ, కాశ్మీర్‌ చరిత్రలో మొదటిసారిగా హిందూ ముఖ్యమంత్రితో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కాషాయ పార్టీ ఆలోచనకు అడ్డుకట్ట వేసింది. వాస్తవానికి  జమ్మూ మరియు కశ్మీర్‌లో జరిగిన ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి, ఆర్టికల్స్‌ 370మరియు 35(A)లను తొలగించిన తర్వాత మొదటిసారిగా నిర్వహించబడ్డాయి.. తొలగింపుపై వ్యతిరేక .. అనుకూల అభిప్రాయాల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో వోటర్లు అధిక సంఖ్యలో పాల్గొని   ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించిన అన్ని సంస్థల అంచనాలు తారుమారయినాయి. జమ్మూ కశ్మీర్‌లో ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యతరాదనీ .. హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు సూచించాయి, వారి అంచనాలు తలకిందులు చేస్తూ వోటరు తమకు భిన్నమైన రాజకీయ విధేయతలను కలిగి ఉండవచ్చని, అయితే ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను ధిక్కరించే విషయంలో ఐక్యంగా ఉన్నారని నిరూపించారు. కాంగ్రెస్‌కు నిర్ణయాత్మక విజయం ఖాయమని వారు జోస్యం చెప్పారు కానీ ఆఖరికి, స్పష్టమైన విజయం సాధించింది బీజేపీ. కౌంటింగ్‌ ప్రారంభం కాగానే ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలకు అనుగుణంగానే ట్రెండ్స్‌ ఉన్నట్లు కనిపించినా, మధ్యాహ్నానికి ీఅంచనాలన్నింటినీ తలకిందులు చేసి బీజేపీ  కాంగ్రెస్‌ ఆశలపై నీళ్లు చల్లింది. రైతులు మరియు మల్లయోధుల నిరసనలు, అలాగే రెండు పర్యాయాలు అధికార వ్యతిరేకత వంటి అనేక సమస్యల కారణంగా బిజెపికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం స్పష్టంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌కు మంచి అవకాశం వొచ్చినా ఆ అవకాశాన్ని  దక్కించు కోలేకపోయింది.

హర్యానాలో48 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టబోతున్న భారతీయ జనతా పార్టీకి ..37 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి పోలయిన  వోట్ల శాతంలో వ్యత్యాసం ఒకటి కంటే తక్కువ.. బీజేపీకి 40 శాతం వోట్లు సాధించగా .. కాంగ్రెస్‌ పార్టీ 39.3శాతం వోట్లు పొందింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, బిజెపితో ప్రత్యక్ష పోటీకి దిగినప్పుడు దానిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ఇంకా సిద్ధంగా లేదని స్పష్టమవుతుంది. తీవ్రమైన ఆత్మపరిశీలన చేసుకోవాలని మరియు పొత్తుల విషయంలో మరోసారి పునరాలోచించుకోవాలని హర్యానా ఫలితాలు కాంగ్రెస్‌కు బలమైన సందేశాన్ని పంపాయి. హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ఒక సందేశం, ఇది తన అంతర్గత లోపాలను సరిదిద్దుకోవడానికి మరియు కూటమి భాగస్వాములతో తన వ్యవహారాలను సరిదిద్దుకోవడానికి సమయం ఆసన్నమైంది. ఈ ఫలితాలు కాంగ్రెస్‌లోని వర్గాలను మరోసారి తెరపైకి తెచ్చాయి, అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన బీజేపీకి కొత్త ఊపిరి పోసింది. కాంగ్రెస్‌ వైఫల్యాలను సమీక్షించుకుని హర్యానాలో ఫలితాలు దేశవ్యాప్తంగా మొత్తం రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపగలవని గ్రహించడం ముఖ్యం.

కొసమెరుపు : భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే హర్యానా ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ కర్ణాటక, ఉత్తరాఖండ్‌ మరియు తెలంగాణాలో ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం హర్యానా వోటరు గ్రహించడం వల్లనే అక్కడ పరాజయం పాలయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణాలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ పరాజయం ప్రభావం పక్క రాష్ట్రంలో అధికారంలో ఉండి ఓటమి పాలైన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పై పడిరదని భావించాలా..? బీజేపీ ఎదుర్కోగల సత్తా ప్రాంతీయ పార్టీలకే ఉందని కూడా అన్నారు. భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీనా.. లేక .. ప్రాంతీయ పార్టీనా కేటీఆర్‌ స్పష్టం చేయాలి ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *