గత ప్రభుత్వంలో ఏనాడూ ఇలా జరగలేదు
గత ప్రభుత్వం హయాంలో ఏనాడూ శాసన సమావేశాలు ఆలస్యంగా ప్రారంభం కాలేదని, ప్రజాప్రతినిధులే సభా నిబంధనలు పాటించకుంటే ఎలా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అనుమతితో మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. సమయం 10:10 కావొచ్చింది. ఈ సెషన్‌లో ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీ పది అంటే పది గంటలకు ప్రారంభం కాలేదు. మీరు లాస్ట్ సెషన్ చూడండి.. పదేండ్లు సభ నడిపితే.. పది అంటే పది గంటలకు కచ్చితంగా ఠంచన్‌గా సభ నడిపాం.
సభ సమయ పాలన పాటించడం ముఖ్యం. ప్రతి రోజు ఈ సెషన్‌లో 5, 10, 15 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభం కావడం కరెక్ట్ కాదు. సభ అందరికీ ఆదర్శంగా ఉండాలి. మనమే ఇలా ఆలస్యంగా నడపడం కరెక్ట్ కాదని మనవి చేస్తున్నానని హరీశ్‌రావు పేర్కొన్నారు. అనంతరం స్పీకర్ అనుమతితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ ప్రారంభించారు. రైతు భరోసా విధివిధానాలపై సూచనలు ఇవ్వాలని మంత్రి తుమ్మల సభ్యులను కోరారు. సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసాపై విధివిధానాలను ఖరారు చేసి, ఆ తర్వాత రైతు భరోసా చెల్లింపులు చేస్తామని మంత్రి ప్రకటించారు.