– ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలి
– హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 : మలక్‌పేట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. నిర్మాణ పనులను పూర్తి పారదర్శకతతో, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మలక్‌పేట, నాగోలు బండ్లగూడ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణ ప్రదేశాలను గురువారం ఆయన సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మలక్‌పేటలో మొత్తం 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో పైలట్ ప్రాజెక్టుగా 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా త్వరలోనే భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్మాణ పనులపై ఆయన సమీక్షించారు. ప్రాజెక్టు నిర్దేశిత గడువు ఏడాది మాత్రమే ఉన్నందున ఎలాంటి జాప్యం జరగకుండా పనులను నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. పాత భవనాల కూల్చివేత పనులను వేగవంతం చేసి తదుపరి నిర్మాణ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. నిర్మాణంలో ప్రతి దశలోనూ నాణ్యతను కచ్చితంగా పాటించాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇళ్లు పొందిన లబ్దిదారులు కూడా నెలకోసారి నిర్మాణ ప్రదేశాలను సందర్శించి తమ ఇళ్ల నిర్మాణ పురోగతిని ప్రత్యక్షంగా తెలుసుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న సివిల్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం నాగోలు బండ్లగూడలో జరుగుతున్న టవర్స్ పనులను కూడా పరిశీలించారు. అక్కడ చేపడుతున్న సిమెంట్ కాంక్రీట్ పనుల నాణ్యతను పరిశీలిస్తూ నిర్దేశించిన కాలపరిమితిలోగా నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్లకు గౌతం సూచించారు. ఆయన వెంట హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ జి.వి రమణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాబూరావు తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





