– గతంలో నిరర్ధక ఆస్తులు అమ్మేవారు
– రేవంత్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
– ట్రక్ పార్కింగ్ భూమి ప్రభుత్వ భూమి కాదు
– ప్రభుత్వ భూములు అమ్మొద్దన్న రాహుల్ మాటకు విలువలేదా ?
– రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ నేత హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 : సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు రేవంత్ ఎప్పుడూ భూముల చుట్టే తిరుగుతున్నడు.. భూముల అమ్మకంపై ఉన్న శ్రద్ద పాలనపై లేకపోవడం దురదృష్టకరం అని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నాయకుడు టి.హరీష్‌రావు తీవ్రంగా విమర్శించారు. గతంలో ప్రభుత్వాలు నిరర్దక ఆస్తులు, ప్రజలకు ఉపయోగపడని భూములును అమ్మేవి.. కానీ రేవంత్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. కూకట్ పల్లి ట్రక్ పార్కింగ్ భూమి అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ట్రక్ పార్కింగ్ భూమి అనేది ప్రభుత్వ భూమి కాదు. ట్రక్ పార్కింగ్ భూమి. ప్రభుత్వ రికార్డుల్లోనూ అదే ఉంది అని స్పష్టం చేశారు. ఒక ప్రత్యేకమైన అసవరం కోసం ఆనాడు భూమి సేకరించగా పబ్లిక్ పర్పస్ కోసం, ట్రక్ పార్కింగ్ కోసం అని ఆర్డర్ ఉంది అని చెప్పారు. ఇప్పుడు దాన్ని పక్కనబెట్టి అమ్మేస్తాం అంటున్నారని విమర్శించారు. ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ప్రకారం తిరిగి రైతులకు ఇవ్వాలి తప్ప ఇష్టం ఉన్నట్లు వినియోగించడం కుదరదన్నారు.హెచ్ సీయూ భూములు, ఉర్దూ యూనివర్సిటీ భూములు, అసైండ్ భూములు అమ్మకానికి పెడుతున్నరు. మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ భూములకు పట్టాలు ఇస్తం అని చెప్పి ఇష్టం ఉన్నట్లు భూములు అమ్ముతున్నరని ఆరోపించారు.
భూమి కనిపిస్తే చాలు అమ్ముడే అమ్ముడు
26వేల ఎకరాల భూమి ఇప్పటికే అమ్మాడు, 20వేల ఎకరాల భూమిని బాంబే స్టాక్ ఎక్సేంజీలో కుదువ పెట్టి బ్రోకర్‌కు రూ.500 కోట్ల లంచం ఇచ్చి రూ.20వేల కోట్లు అప్పు తెచ్చాడని, హెచ్ సీయూ భూముల విషయంలో రూ.250 కోట్ల లంచం ఇచ్చి రూ.10వేల కోట్ల అప్పు తెచ్చిండు అని ఆయన ఆరోపించారు.హెచ్ఎండీఏలో 800 ఎకరాల భూముల విషయంలో అదే బ్రోకర్ కు రూ.250 కోట్లు లంచం ఇచ్చి రూ.10వేల కోట్లు అప్పు తెచ్చిండన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనిది బ్రోకర్లకు రూ.500 కోట్లు అధికారికంగా లంచం ఇచ్చి భూములు అమ్ముతున్నడని, మియాపూర్ 400, మామిడిపల్లిలో 400 ఎకరాలు అమ్ముతా అంటున్నడని తెలిపారు. అంటే రూ.50వేల కోట్ల భూములను ఈ సంవత్సరం అమ్మాలని టార్గెట్ పెట్టుకున్నడని విమర్శించారు. కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం అమ్ముతున్నడు తప్ప ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు. గ్యారెంటీల అమలు మరిచిపోయి భూములను గ్యారెంటీగా అమ్ముతున్నడని ఎద్దేవా చేశారు. కాప్రాలో 400 గజాలు, అమీన్ పూర్ లో 300 గజాలు, బాచుపల్లిలో 490 గజాలు.. గజాలను కూడా వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు. చిన్న స్థలాల్లో ఒక పాఠశాల, ఒక పార్కు, ఒక దవాఖాన పెట్టొచ్చు కదా అని సూచించారు. ట్రక్ పార్కింగ్ అనేది ఎంతో ముఖ్యం. రోజుకు వెయ్యి కంటైనర్లు లోడ్ అవుతాయి. ఈ భూమి అమ్మేస్తే కంటైనర్ కార్పొరేషన్ ఎలా నడవాలి.. కార్మికుల పరిస్థితి ఏం కావాలి అని ప్రశ్నించారు. అంటే నీకు కనీసం సోయి లేదు, ఏది అమ్మాలో తెల్వదు అని అన్నారు. నేడు ఎల్ నినో కరువుకు నీళ్ల కరవు వస్తే రేవంత్ పిచ్చి తుగ్లక్ చర్య వల్ల భూముల కొరత వచ్చే ప్రమాదం ఉందన్నారు. హిల్ టీపీ భూముల అమ్మకం అన్నావు.. అదేం లేదు నీకు వచ్చే దాని కోసం కార్మికుల బతుకులు ఆగం చేస్తున్నవు అని అంటూ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ భూమి, నర్సరీ, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు, ఆర్టీయే కార్యాలయం అక్కడే ఉంది.. వాటన్నింటిని అమ్మేస్తావా అని నిలదీశారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ మధ్యన ఉన్న ఒకే ఒక ప్రాంతం ఇది అని, జనాభా పెరుగుతుంటే వారి అవసరాలకు తగినట్లు ఏర్పాట్లు ఎలా చేస్తారు అని హరీష్ రావు ప్రశ్నించారు. తక్షణమే కూకట్ పల్లి ట్రక్ పార్కు భూమి వేలాన్ని రద్దు చేయాలని అఖిలపక్షం పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ వేలాన్ని రద్దు చేయకుంటే 22, 23 తేదీల్లో జరిగే నిరాహార దీక్షలో బీఆర్ఎస్ ప్రత్యక్షంగా పాల్గొంటుందని, 25నహెచ్ ఎండీఏ ముట్టడిలో పాల్గొంటుందని హెచ్చరించారు.
రాహుల్ మాటకు విలువ లేదా?
పదేళ్ల ముందు బీఆర్ఎస్ ఈ భూములను కాపాడింది.. నేడు మళ్లీ బీఆర్ఎస్సే పోరు బాట పట్టిందన్నారు. కార్మికుల కోరిక మేరకు తాము పూర్తి మద్దతు అందిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ భూములను అమ్మొద్దు అని చెబుతుంటే రేవంత్ అదే పనిగా భూములు అమ్ముతున్నడంటూ రాహుల్ మాటకు విలువలేదా అని హరీష్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి.. హైకమాండ్ చొరవ చూపి రేవంత్ కు బుద్ది చెప్పాలి అని కోరారు. లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు.
సీపీఐ, సీపీఎం సహా అన్ని వామపక్షాలను కలుపుకుని బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి, జిల్లా కార్యదర్శి పి.సత్యం, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి నుంచి ఉమామహేశ్వర్, న్యూ డెమోక్రసీ గోవర్ధన్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





