తెలంగాణ నీటి హక్కులపై రాజీ ప్రసక్తే లేదు

– సాగర్ నుంచి ఏపీ నీటి తరలింపు ప్రయత్నాలను అడ్డుకుంటాం
– కృష్ణా, గోదావరి జలాల్లో రావాల్సిన ఒక్క చుక్కనూ వదులుకోం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్‌/హుజూర్‌నగర్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబర్‌ 19: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడేందుకు అవసరమైన ప్రతి సంస్థాగత, న్యాయ వేదికపైనా పోరాడతామని ప్రకటించారు. హుజూర్‌నగర్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నాగార్జునసాగర్‌ నుంచి 1.8 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అభ్యంతరాలు తెలిపామన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటాను దెబ్బతీసే ఏకపక్ష చర్యలను అడ్డుకుంటామని ఉత్త‌మ్ చెప్పారు. భారత వైమానిక దళంలో యుద్ధ విమాన పైలట్‌గా చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించాను.. అప్పుడు దేశాన్ని కాపాడేందుకు చూపిన క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదలతోనే ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తాను.. కృష్ణా నీళ్లైనా, గోదావరి నీళ్లైనా మన హక్కులో ఒక్క చుక్కను కూడా వదులుకోం’ అని ఉత్తమ్‌ అన్నారు. రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణ రైతుల సాగునీరు, ప్రజల తాగునీరు, లక్షలాది కుటుంబాల జీవనోపాధితో ముడిపడి ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి వినియోగాన్ని మెరుగుపరచడంతో సాగు విస్తీర్ణం, వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ పెరిగాయని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాలు, పనుల తీరుకు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సమస్యలే నిదర్శనమని ఉత్తమ్‌ విమర్శించారు. వారసత్వంగా వచ్చిన సమస్యలను సరిదిద్ది, సాగునీటి మౌలిక వసతులను పరిరక్షించి, అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగిస్తామని తెలిపారు. వాతావరణ పరిస్థితులు, రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాల కోసం నీటి సంరక్షణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర నీటి హక్కుల కోసం వెనుకడుగు వేయదని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *