మెడికల్ కాలేజీల్లో తీరనున్న అధ్యాపకుల కొరత

– ఎంపికైన వైద్యుల లిస్టు విడుదల
– వైద్య విద్య ప్రమాణాల మెరుగు దిశగా కీలక అడుగులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీర్చడంతోపాటు వైద్య విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లలోని 433 పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పూర్తి చేసింది. ఈమేరకు ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల లిస్టును బుధవారం బోర్డు విడుదల చేసింది. ఈ మెడికల్ కాలేజీలల్లోని 34 విభాగాలకు చెందిన మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి బోర్డు గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అనస్తీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాలకు చెందిన 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇటీవలే నియామక పత్రాలు అందజేశారు. తాజాగా మిగిలిన 30 డిపార్టుమెంట్లలో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలు, సెలక్షన్ లిస్టును ఎంహెచఎసఆర్‌బీ విడుదల చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు, నాలుగు స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ జాబితాను కూడా బోర్డు విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్పీచ్ పాథాలజిస్టులకు మంత్రి రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే వారికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, టీచింగ్ హాస్పిటల్స్, ఇతర ఆరోగ్య సంస్థల్లో మానవ వనరులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గత రెండున్నరేళ్ల కాలంలో ఆరోగ్య శాఖ పరిధిలో సుమారు 15 వేల పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *