రోడ్డు భ‌ద్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌

– హెల్మెట్ ధ‌రిస్తే ప్రాణ ర‌క్ష‌ణ‌
– అంతా అప్ర‌మ‌త్తంగా వుంటే రోడ్డు ప్ర‌మాదాలు త‌గ్గుతాయి
డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ ఎం భగవత్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూన్ 10:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ సభా వేదికగా ఈ రోజు నుంచి హెల్మెట్, సీటు బెల్ట్ ధరించనిదే గ్రామంలోకి ఎవరికీ అనుమతి లేదని తీర్మానం చేస్తున్నామన్నారు. దేశంలో తెలంగాణ పోలీసు శాఖ పనితీరు ఆదర్శప్రాయంగా ఉందని, ట్రాఫిక్ నిబంధనలపై తమ గ్రామంలో అవగాహన కల్పించేందుకు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ జిల్లా ప్రజలను రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తం చేసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు డీజీపీ భగవత్ ఫసల్వాడి గ్రామానికి రావడం అరైవ్ అలైవ్ కార్యక్రమ ప్రాధాన్యతను తెలియజేస్తున్నదన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ అరైవ్ అలైవ్ అంటే మన ప్రయాణం సురక్షితంగా సాగి గమ్యస్థానానికి క్షేమంగా చేరుకోవడం అని తెలిపారు. డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చిన్న మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తేనే స్క్రీన్ గార్డ్ వేయిస్తామని, దానికంటే మన ప్రాణాలు, మన ప్రయాణం ఎంతో విలువైనవని గుర్తించాలని అన్నారు. ప్రాణ రక్షణలో భాగమైన హెల్మెట్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేసి వినియోగించాలని సూచించారు. కార్లలో ప్రయాణించేటప్పుడు డ్రైవర్ మాత్రమే కాక ప్రయాణికులందరూ సీటు బెల్ట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. యువత ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచుకుని ఇతరులకు కూడా చైతన్యం కల్పించాలని కోరారు. అనంతరం గ్రామ ప్రజలతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి, హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎంహెచ్‌వో లలిత, ఆర్డీవో రాజేందర్, రవాణా శాఖ జాయింట్ కమిషనర్ వెంకటరమణ, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఎమ్మార్వో దశరథ్, జిల్లా పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *