ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ‌సాధారణ ప్రజలకు మాత్రమే

– రౌడీలు, గూండాల పట్ల కఠినంగానే వ్యవహరిస్తాం
– గంజాయి సాగు చేస్తే రైతు సంక్షేమ పథకాలు నిలుపుదల
– సైబర్‌ ‌నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం
– డీజీపీ సీవీ ఆనంద్‌ ‌స్పష్టీకరణ

ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌  10 : ‌తెలంగాణలో పోలీసింగ్‌ ‌విధానంలో కీలక మార్పులకు సంకేతాలు ఇస్తూ డీజీపీ సీవీ ఆనంద్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌‘ పేరుతో నేరస్తుల పట్ల సానుభూతి ఉండదని, ప్రజలను గౌరవిస్తాం.. కానీ రౌడీలు, గూండాలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా అంతమైందని, ఈ నేపథ్యంలో గ్రేహౌండ్స్ ‌విభాగాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న సిబ్బందిని కొత్త విభాగాలకు బదిలీ చేస్తూ వారి సేవలను ఇతర కీలక రంగాల్లో వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి గంజాయి, డ్రగ్స్ అ‌క్రమ రవాణా పెద్ద సవాల్‌గా మారిందని డీజీపీ పేర్కొన్నారు. వాటి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. డ్రగ్స్ ‌ముఠాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని, నేరస్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూపాలపల్లి, ఏటూరు నాగారం, నర్సంపేట, ఆదిలాబాద్‌ ‌తదితర అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు ఉందని ప్రస్తావించారు. గంజాయి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని, రైతుబంధు కూడా నిలిపివేస్తున్నామని డీజీపీ ఆనంద్‌ ‌స్పష్టం చేశారు. అదేవిధంగా సైబర్‌ ‌నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, సైబర్‌ ‌ క్రైం పోలీసు శాఖకు ప్రధాన సవాల్‌గా మారిందని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సైబర్‌ ‌నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆదిలాబాద్‌ ‌జిల్లా పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని డీజీపీ ప్రశంసించారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ సైతం మారాల్సిన అవసరం ఉందని, ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక, ప్రజలకు భరోసా ఇచ్చే పోలీసింగ్‌ ‌కొనసాగుతుంది కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే రౌడీలు, గూండాలకు మాత్రం కఠినమైన పోలీసింగ్‌ ‌తప్పదనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చిన బాధితులతో ఫ్రెండ్లీగా ఉంటామమంటూ రౌడీషీటర్లు, తదితర నేరస్తుల విషయంలో కఠినంగానే ఉంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది పెట్టే ఎవరినీ వదలబోమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఏడాది కాలంలో రోడ్డుప్రమాదాల్లో1.70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని డీజీపీ తెలిపారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్‌పై ప్రజలు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. మైనర్ల డ్రైవింగ్‌ ‌దేశంలో పెద్ద సమస్యగా మారిందన్నారు. తల్లిదండ్రులు వారికి వాహనాలు కొని ఇస్తున్నారని, అందువల్లే ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. అన్ని సమస్యలు పోలీసులతోనే పరిష్కారం కావని, ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *