“ఒక్క ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంశంలో రాజకీయ జోక్యం మితిమీరడంతో పథకాల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులే కాంట్రాక్టర్లుగా అవతరించడం ఈ జాడ్యానికి మూల హేతువు. ఎన్నికల్లో నేతల గెలుపుకు కాంట్రాక్టర్లే పెట్టుబడుదారులు కావడంతో ప్రభుత్వాధి నేతలు కూడా వారి చేతుల్లో కీలుబొమ్మలుగా తయారౌతున్నారు. ఈ విధానం ఎంతో నైపుణ్యం కలిగిన ఇంజనీర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. .”
సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే .. రాజకీయ కాలకేయుల మితి మీరిన జోక్యం
ఎమ్మెల్యేలు యంపి ల కాంట్రాక్టర్లుగా అవతారం
ప్రజాప్రతినిధులుగా నేరస్తులు ఎన్నికౌతున్నందున రాజకీయాలు నేరమయమై కలుషితమయ్యాయని సాక్షాత్తు సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల రూప కల్పన, నిర్మాణంలో కూడా ఇంజనీరింగ్ నిపుణులను పక్కన పెట్టి తమ రాజకీయ ప్రచారార్భాటాల కోసం ఇంజనీరింగ్ అధికారుల పాత్రను రాజకీయ కాలకేయులు పోషించడంతోనే నేడు సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో కొన్ని , ఒకటి రెండేళ్లలో మరి కొన్ని విధ్వంసానికి గురౌతున్నాయని సాగునీటి ప్రాజెక్టుల నిపుణులు భావిస్తున్నారు. ఇది వరలో ఈలాంటి పరిస్థితి లేదు. గతంలో ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కెయల్ రావు కాంగ్రెసు పార్టీలో వున్నా ఆయన రూప కల్పన చేసిన సాగునీటి ప్రాజెక్టుల అంశంలో రాజకీయ నేతల ప్రభావం, జోక్యం ఏమాత్రం వుండేది కాదు. అప్పట్లో ఈ విభజన మధ్య గల సరళ రేఖ స్పష్టంగా వుండేది. పండిట్ నెహ్రూ హయాంలో గంగా కావేరి అనుసంధానం తెర మీదకు వచ్చింది. డాక్టర్ కెయల్ రావు ఆయన సహచరుడైన మరొక ప్రముఖ ఇంజనీర్ జి. ఏ. నరసింహారావు ఈ పథక రచన చేశారు. అప్పట్లో ఎత్తిపోతల పథకానికి మూడు వేల కోట్లు విద్యుత్ కు ఏడు వేల కోట్ల రూపాయలు అంచనా వేశారు. కాని ఏక పక్షంగా ఇంతటి భారీ పథకం చేపట్టే దానికన్నా ముందుగా ఆయా రాష్ట్రాల్లోని నదీ లోయల్లోని జలాలను సద్వినియోగం చేసుకోవడం మేలని నిర్ణయించారు. ఆలాంటి విజ్ఞత ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి లేదు.
కేంద్ర జలవనరుల శాఖకే చెందిన కేంద్ర జల సంఘం గోదావరిలో ఇతర నదీ లోయ ప్రాంతానికి జలాలను తరలించేందుకు మిగులు లేవని చెబుతున్నా తమిళ నాడు కేరళ రాష్ట్రాల్లో రాజకీయంగా పాగా వేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గోదావరి కావేరి అనుసంధానం గురించి పదేపదే జపం చేస్తోంది. డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూప కల్పన చేసిన పలు పథకాల్లో రాజకీయ నేతల జోక్యం మనకు కనిపించదు. అంతెందుకు? ఎన్టీఆర్ హయాంలో డాక్టర్ శ్రీ రామ కృష్ణయ్య ఆంధ్ర ప్రదేశ్ లోని దుర్భిక్ష ప్రాంతాలకు ప్రధానంగా రాయలసీమకు రూప కల్పన చేసిన ప్రాజెక్టుల అంశంలో ఎన్టీఆర్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. తత్ఫలితంగానే ఈ పథకాలు నేటికీ ప్రజాప్రయోజనాలుగా భాసిల్లుతున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
పొలంలో విత్తనం వేసి ఆకాశం కేసి చూచే రైతుల కన్నీళ్లు తుదవడం పక్కకు పోయింది. నేతలకు ఎన్నికల్లో వోట్లు రాలేందుకు ఆర్థికంగా అండగా నిలిచే కాంట్రాక్టర్లు కోట్లు గడించేందుకు పైగా ఎమ్మెల్యేలు యంపిలు ముడుపులు దండుకొనేందుకు అనువుగా ప్రాజెక్టుల రూప కల్పన జరగడమే క్యాన్సర్ మహమ్మారి లాగా వ్యాపించింది. అంతెందుకు? ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హంద్రీనీవా రెండవ దశ ప్రధాన కాలువ లైనింగ్ కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 936 కోట్ల రూపాయల వ్యయంతో పరిపాలన అనుమతి ఇచ్చి టెండర్లు పిలిచే దశలో స్థానిక ఎమ్మెల్యేలు అడ్డు పడ్డారు. కాలువ లైనింగ్ అక్కర లేదని వెడల్పు చేస్తే చాలని మొండి కేశారు. ఎందుకంటే లైనింగ్ అయితే కాంట్రాక్టరుకు పెద్దగా మార్జిన్ వుండదు. మట్టి పనులైతే ఎమ్మెల్యేలు కాంట్రాక్టరు నుండి భారీగా పిండుకోవచ్చని మీడియాలో వార్తలొచ్చాయి. తుదకు ముఖ్యమంత్రి లైనింగ్ కే నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నదిపై ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన జరిగింది . ఈ పథకంలో తుమ్మెడిహెట్టి వద్ద తగినన్ని నీళ్లు లేవని కేంద్ర జల సంఘం కూడా అంగీకరించినట్లు చిత్రించి ముఖ్యమంత్రిగా కెసిఆర్ దాని స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేశారు. తీరా ఇప్పుడు కేంద్ర జల సంఘం ఆలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేసినట్లు వార్తలొచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు భాగంలో నిర్మించిన బ్యారేజీల ప్రాంతాల్లో భూమి స్వభావం గురించి సమగ్ర సాంకేతిక పరిశీలన జరగలేదని తాజాగా కేంద్ర జల సంఘం నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది.రాజకీయ ఇతర స్వార్థ లాభాపేక్షతో ఇంజనీరింగ్ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించడమే ఇందుకు హేతువైంది.
ఆంధ్ర ప్రదేశ్ లో 2019 లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి రోజుల్లో కర్నూలు చీఫ్ ఇంజనీర్ 33 వేల కోట్ల రూపాయలు వ్యయంతో పలు పథకాల ప్రతి పాదనలు పంపారు. అందులో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒకటి. ఈ పాటికే వున్న ముచ్చు మర్రి ఎత్తిపోతల పథకం విస్తరణగా కర్నూలు చీఫ్ ఇంజనీర్ ప్రతి పాదన పంపితే జగన్మోహన్ రెడ్డి గొప్పలకు పోయి పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పథకంగా ప్రకటించారు. మరీ చోద్యమేమంటే రిజర్వాయర్ గర్భంలో దాదాపు 17 కిలోమీటర్లు అప్రోచ్ ఛానల్ ప్రతి పాదించారు. నేడు దాన్ని చుట్టుకున్న వివాదాలు చెప్ప పని లేదు.
ఇక పోలవరం. 2019 లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ను ఏక బిగిన మార్చి వేశారు. పైకి ఈ మార్పు సాదా సీదాగా కనిపించినా శూల శోధన చేస్తే పలు కీలకాంశాలు దృగ్గోచరమౌతాయి. 2014-19 మధ్య కాలంలో పోలవరం కాంట్రాక్టర్ వద్ద టిడిపి పెద్దలు దండా సాగించారని తాను చేసిన ప్రచారం నిజమని ప్రజలను నమ్మించడం ఒక కోణమైతే తనకు లబ్ది చేకూర్చే కొత్త కాంట్రాక్టను దీని మాటున తెర మీదకు తేవడం మరో కోణం . తత్ఫలితంగా కాల హరణంతో పలు విధాలుగా పోలవరం ప్రాజెక్టు అరిష్టాలకు బలి అయింది. పాత కాంట్రాక్టర్ అంత వరకు తాను చేసిన పనులకు ఒప్పందం మేరకు వుండే వయబిలిటీ నిబంధన నుండి సులభంగా తప్పించు కొన్నాడు. కొత్త కాంట్రాక్టర్ తట్టాబుట్టా సర్దుకోవడానికి 2019 సంవత్సరం గడచి పోయింది. ఫలితంగా సకాలంలో చేయ వలసిన పనులు పూర్తి కానందున 2020 లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిని పోలవరం ప్రాజెక్టుకు గుండె కాయలాంటి నిర్మాణం తిరిగి మొదటి కొచ్చింది .
పోలవరం కథ ఇంత వరకే పరిమితం కాలేదు. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే స్పిల్ వే కు రక్షణగా గైడ్ బండ్ నిర్మించారు. గైడ్ బండ్ నిర్మాణ దశలోనే కూలి పోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్ర జల సంఘం ఇందుకు బాధ్యలెవరని నిలదీస్తూనే వుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుక్కిన పేనులా వుండి పోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ కాంట్రాక్టర్ ను మార్పు చేస్తే కాల హరణమౌతుందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టర్ నే కొనసాగించుతున్నది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కూలిన గైడ్ బండ్ పాపం ఎవరిదో తేల్చలేని సంకటస్థితిలో కూటమి ప్రభుత్వం కూడా వుంది. అదే విధంగా ఎగువ కాపర్ డ్యాం లీకేజీ. పోలవరం ప్రాజెక్టుకు వైతరణి నదిలా అడ్డుపడుతోంది. ఇప్పుడు దాని మరమ్మతులు ఏలా చేయాలనో విదేశీ నిపుణులు సలహాలు పాటిస్తున్నారు కానీ
నిర్మాణ లోపం ఎవరిది? ఈ లొసుగుల గురించి ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇవన్నీ కెలికితే ప్రస్తుతమున్న కాంట్రాక్టర్ ను కొనసాగించడం కుదరదు. అందుకే జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న నాణ్యతా లోపాల గురించి పట్టించుకోవడం లేదు.
ఆంధ్ర ప్రదేశ్ లో 2024 లో ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ముందు వెనుక చూచుకోకుండా చంద్రబాబు నాయుడు గోదావరి బనకచర్ల అనుసంధానం గురించి పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. ఆలు లేదు చూలూ లేదనే పరిస్థితి నెల కొని వుండగా ఈ ప్రతి పాదన తెలంగాణ ప్రభుత్వం నేడు ట్రిబ్యునల్ ముందు తమ ప్రధానమైన ఆయుధం చేసుకొన్నది. 2014 లో చంద్రబాబు నాయుడు పట్టిసీమ పథకం నిర్మించిన రోజులకు ఇప్పటికి సంబంధం లేదు. నేడు ట్రిబ్యునల్ మెడ మీద కత్తిలా వేలాడుతోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో గతంలో నాగార్జున సాగర్ శ్రీ శైలం తుదకు కృష్ణా బ్యారేజ్ లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మాణం జరిగినా ఇటీవల కాలంలో చోటు చేసుకొంటున్న రాజకీయ జోక్యం ఏమాత్రం కనిపించదు.
ఒక్క ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంశంలో రాజకీయ జోక్యం మితిమీరడంతో పథకాల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులే కాంట్రాక్టర్లుగా అవతరించడం ఈ జాడ్యానికి మూల హేతువు. ఎన్నికల్లో నేతల గెలుపుకు కాంట్రాక్టర్లే పెట్టుబడుదారులు కావడంతో ప్రభుత్వాధి నేతలు కూడా వారి చేతుల్లో కీలుబొమ్మలుగా తయారౌతున్నారు. ఈ విధానం ఎంతో నైపుణ్యం కలిగిన ఇంజనీర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. చాల మంది ఇప్పటి ఇంజనీరింగ్ అధికారులకు వెన్నముక లేదని నైపుణ్యం కొరవడిందని ఆరోపించు తున్నారు. ఇది సరి కాదు. ఇంజనీరింగ్ అధికారులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించితే కాంట్రాక్టర్ల జేబులో మనుషులైన పాలకులు వారి వెన్నముక విరిచే వ్యవస్థ నెలకొని వుండటమే ఇందుకు కారణం. నోరెత్తిన ఇంజనీర్లను బదలీ చేయించే సామర్థ్యం కాంట్రాక్టర్లు చేరుకున్న నేటి పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు వెతకడం ఎండ మావుల్లో నీటిని వెతకడమే. మరీ డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి ఇపిసి విధానం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఇన్వెస్ట్ గేషన్ విభాగమే లేకుండా పోయి మొత్తం కన్సల్టింగ్ ఏజెన్సీలు కాంట్రాక్టర్ల వశం కావడంతో పథకాల అంచనాల్లోనే నిలువు దోపిడీకి లాక్ లు ఎత్తినట్లయింది.పథకాలకు ఎస్టిమేట్ లు వేయడం నిర్మాణం మొత్తంగా కాంట్రాక్టర్ల వశం కావడంతో వారి ఇష్టారాజ్యంగా తయారైంది.
– వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు