ఈ విజయం చిరస్మరణీయం
•మా బాధ్యతను మరింత పెంచింది
•కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5 : తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని, ప్రజాదరణను మరోసారి స్పష్టంగా చాటిందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ విజయాన్ని అందించిన తెలంగాణ మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులందరికీ, ఈ విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించడం, ఇదే నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య గెలవడం గర్వకారణం. ఈ విజయాన్ని సాధించేందుకు పాటుపడిన మేధావులకు, పట్టభద్రులకు, పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా.. మేధావులు మొదలుకుని అన్ని వర్గాలు, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందనడానికి ఈ విజయం ఒక నిదర్శనం. రాష్ట్రంలో అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, అసత్య ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నం చేసినా, తెలంగాణ ప్రజలు బీజేపీ వెంటే నిలబడ్డారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు చోట్ల బీజేపీ గెలవడం, మరోచోట ఉపాధ్యాయ సంఘం విజయం సాధించడం.. ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసహనానికి, బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణకు ఓ ఉదాహరణ.
ఉపాధ్యాయులు మల్క కొమురయ్యని గెలిపిస్తే, పట్టభద్రులు చిన్నమైల్ అంజిరెడ్డిని విజయతీరాలకు చేర్చారు. కాంగ్రెస్ సిట్టింగ్ సీటులో విజయం సాధించడం మా బాధ్యతను మరింత పెంచింది. ఈ బాధ్యతను నెరవేర్చేందుకు రాజీలేని పోరాటం చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విజయంలో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.