ఉధృతమవుతున్న నిరసనలు

– సీఈసీ రాజీనామా డిమాండ్‌తో దిల్లీ, ముంబయిలో భారీ ప్రదర్శనలు
– ఇతర నగరాలకూ విస్తరిస్తున్న ఆందోళనలు
– వోటర్ల జాబితా సవరణలో అక్రమాలపై విచారణకు డిమాండ్
– ఆరోపణలను ఖండించిన ఎన్నికల కమిషన్

న్యూదిల్లీ/ముంబయి, అక్టోబర్ 3: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, పౌరసమాజ సంస్థల నిరసనలు కొనసాగుతున్నాయి. వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎసఐఆర్) ప్రక్రియలో అర్హుల పేర్లు తొలగించారన్న ఆరోపణలపై గాంధీ జయంతి సందర్భంగా దిల్లీ, ముంబయిలో ప్ర<ర్శనలు జరిగాయి. దిల్లీలో శనివారం కూడా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, వోటు హక్కు పరిరక్షణ, సీఈసీ జవాబుదారీతనం ప్రధాన డిమాండ్లుగా ముందుకొచ్చాయి. దిల్లీలో అక్టోబర్ 2న జంతర్‌మంతర్‌కు చేరుకునేందుకు ప్రయత్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు, పౌరసమాజ ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారి సంఖ్యను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 550గా పేర్కొనగా, టైమ్స్ ఆఫ్ ఇండియా సుమారు 700గా తెలిపింది. ఆప్ నాయకులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, యోగేంద్ర యాదవ్, ఐసా నాయకురాలు నేహా బోరా తదితరులు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు జంతర్‌మంతర్ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా సెంట్రల్ దిల్లీలోని 12 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. శాంతియుత ప్రదర్శనకు ముందుగానే అనుమతి కోరినా తమను అడ్డుకున్నారని ఆప్ నాయకులు ఆరోపించారు. శుక్రవారం నిరసనలకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై మూడు ఎఫఐఆర్‌లు నమోదయ్యాయి. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో రెండు, కన్నాట్‌ప్లేస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం తదితర ఆరోపణలను కేసుల్లో పేర్కొన్నారు. ఏ వ్యక్తిని లేదా సంస్థను పేరుతో నిందితులుగా చేర్చలేదని పోలీసు అధికారి వెల్లడించారు. దిల్లీలో శనివారం రెండో రోజు జరిగిన నిరసనలో సుమారు వందమంది పాల్గొన్నారని రాయిటర్స్ తెలిపింది. కొందరు బారికేడ్లను తొలగించడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, నేహా బోరా నిరసనలో పాల్గొన్నారు. అయితే అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య, పేర్లను పోలీసులు వెల్లడించలేదు. ముంబయిలోని శివాజీ పార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ-సీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రదర్శన జరిగింది. జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే నేతృత్వంలోని కార్యక్రమానికి సినీ ప్రముఖులు నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, విశాల్ దద్లానీ, దర్శకుడు విశాల్ భరద్వాజ్, మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ హాజరయ్యారు. శివసేన-యూబీటీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన మద్దతు ప్రకటించాయి. నిరసన శాంతియుతంగా ముగిసింది. అవసరమైతే మూడు నెలలపాటు ఉద్యమం కొనసాగిస్తామని దీప్కే ప్రకటించారు. లఖ్‌నవూలో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ప్రతీకాత్మక ‘అస్థికలశ యాత్ర’ నిర్వహించారు. అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులతో తోపులాట జరగగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో ఎస్‌డీపీఐ ప్రకటించిన రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా కోయంబత్తూరు సౌత్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన జరిగింది. సీఈసీ రాజీనామాతోపాటు కమిషన్ పనితీరులో పారదర్శకత పెంచాలని ఆందోళనకారులు కోరారు. అహ్మదాబాద్, పట్నాలోనూ ప్రదర్శనలు జరిగినట్లు జాతీయ పత్రికలు తెలిపాయి.

పత్రికల కథనాల నేపథ్యంగా..

ఈ ఆందోళనలకు నేపథ్యంగా ఎన్నికల కమిషన్ అంతర్గత నిర్ణయాలపై వెలువడిన పరిశోధనాత్మక కథనాలు నిలిచాయి. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్ సంధూ, వివేక్ జోషి పది నెలల వ్యవధిలో కనీసం 14 సందర్భాల్లో ఎసఐఆర్ నిర్ణయాలు, ప్రక్రియలపై అభ్యంతరాలు నమోదు చేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ఈ కథనాల నేపథ్యంలో సీఈసీ రాజీనామాతోపాటు సవరణ ప్రక్రియపై స్వతంత్ర విచారణ జరపాలని సీజేపీ డిమాండ్ చేసింది. ఎసఐఆర్‌కు సంబంధించిన పేర్ల తొలగింపులను నిలిపివేయాలని, జనవరి 2025 వోటర్ల జాబితాలను భద్రపరచాలని, సంబంధిత దస్త్రాలను సుప్రీంకోర్టు లేదా న్యాయపర్యవేక్షణలోని స్వతంత్ర విచారణకు అప్పగించాలని సీజేపీ కోరింది. ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలోనూ పారదర్శకత అవసరమని పేర్కొంది. వోటర్ల జాబితాలను అధికార పార్టీకి అనుకూలంగా మార్చారన్నవి నిరసనకారుల ఆరోపణలు. వాటిని ఎన్నికల కమిషన్, ప్రభుత్వం ఖండించాయి. కమిషన్‌లో చర్చల సందర్భంగా వచ్చే ప్రశ్నలు, సూచనలను సంస్థాగత విభేదాలుగా చూడరాదని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎసఐఆర్ సహా నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని తెలిపింది. నకిలీ నమోదులు, మరణించినవారు, అనర్హుల పేర్లను తొలగించడమే సవరణ ఉద్దేశమని వివరించింది. కొత్తగా అర్హత పొందినవారిని, జాబితాల్లో పేర్లు మినహాయించిన అర్హులను నమోదు చేయాలని శుక్రవారం అధికారులను ఆదేశించింది. మరోవైపు, గోవా, కోల్‌కతా, బెంగళూరుకు ఈ నెలలో నిరసనలను విస్తరిస్తామని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 6 నుంచి ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రతిపక్ష ఎంపీలు దిల్లీలో ఎన్నికల కమిషన్ కార్యాలయానికి మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. సీఈసీ రాజీనామా డిమాండ్‌కు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మద్దతు ప్రకటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *