నగర అభివృద్ధికి ‘దిశా’ నిర్దేశం

– బల్కంపేట-ఫతేనగర్ వంతెన విస్తరణకు సీఎంకు లేఖ
– నగర శివార్లకు బోలక్‌పూర్ తోలు పరిశ్రమలు 
– నియోజకవర్గానికి 480 చొప్పున ఇళ్ల స్థలాల కేటాయింపు
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ ‘దిశ’ సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : నగర సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తార్నాకలోని సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ సమావేశ మందిరంలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం శనివారం జరిగింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, జిల్లా ‘దిశ’ కమిటీ చైర్‌పర్సన్ జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి ఫతేనగర్ వెళ్లే రైల్వే వంతెన ఇరుకుగా మారి శిథిలావస్థకు చేరినందున దాని విస్తరణ లేదా పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రికి లేఖ రాయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సనత్‌నగర్ యార్డ్ సమీప ఆర్‌యూబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాణిగంజ్ రోడ్డు (బాంబే హోటల్ వద్ద) విస్తరణ కోసం రైల్వే డీఆరఎం, జీహెచఎంసీ అధికారులతో వచ్చే సోమవారం సంయుక్త పరిశీలన నిర్వహించనున్నారు. అలాగే, లాలాగూడ సిరిపురి కాలనీ, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో ప్యాసేజ్ రోడ్లకు సానుకూలంగా అనుమతులు ఇవ్వాలని రైల్వే శాఖను కోరారు.

పేదలకు ఇళ్లు.. కబ్జాలపై కొరడా

హైదరాబాద్‌లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున స్థలాలు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.5 లక్షలు, రాష్ట్రం రూ.1.5 లక్షలతోపాటు ఉచిత స్థలం అందిస్తుండగా లబ్దిదారుడు రూ.6 లక్షలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఫిలింనగర్ రాక్ గార్డెన్, హకీం బాబా దర్గా, దీన్‌దయాల్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు, పార్కుల కబ్జాలపై తక్షణ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

కాలుష్య నివారణ – పరిశ్రమల తరలింపు

జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై భారం తగ్గించేందుకు సంగారెడ్డి, షాద్‌నగర్, ప్యారా నగర్ వంటి ప్రాంతాల్లో నూతన వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులను వేగవంతం చేయనున్నారు. ముషీరాబాద్ పరిధిలోని బోలక్‌పూర్‌లో జనావాసాల మధ్య నడుస్తున్న తోలు (లెదర్) పరిశ్రమలు, స్క్రాప్ వ్యాపారాలను వెంటనే నగర శివార్లకు (ఔటర్‌కు) తరలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

హాస్పిటల్స్ వద్ద రోగుల సహాయకులకు షెల్టర్లు

ప్రభుత్వ హాస్పిటల్స్ వద్ద రోగుల సహాయకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే కేంద్రం నిధులతో తామే నూతన షెల్టర్లు నిర్మించి ఇస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లుల బకాయిల పేరిట అంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లకు కరెంట్ కట్ చేయొద్దని అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను 20 లక్షలకు పెంచాలని, వారికి రూ.20 లక్షల వరకు బ్యాంక్ రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక, అశోక్ రెడ్డి వీణ, వాటర్ వర్క్స్, వివిధ శాఖల సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *