ఎన్నికల సంఘం నిరంకుశ ధోరణి

– ముగ్గురిలో ఇద్దరు వ్యతిరేకిస్తే అది మెజారిటీయే కదా
– మరి ప్రజాస్వామ్యాన్ని ఇంకెవరు కాపాడాలి?
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం తీరు దాదాపు నియంతృత్వ ధోరణిలోకి వెళ్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు ఎన్నికల సంఘం పనితీరును సరిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. ముగ్గురిలో ఇద్దరు ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది మెజారిటీ కాదా అని ప్ర‌శ్నించారు. ఇప్పటివరకు మెజారిటీ అంటే ఇదే కదా.. ఇప్పుడు దాని నిర్వచనం కూడా మారుతున్నట్టుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపు, తొలగించిన ఓట్లను తిరిగి చేర్చడం వంటి అంశాల్లో సందేహాలకు తావిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే అసలు మనం ఇంకా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని ఆయన నిలదీశారు. దేశ భవిష్యత్తును ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత ఉన్న సంస్థ పునాదులే బలహీనపడుతున్న పరిస్థితిలో దాని నిర్ణయాలకు వదిలేయలేమని కేటీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, పౌర సంఘాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు కలిసి ముందుకు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ఓట్ల తొలగింపుపైనా కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో అత్యధిక ఓట్ల తొలగింపులు బీఆర్‌ఎస్‌ గెలిచిన స్థానాల్లోనే ఉండటం ఆశ్చర్యం కలిగించలేదు అని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఒకే పోరాటం జరుగుతున్నదని, అది కేసీఆర్‌ వర్సెస్‌ అందరూ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి అనైతిక, అక్రమ, బహిరంగంగా ప్రకటించని కుమ్మక్కుకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఇప్పుడు ఆ కుమ్మక్కులోకి ఎన్నికల సంఘం కూడా చేరుతున్నట్టు కనిపిస్తున్నదన్నారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ న్యాయస్థానాల్లోనూ, ప్రజల మధ్యనూ పోరాడుతుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా తొలగించిన ప్రతి ఓటును తిరిగి చేర్పిస్తామని ప్రకటించారు. తెలంగాణలో ఒకే ఒక్క ‘సార్‌’ ఉన్నారు.. అది కేసీఆర్‌ సార్‌. ప్రజలకు ఆయనపై ఉన్న ప్రేమను ఏ ఎస్‌ఐఆర్‌’ కూడా ఓడించలేదు అని అన్నారు.
—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *