~ గణేష్ నిమజ్జనోత్సవాల వేళ విషాదకర ఘటన
హైదరాబాద్, ప్రజాప్రతంత్ర, సెప్టెంబర్ 24: హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవాల వేళ విషాదకర ఘటన జరిగింది. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జనం విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సె కె.వెంకన్నను గుర్తు తెలియని స్కూటీ ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గణేష్ నిమజ్జన బందోబస్తు కోసం కొత్తగూడెం నుంచి హైదరాబాద్ కు పంపించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 2 సమీపంలో ఎస్సై వెంకన్న విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఆయనను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సె వెంకన్నకు గాయాలు కావడంతో సహచర పోలీసులు వెంటనే వైద్య సహాయం అందించారు. ప్రమాదం తొలుత పెద్దగా అనిపించకపోయినా ఆ తర్వాత ఆయనకు అస్వస్థత, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తడంతో వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.
ఎస్ఐ వెంకన్న మృతి బాధాకరం : సీఎం రేవంత్ రెడ్డి
గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ-టౌన్ ఎస్ఐ కె.వెంకన్న గుర్తుతెలియని వాహనం ఢీకొన్న దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందడం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ఆయన ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. వెంకన్న మరణం ఆయన కుటుంబానికే కాక రాష్ట్ర పోలీసు శాఖ మొత్తానికి తీరని లోటని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వెంకన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్ఐ వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, అండగా నిలబడుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపి ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడిని వెంటనే గుర్తించి చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



