ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ నియామకాలు

ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మార్పీఎస్‌ ఆం‌దోళన
ఇందిరా పార్క్ ‌వద్ద  మంద కృష్ణను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: ‌డీఎస్సీలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్‌ ‌రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో నగరంలో ఆందోళనకు దిగిన ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా డీఎస్సీ ద్వారా టీచర్‌ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయడాన్ని నిరసిస్తూ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్ ‌ధర్నా చౌక్‌ ‌నుంచి మాదిగల నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో ఈ నిరసనను పోలీసుల అడ్డుకున్నారు. మంద కృష్ణ మాదిగతో పాటు, పలువురు ఎమ్మార్పీఎస్‌ ‌నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మార్పీఎస్‌ ‌నేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులను నగరంలోని వివిధ పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. ఇప్పటికైనా సీఎం రేవంత్‌ ‌రెడ్డి స్పందించి మాదిగలకు డీఎస్సీ ద్వారా వొచ్చే ఉద్యోగాలను కల్పించిన తర్వాతే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్‌ ‌చేశారు.
అలా కాకుండా ముందుగానే నియామక పత్రాలు అందజేయడం వల్ల మాదిగలు అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణలో నూతనంగా చేపట్టే ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు పాటించాలంటూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మార్పీఎస్‌ ‌నేతలను, కార్యకర్తలు ఉద్యమ కారులను అరెస్టు చేయడం స‌మంజ‌సంకాద‌న్నారు. ఎస్సీ రిజర్వేషన్‌ ‌వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వేగవంతం చేశారని విరుచుకుపడ్డారు. రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని, మాదిగలను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ ‌రెడ్డి మాలలకు కొమ్ము కాస్తూ మాదిగలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. శాసనసభ ఎన్నికల్లో మాదిగలకు నాలుగు సీట్లు తగ్గడానికి కారణం రేవంత్‌ ‌రెడ్డి అని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణను తొలుత దేశంలో అమలు చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పారని గుర్తుచేశారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన ఉద్యోగాలకు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారని తెలిపారు. అయితే రెండు నెలలు కాకముందే రేవంత్‌ ‌రెడ్డి మాదిగలకు వెన్నుపోటు పొడిచారని మంద కృష్ణ విమ‌ర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *