– ప్రొరేటా ప్రకారం అంతర్రాష్ట్ర జలాల విడుదలపై చర్చించాలి
– ఎగువ రాష్ట్రాలతో సమన్వయం చేసుకోండి
– వర్షా కాలంలోపు డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలి
– పంట మార్పిడి.. పంటల వైవిధ్యతపై అవగాహన కల్పించండి
– నగరంలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మాణాలు పూర్తి కావాలి
– సమస్యల పరిష్కారంలో కలెక్టర్లు, ఎస్పీల మధ్య సమన్వయం అవసరం
– వర్షాకాల సన్నద్ధత సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావారణ శాఖ నివేదిస్తున్నందున కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా దక్కేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలు డ్యామ్‌లు నిండిన తర్వాతే నీళ్లు వదిలే విధానాన్ని పాటిస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయనిన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొనేలా ఉన్నందున అంతరాష్ట్ర జలాల్లో ప్రొరేటా ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటా వచ్చేలా ఆయా రాష్ట్రాల అధికారులతో ముందుగానే చర్చించి తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాకాల సన్నద్ధతపై సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. కోయనా డ్యామ్ నీటిని వంద శాతం జల విద్యుదత్పత్తికే మహారాష్ట్ర వినియోగిస్తోందని, ఆ మొత్తం నీటిని మనం తీసుకుని వారికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయడంపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చించాలని సీఎస్ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. గోదావరి నది నుంచి ఏటా వేల టీఎంసీల జలాలు సముద్రం పాలవుతున్నాయని, అయితే ఆ వరదంతా చాలా స్వల్ప కాలంలోనే వస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో ఇటు గోదావరి, అటు ప్రాణహితల వైపు నుంచి వచ్చే వరదను ఎలా మళ్లించాలనే దానిపై స్పష్టమైన విధానం రూపొందించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నిర్మించిన సీలేరు, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో తెలంగాణకు రావాల్సిన వాటాపై నివేదిక రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలంటూ డ్యామ్‌ల నిర్వuహణపై ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు. గతంలో కడెం ప్రాజెక్టులో తలెత్తిన ఇబ్బందులను గుర్తు చేశారు. గేట్ల మరమ్మతులు, మెయింటెనెన్స్‌కు సంబంధించి ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశామని ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎన్ని నిధులు అవసరమైనా వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ వర్షాకాలంలో ఎక్కడైనా డ్యామ్‌ల విషయంలో ఇబ్బందులు తలెత్తితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
తక్కువ నీరు అవసరమయ్యే పంటలపై అవగాహన కల్పించాలి
వాతావరణ శాఖ అంచనాలు, నివేదికల ఆధారంగా పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పంటల మార్పిడి, పంటల వైవిధ్యత, తక్కువ నీరు వినియోగించుకునే పంటలు, పంట రకాల సాగుపై రైతు వేదికల నుంచి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ విషయంలో ఏఐ టెక్నాలజీతో రూపొందించిన వీడియోలను ప్రదర్శించాలని సీఎం తెలిపారు. టీవీ ఛానెళ్లలోనూ ఇందుకు సంబంధించిన ప్రసారాలు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంటల సాగుతోపాటు అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరాలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రామగుండం ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా అంతా తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
హామీల అమలుపై నివేదిక ఇవ్వాలి
గతేడాది వరదల సమయంలో కామారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తాను క్షేత్రస్థాయిలో పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీల అమలుపై అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నాడు ఇచ్చిన హామీలు.. వాటి ప్రస్తుత పరిస్థితి.. ఏవైనా నెరవేరకుంటే అందుకు కారణాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. హామీల అమలులో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విపత్తుల సమయంలో విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం వాటిల్లినప్పుడు తక్షణమే అధికారులు స్పందించాలని సూచించారు. వడగాలులు, వరదల సమయంలో ప్రజలు ప్రాణాలు, ఆస్తులు కోల్పోయినప్పుడు వెంటనే ఎఫఐఆర్‌లు నమోదు చేసి బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలన్నారు. వరదల సమయంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, కూలిన వంతెనల స్థానంలో నూతన వంతెనల నిర్మాణం, ఇతర పనులకు విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1000 కోట్లను నిబంధనల ప్రకారం వ్యయం చేయాలని సీఎం సూచించారు.
నగరంలో ఇంకుడుగుంతలు నిర్మించాలి
క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వర్షాకాలంలో రోడ్లపై వరద నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. నీరు నిలిచే 141 ప్రదేశాలను గుర్తించి వర్షపు నీటిని ఒడిసిపట్టే బావులు నిర్మించాలని గతంలో నిర్ణయించామని, వాటి పురోగతి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే 11 వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పూర్తి చేశామని, మిగతా వాటి పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీనియర్ అధికారి జయేశ్ రంజన్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలో సమస్యల పరిష్కారానికి ముగ్గురు కమిషనర్లు, మూడు నగరాల పోలీస్ కమిషనర్లు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం సూచించారు.
ఎక్కడా తాగునీటి ఇబ్బందులు ఉండొద్దు
వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలో ఏ ప్రాంతాలోనూ తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుంచే తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు సీఎంకు తెలియజేశారు. పరిస్థితికి తగినట్లు తాగు నీరు, విద్యుదుత్పత్తి, సాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కేటాయింపులు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ వర్షాకాలానికి అవసరమైన సామగ్రిని ముందుగానే సమీకరించుకోవాలని సూచించారు. గాలిదుమ్ములు, భారీ వర్షాలతో ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నపుడు, లైన్లు తెగిపోయి సరఫరా నిలిచినప్పుడు తక్షణమే స్పందించి మరమ్మతులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు.
సమన్వయంతో ముందుకు సాగాలి
జిల్లాల స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు నిర్ణీత సమయంలో భేటీ అవుతూ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో ముందుకు సాగుతే ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు. రాష్ట్రస్థాయితోపాటు జిల్లా, మండల స్థాయిలోనూ రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్య, విద్యుత్, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని సీఎం అన్నారు. సమీక్షలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, డీజీపీ సి.వి.ఆనంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, వికాస్ రాజ్, దాన కిశోర్, టి.కె.శ్రీదేవి, ఏ.వి.రంగనాధ్, నవీన్ మిట్టల్, సురేంద్ర మోహన్, క్రిస్టినా జోంగ్తూ, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు ఆర్.వి.కర్ణన్, సృజన, వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





