– సేకరణ ప్రక్రియను పూర్తికి మొదటి వారం వరకు గడువు
-ఇప్పటి వరకు 64 లక్షల మెట్రిక్ టన్నులు సేకర‌ణ‌
– 9.31 లక్షల మంది రైతులకు రూ.11,500 కోట్లు చెల్లింపు
-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తిరుమలగిరి (సూర్యాపేట), జూన్ 1: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధాన్యం సేకరణ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని, ఇప్పటికే కొనుగోలు కేంద్రాల నుంచి అధిక శాతం నిల్వలను రైస్ మిల్లులకు తరలించామని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు క్షేత్రస్థాయి తనిఖీని కొనసాగిస్తూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి  సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, ఫణిగిరిలోని సేకరణ కేంద్రాలను సందర్శించారు. కొనుగోళ్ల వేగం, నిల్వల తరలింపు, రవాణా ఏర్పాట్లు, రైతులకు చెల్లింపులను ఆయన సమీక్షించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్, జిల్లా అధికారులు, పౌర సరఫరాల సిబ్బందితో కలిసి మంత్రి, యాసంగిలో కొనసాగుతున్న సేకరణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న అధికారులు, రైతులతో మాట్లాడారు. “భారీ సేకరణ ప్రక్రియ సత్ఫలితాలనిస్తోంది. పెద్ద మొత్తంలో వరి ధాన్యాన్ని ఇప్పటికే మిల్లులకు తరలించడంతో, సేకరణ కేంద్రాలపై ఒత్తిడి తగ్గింది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వరి కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌లలో ఇదే అతి పెద్దదని, తెలంగాణ ఇప్పటి వరకు 8,575 సేకరణ కేంద్రాల ద్వారా దాదాపు 64 లక్షల మెట్రిక్ టన్నుల  ధాన్యాన్ని సేకరించామని ఆయన తెలిపారు. రైతులకు న్యాయమైన ధర అందేలా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. అందుకే, అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న వరిని కూడా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. “వర్షంలో తడిసిన వరిని కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి గింజను కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది,” అని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లాతో సహా వివిధ జిల్లాల్లో సేకరణ కార్యకలాపాలు సజావుగా సాగేలా కృషి చేసిన కలెక్టర్లు, ఎమ్మెల్యేలు మరియు పౌర సరఫరాల బృందాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు.  జూన్ మొదటి వారం చివరి నాటికి సూర్యాపేటలో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాకు కూడా ఇదే విధమైన సూచనలు జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే 9.31 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.11,500 కోట్లు బదిలీ చేసిందని ఆయన చెప్పారు. గతంలో చెల్లింపులకు వారాలు లేదా నెలలు పట్టేదని, కానీ ఇప్పుడు రైతులకు 48 నుంచి 72 గంటల్లోపే డబ్బు అందుతోందని ఆయన తెలిపారు. రవాణా కొరతను అధిగమించడానికి, కొనుగోలు పూర్తయ్యే వరకు వరి రవాణా కోసం అందుబాటులో ఉన్న అన్ని లారీలు, భారీ వాహనాలను వినియోగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించిందని మంత్రి తెలిపారు. కేంద్రం యొక్క కొనుగోలు విధానాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ 75 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండగా, కేంద్ర ప్రభుత్వం కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే అంగీకరిస్తోందని, దీంతో రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడుతోందని ఆయన అన్నారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామి వరి ఉత్పత్తి రాష్ట్రంగా అవతరించిందని, భారతదేశ యాసంగి వరి సేకరణలో దాదాపు 63 శాతం వాటా తెలంగాణదేనని మంత్రి తెలిపారు.  మిగిలిన కొనుగోళ్లు అనుకున్న సమయానికి పూర్తవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, మొత్తం సరుకులను కొనుగోలు చేసి మిల్లులకు తరలించే వరకు ప్రభుత్వ యంత్రాంగం రేయింబవళ్లు పనిచేస్తూనే ఉంటుందని రైతులకు హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.