గూడేల్లో గుడిసె కనిపించొద్దు

– ఆదివాసీగూడేల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి
– ఆదిలాబాద్‌కు నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా
– కొఠారి గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం
– ఇండ్ల లబ్దిదారులతో సీఎం రేవంత్ ముఖాముఖి

ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : వెనుకబడిన ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ఆదివాసీల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపుతామని ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా మాట ఇచ్చానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క) జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేకానంద, పార్లమెంటు సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ కె.హరిత, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, గ్రామ సర్పంచ్ మడావి సంపాబాయిలతో కలిసి ప్రారంభించి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆదివాసీగూడేలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావించిందని, రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. గృహ నిర్మాణ శాఖ సమన్వయంతో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని గూడేలు, ఆదివాసీ ప్రాంతాలలో ప్రత్యేకంగా 21 వేల ఇండ్లు కేటాయించి అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడినుండి ప్రారంభిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనున్నట్లు చెప్పారు. సామÖహిక గృహ ప్రవేశాల అనంతరం ఆయన ఇండ్ల లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో లక్షమంది ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నారని తెలిపారు. ఏ గూడెంలోనూ ఇండ్లు లేని పేదలు ఉండకూడదని, రాష్ట్రంలోని గూడేల్లో ఒక్క గుడిసె కూడా కనిపించొద్దని, పక్కా ఇండ్లు ఉండాలని అన్నారు. ఆదివాసి బిడ్డలందరికీ ప్రభుత్వం నుంచి అమలు చేసే ప్రతి పథకాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ సమన్వయంతో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని గూడాలు, ఆదివాసి ప్రాంతాలలో ప్రత్యేకంగా 21 వేల ఇండ్లు కేటాయించి అర్హులైన వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ఇదే తేదీన అన్ని గూడేల్లో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించుకుని పండుగ చేసుకుందామన్నారు. గూడేల్లో ఇండ్లు లేని పేదలను గుర్తించేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూచిస్తున్నానన్నారు. స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆదివాసీ, గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయండి.. పాత ఇందిరమ్మ ఇండ్లకు గోడలు బాగున్నా పైకప్పు పాడై కొందరు ఇబ్బందులు పడుతున్నారు.. అలాంటి వారికి స్లాబ్ వేసుకునేందుకు అదనంగా నిధులు మంజూరు చేయాలని మంత్రికి సూచించారు. మీ అందరినీ చూస్తుంటే దసరా పండగకు వచ్చినట్లుగా ఉందన్నారు. మీ సంతోషం కంటే మాకు ఎక్కువ ఏదీ కాదన్నారు. మహిళలను ఇంటి పెద్దగా గుర్తించి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్న బియ్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్నున్నామని వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళల రుణ పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను వివిధ వ్యాపార రంగాలలో భాగస్వాములను చేస్తున్నామని, మహిళలను బస్సులకు యజమానులను చేస్తూ రాష్ట్రంలో వేయి బస్సులను కేటాయించామని, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణలో మహిళలకు అవకాశం కల్పించి ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రోత్సహిస్తున్నామని కూడా చెప్పారు. ఇల్లు రాని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హత గల ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తున్నామంటూ ఇందిరమ్మ ఇల్లు పొందిన వారు ఇల్లు నిర్మించుకోవాలని కోరారు. పోటీ ప్రపంచంలో విద్య ఎంతో అవసరమని, అందరూ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుని పిల్లల్ని బాగా చదివించుకోవాలని, చదువుతోనే మీ జీవితాల్లో మార్పు వస్తుంది.. వెలుగులు తెస్తుంది.. అందరూ మీ పిల్లల్ని చదివిస్తామని నాకు మాట ఇవ్వండి.. వాళ్లు బాగుంటేనే మీ జీవితాలు బాగుపడుతాయి అని సూచించారు.

మాది చేతల ప్రభుత్వం : మంత్రులు పొంగులేటి, సీతక్క

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలు తెలుసుకుని సమకూర్చేందుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నదని తెలిపారు. అర్హత గల ప్రతి పేదవాడికీ ఇల్లు మంజూరు చేస్తున్నామని, తమది ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో మారుమూల గ్రామానికి వచ్చి ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసి పివిటిజి గూడేలలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. కూడు- గూడు- గుడ్డ అందించడంతోపాటు పిల్లలందరికీ సరైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో జనాభా ప్రాతిపదికన అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మూడు కుటుంబాలతో గృహ ప్రవేశాలు
తొలుత సిడం కన్నీబాయి, టెకం పగ్గుబాయి, ఆత్రం పోచుబాయిలకు చెందిన మూడు ఇందిరమ్మ గృహాలను ముఖ్యమంత్రి ప్రారంభించి లబ్దిదారుల కుటుంబ సభ్యులతో గృహప్రవేశం చేయించారు. అనంతరం గ్రామంలో షియర్ వాల్ సాంకేతికతతో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో  ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *