బిఆర్‌ఎస్‌ ‌మనుగడకు బీసీల అండ కావాలి?

కుల గణన సర్వే ఎలా చేసినా బీసీ ప్రజల జనాభా 50 నుంచి 55% మధ్యలో ఉండే అవకాశం మెండుగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. దేశానికి స్వాతంత్రం వొచ్చినా, మన రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకున్నప్పటికీ ప్రభుత్వ వ్యవస్థలలో బిసి ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీ ప్రజలకు తగిన న్యాయం జరుగుతుందని ఉద్యమకారులు ముఖ్యంగా బీసీ విద్యార్థులు యువత ఉద్యోగులు ఆశించారు. కానీ ఒకటి రెండు ఆధిపత్య కులాలు ముఖ్యంగా దోపిడీ సంస్థలు, వ్యక్తులు మాత్రమే గత పదేళ్ల  నుంచి ఇష్టానుసారం పరిపాలించి అన్ని రకాల వనరులను సొంతం చేసుకున్న వైనం ఇటీవల తెరపైకి వొస్తున్న ఉదంతాలు తెలియజేస్తున్నాయి. టిఆర్‌ఎస్‌/ ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ బీసీలను అన్ని రంగాల్లో అణచివేతకు గురిచేసిందని చెప్పడానికి అనేక సాక్షాధారాలు ఉన్నాయి. ఒక్క కుటుంబం నుంచి రాష్ట్ర క్యాబినెట్‌లో నలుగురు సభ్యులు అతి ప్రాముఖ్యత గల మంత్రిత్వ శాఖలను పంచుకున్నారు.

కనీసం శాసనసభలో , శాసనమండలిలో తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్‌ ‌సబ్సిడీ రుణాల కోసం ఐదు లక్షల దరఖాస్తులను స్వీకరించిన బారాస ప్రభుత్వం బిసి యువతకు పైసా కూడా విదిలించలేదు దివంగత ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజు రియింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలను బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నిలిపివేసింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడిపోయిన నీతో పాటు మీ సామాజిక వర్గం నాయకులకు అత్యంత ఉన్నత స్థాయి పదవులను అంటగట్టి బీసీ నాయకులకు మేధావులకు మొండి చేయి చూపించి అవమానపరిచింది నిజం కాదా? స్థానిక సంస్థలలో వెనుకబడిన కులాలకు ఉన్న ఆ కాస్త 33% రిజర్వేషన్లను గత ప్రభుత్వం 18 శాతానికి కుదించి వేసింది. ప్రస్తుతం అధికారం కోల్పోయిన సందర్భంలో ఇప్పుడైనా బీసీ నాయకున్ని శాసనసభ పక్ష నాయకునిగా నియమించలేదు. కుటుంబ పార్టీగా అవతరించిన  బిఆర్‌ఎస్‌ ‌లో ఎన్ని సంవత్సరాలకైనా, ఎన్నడైన ముఖ్యమంత్రి పదవి ఎస్సీ, ఎస్టి లేదా బీసీ నాయకులకు దక్కుతుందా అని బిసి ప్రజలు కల్వకుంట్ల కవితను, కల్వకుంట రామారావును ప్రశ్నిస్తున్నారు.

ప్రజల కష్టాలతో, త్యాగాలతో ఏర్పడ్డ టీఆర్‌ఎస్‌లో అందరికీ భాగస్వామ్యం ఉంటుందని భావించిన ఈటల రాజేందర్‌ ‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ ‌చేసి అక్రమ కేసులు బనాయించి పార్టీ నుండి గెంటివేసిన నాడే బహుజన కులాల ప్రజలు అవమానపడ్డారు. బిఆర్‌ఎస్‌ ఒక్క కుటుంబానికి మాత్రమే చెందిందని ప్రజలు అర్థం చేసుకున్న తర్వాత మీ ప్రభుత్వం ఓడిపోయిందని ఇప్పటికైనా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అంగీకరిస్తే మంచిదే. రాష్ట్రంలో అధికారం కోల్పోయి లోక్‌సభలో అడుగు పెట్టడానికి కూడా ఒక్క అభ్యర్థి గెలవకపోవడంతో చతికిలబడిన పార్టీ అధినాయకత్వం ప్రస్తుతం బీసీల వోట్లను లక్ష్యంగా ఎంచుకోవడం ఒక అనివార్యత అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత పదేళ్లలో అతిపెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్‌ ‌కంటే అత్యధిక వనరులు సమకూర్చుకున్న బిఆర్‌ఎస్‌ ‌బీసీ ప్రజల వోట్లను ఏ విధంగానైనా వశపరచుకోవచ్చునని అంచనా వేయడంలో తప్పేమీ లేదు. మీ భవితవ్యమంత బిసి ప్రజల వోటర్ల, యువత, నాయకుల రాజకీయ చైతన్యంపై ఆధారపడి ఉంటుంది.

తెలంగాణ సాధించిన సెంటిమెంట్‌తో అధికారాన్ని పొంది అణగారిన ప్రజలను మరింత అణచివేతకు గురిచేసి ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుని ఓడిపోయిన తరువాత బీసీ నినాదంతో ముందుకు రావడం ప్రజలకు ఎంత మాత్రం ఆశ్చర్యం కలగడం లేదు. కల్లబొల్లి కబుర్లు చెప్పడంలో కానీ వేషాలు మార్చడంలో గానీ ప్రజలను మభ్య పెట్టడంలో గానీ జర్మనీ గోబెల్స్ ‌ను మించిన వారికి అన్నీ సాధ్యమే అనుకుంటారు. రాజకీయాల్లో వేషాలు మార్చడం, మాటలు మార్చడం, ఎత్తుగడలు మార్చడం, హామీలు, పథకాలు మార్చడం మీకు వెన్నతో పెట్టిన విద్య. అన్ని రకాల ప్రచార మాధ్యమాలు కలిగిన ఒక పార్టీకి ప్రజలను మభ్య పెట్టడం అంత కష్టమేమీ కాదని మీ నమ్మకం. ఈ బాగోతం అంతా గత పది సంవత్సరాల నుంచి ప్రజలు చాలా వరకు అర్థం చేసుకున్నారని బిఆర్‌ఎస్‌ అధినాయకత్వం అర్థం చేసుకుంటే ఇంకా మంచిది. ప్రజాస్వామ్యం , సామాజిక న్యాయం మచ్చుకైనా కనిపించని బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో బీసీ ప్రజలకు ఏ విధమైన న్యాయం జరిగింది, ఇక ముందు జరగబోతుందని ప్రజలు నమ్ముతారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇకముందు అధికారం పొందాలని కోరుకునే కల్వకుంట్ల కవిత ప్రజలకు ఉన్న ఈ ప్రశ్నలు అనుమానాలకు సమాధానాలు చెప్పవలసిన అవసరం ఉందని ఈ వ్యాసం ద్వారా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఒక్క సంవత్సరం పూర్తి కాకముందే తెలంగాణ రాష్ట్రం తెర్లైపోయిందని కుటుంబ సభ్యులంతా రోడ్డుకెక్కడం తెలంగాణ ఉద్యమకారులకు బహుజన ప్రజలకు విడ్డూరంగా కనిపిస్తున్నది.

పదేళ్ల పాలనలో మిగులు రాష్ట్రం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఆగమైపోయింది. విద్య, వైద్య సంస్థలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కుటుంబానికి అడుగులకు మడుగులెత్తే నాయకులకు విద్య వైద్య కార్పొరేట్‌ ‌సంస్థలు అప్పగించి రాష్ట్ర ప్రజలను దోపిడీకి వదిలివేశారు. ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసు అధికారులను నియమించి ప్రజలను నిర్బంధాల గురించి చేసిన ఉదంతాలు ప్రజలు మర్చిపోలేదు. మళ్లీ అధికారం ఇస్తే ఈ తెలంగాణ ప్రజలకు చిప్ప కూడా మిగలదని తెలంగాణ ఉద్యమకారులు బాధిత ప్రజలు భావిస్తున్న తరుణమిది. అధికారానికి, సంపాదనకు, ఆధిపత్యానికి అలవాటు పడ్డ నాయకులు అధికారం పోగానే నిరంతరం ఇలాంటి ఆగడాలు చేయడం ఇటీవల కాలంలో కొత్తదేమి కాదు. 2014లో చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు పేద ప్రజలు ముఖ్యంగా బహుజన వర్గాలలో ఎన్నో ఆశలు రేకెత్తించాయి కానీ కలవకుంట్ల చంద్రశేఖర రావు పది సంవత్సరాల పాలనలో 90 శాతం బడుగు బలహీన వర్గాలు నిరాశ నిస్పృహలకు లోను కావడమే కాకుండా ప్రభుత్వ ఖజానా రాష్ట్ర సహజ వనరులు మొదలైన అనేక రకాల సంపద దోపిడీకి గురికావడం జరిగింది. తెలంగాణ సెంటిమెంటు ఆవిరిపోయింది. ఇప్పుడు పార్టీ ఆదినాయకత్వం బీసీల వోట్లే లక్ష్యంగా ముందుకు వొచ్చింది.

బీసీ ఉద్యమంలో పార్టీ ఏజెంట్లను కూడా ముందు వరుసలో నిలబెట్టింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా తమ వాదనలను వినిపించుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా పేదలకు అణగారిన వర్గాలకు న్యాయం జరగడం కూడా ఒక హక్కే అని పాలకవర్గాలు ముఖ్యంగా అల్పసంఖ్యాకులైన కులాలకు సంబంధించిన నాయకులు మర్చిపోకూడదు. కేవలం ఒక్క శాతానికి కూడా ఆమడ దూరంలో ఉన్న సామాజిక వర్గం 55% సామాజిక వర్గం ఉన్న ప్రజలను అధికార, ఆదాయ, అవకాశాల పంపిణీలో తీవ్ర అణిచివేత గురి చేయడం కూడా భరించరాని అవమానం..  అప్రజాస్వామ్య పాలన అవుతుంది. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో అనేక రకాల వాగ్దానాలు ముందుకు వొస్తుంటాయి . అందులో భాగంగా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్‌ ‌భారతదేశం లో కూడా గత 75 సంవత్సరాల నుంచి అణిచివేత గురి చేయబడిన బీసీ ప్రజల వోట్లే లక్ష్యంగా అనేక పార్టీలు ముందుకు రావలసిన పరిస్థితులు అనివార్యంగా ఏర్పడ్డాయి. అతి స్వల్పమైన సామాజిక వర్గానికి చెందిన నాయకత్వంలో నడుస్తున్న భారత రాష్ట్ర సమితి పార్టీ బీసీల వోట్లు లేకుండా శాసనసభ,  లోక్‌సభలలో ఒక్కరు కూడా అడుగు పెట్టలేదు.

ఆ మాటకు వొస్తే బీసీల వోట్లు లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్‌, ‌భాజపా వామపక్ష పార్టీలతో పాటు ఆ మాటకు వొస్తే బిఆర్‌ఎస్‌ ‌పార్టీ చట్టసభలలో అడుగు పెట్టలేదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అనేక దశాబ్దాల కాలం అణచివేతకు గురైన బీసీ ప్రజల వోట్లే ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో వికారాన్ని నిర్ణయించే దిశకు చేరుకున్నది. ఇప్పుడిప్పుడే బీసీ ప్రజల్లో ముఖ్యంగా యువతలో బిసి చైతన్య వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే కల్వకుంట్ల, రామారావు, కల్వకుంట్ల కవిత ఒక పకడ్బందీ వ్యూహంతో బీసీల జపం ప్రారంభించారు. గత రెండు మూడు సంవత్సరాల ముందే విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్‌ అ‌గ్ర నాయకుడు రాహుల్‌ ‌గాంధీ సామాజిక న్యాయం, బీసీలకు ఉద్యోగాలలో చట్టసభల్లో తగిన అవకాశాలు లభించాలని ఎజెండాతో జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. అందులో భాగంగానే 2023 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం జనగణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

సమగ్ర నివేదిక వొచ్చిన తర్వాత ఈ అణగారిన బీసీ ప్రజల కాంక్షలు నెరవేర్చడానికి, సామాజిక న్యాయం కొరకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే. గత పదేళ్లలో తమ సామాజిక వర్గానికే పెద్ద పీట వేసి 55% జనాభా ఉన్న ప్రజలను అన్ని రంగాల్లో తీవ్ర అణచివేతకు అన్యాయానికి గురిచేసిన బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆదినాయకత్వం ప్రస్తుతం బీసీల పట్ల అపారమైన ప్రేమ చూపిస్తూ మొసలి కన్నీరు కార్చడం ప్రపంచంలోనే ఒక వింతగా తోస్తున్నది. బీసీల పట్ల ప్రేమ చూపించే ముందు బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ప్రజాస్వామ్యాన్ని ఆచరించండి. పార్టీ ప్రెసిడెంట్‌ ‌గానీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌గానీ బీసీ నాయకులకు అప్పగించండి. భవిష్యత్తులో ప్రభుత్వం వొస్తే బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని భారీ బహిరంగ సభలో ప్రకటించండి. అన్ని ప్రచారం మాధ్యమాల ద్వారా తెలియచేయండి. అప్పుడు మాత్రమే బీసీ జెండాతో ప్రజల ముందుకు వొస్తే ఆహ్వానిస్తారు. మోసపోయిన బీసీ ప్రజలు మళ్లీ నమ్మి వోటు వేసి నిర్బంధాలు, దోపిడీని, నిరంకుశ కుటుంబ ఆధిపత్యాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా లేరని ఈ వ్యాసం ద్వారా గుర్తు చేస్తున్నాం.
image.png
ప్రొ।। కూరపాటి వెంకట్‌ ‌నారాయణ
తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *