తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే రాష్ట్ర ఖజానాకు 65 శాతం ఆదాయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి ివివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు పోతున్నామని, ప్రపంచంలోనే పోటీ పడుతున్న హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని హెచ్‌ఎండిఏ ఐమాక్స్ గ్రౌండ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వివిధ అభివృద్ధి పనులకు ఆయన వర్చువల్ గా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోకియో నగరాలకు దీటుగా ముందుకు తీసుకెళ్లాలని, నగర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. సుమారు రూ. 7వేల కోట్లతో భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఈ రోజుతో యేడాది పూర్తైన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన్నారు.
హైదరాబాద్ నగరానికి ప్రపంచంలోనే ప్రత్యేకమైన స్థానం ఉందని, నగరం ప్రపంచంతో పోటీ పడేలా ఎదుగుతుందన్నారు. భవిష్యత్ తరాలకు అందమైన కాలుష్య రహిత నగరాన్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాబోయే సంవత్సరానికి నేటి నుండే కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఖజానాకు 65 శాతం ఆదాయం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండే వస్తుందని సి.ఎం తెలిపారు. తెలంగాణ మణిహారంగా 360 కిలోమీటర్లతో రీజినల్ రింగ్ రోడ్ నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందుకు కేంద్రంపై వొత్తిడి తీసుకువస్తున్నామన్నారు. రేడియల్ రోడ్లు వేయాలని, నివాస గృహాల నిర్మాణంతో పాటు కార్పొరేట్ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఎస్.టి.పి, ఫ్లైఓవర్లు, నాలాలు, హైదరాబాద్ నగరానికి కావాల్సిన త్రాగు నీటి సరఫరా, అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చుతున్నట్లు, జంక్షన్లు, పార్కుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ పనులు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి పక్షాలు అడ్డు పడకుండా సహకరించాలని కోరారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుతున్నాం. : మంత్రి పొన్నం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుతూ, దాదాపు 7 వేల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపనలను ముఖ్యమంత్రి ప్రారంభించారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిఎచ్‌ఎంసి పరిధిలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ను గుర్తించి సంపులను నిర్మాణం లు చేశామని, ఇప్పుడు రహదారులపై నీరు నిలువకుండా వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ తీసుకొచ్చారని, గతంలో ఏ పాలకులు చేయని విధంగా ఆయన ఆలోచన నుండి వచ్చిందన్నారు. ఎస్.టి.పి ల నిర్మాణాలు, వాటర్ స్టోరేజ్ కు సంబందించిన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. గోదావరి ఫేజ్ 1,2,3 లు హైదరాబాద్ జలాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే తెచ్చాయన్నారు.
మూసి పునర్జీవం చేసి అక్కడి పేద ప్రజలు మంచిగా బతకాలని ముఖ్యమంత్రి ప్రణాళిక అన్నారు. మూసి అభివృద్ధి గతంలో మాటలకే పరిమితమై బోర్డును మాత్రమే ఏర్పాటు చేశారని విమర్శించారు. మూసి అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. మూసి పునర్జీవనం పూర్తయితే హైదరాబాద్ కి ప్రపంచలోనే ఒక మంచి బ్రాండ్ సంపాదించుకోవచ్చన్నారు. మూసీ రివర్ బెడ్ లో నివసిస్తున్న వారికి మంచి భవిష్యత్ ఇవ్వడానికి మూసీ పునరుజ్జీవనం చేస్తున్నామన్నారు. దిల్లీ లో ఎదురవుతున్న సమస్యలు హైదరాబాద్ కి రావొద్దని కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులు నడిపించాలని ముఖ్యమంత్రి ఆలోచన అని మంత్రి చెప్పారు. ఆర్‌టిసీ బస్సుల స్థానంలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ పాత, కొత్త నగరం అన్న తేడా లేకుండా ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని మంత్రి తెలిపారు.
కాలుష్య నివారణకు కృషి : మంత్రి శ్రీధర్‌బాబు
నగర ప్రజలకు కలుషితం లేని నీరు, గాలి అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గతేడాది ఈరోజున ప్రజలు మార్పు కోరుకున్నారని, మేము ఇచ్చిన హామీలు గత సంవత్సర కాలంలో తీరుస్తూ వస్తున్నామని, సిటీలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడే విధంగా ప్రోత్సహిస్తున్నామని, హైదరాబాద్ మహా నగరం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ దేశానికే తలమానికం : డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని, హైదరాబాద్ నగరం దేశానికే తలమానికమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్ ను గొప్ప నగరం గా మార్చేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఓఆర్‌ఆర్, మంచినీటి పథకాలు, అనేక పరిశ్రమలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినవేనని అన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీ గా మార్చేందుకు మూసీ కి పునరుజ్జీవనం పోసి, పరివాహక ప్రాంత ప్రజలకు మంచి జీవనం కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే, ప్రతిపక్షాలు మూసి పరీవాహక ప్రాంత ప్రజలు మురికి కూపం లోనే ఉండాలని కుట్రపూరిత బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మూసీ లో నివసించే ప్రజలకు మంచి జీవితం అందించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
అంతకు ముందు సభ ప్రాంగణంలో వివిధ విభాగాల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి, మంత్రులు సందర్శించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. వివిధ కళారూపాల నృత్యాలు, డప్పులతో సి.ఎం, మంత్రులకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారుల గేయాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు, ఎంపీలు వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ లు, మాజీ ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.