ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా కు తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. మంగళవారం హైడ్రా కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా ఆవిర్భావం తర్వాత జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు చెరువులు, కుంటలు ఆక్రమణల నుంచి విముక్తి పొందాయి. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి నగరంలోని పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ సంస్థ నిరంతర శ్రమిస్తోంది.
హైడ్రాకు మరింత శక్తివంతమైన అధికారాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా హైడ్రా అనేక విస్తృత అధికారాలను పొందుతూ, చెరువుల రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను అధునాతన సాంకేతిక పద్ధతులు, వాహనాల కొనుగోలు, కార్యాలయ నిర్వహణకు ఉపయోగించనున్నారు. ఈ నిధులు హైడ్రా పనితీరుకు మరింత బలం చేకూరుస్తాయి. ఈ చొరవతో చెరువుల సంరక్షణ, పర్యావరణ రక్షణలో హైదరాబాద్ నగరం దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బడంగ్ పేటలో అక్రమ నిర్మాణం కూల్చివేత కాగా బడంగ్‌పేట కార్పొరేషన్‌లో హైడ్రా కొరడా ఝుళిపించింది. అల్మాస్‌గూడ 5వ డివిజన్‌లోని వెంకటేశ్వర కాలనీలో పార్కు స్థలాన్ని ఆక్రమించి, ఓ వ్యక్తి కంటైనర్ ఏర్పాటు చేసిన ఘటనపై హైడ్రా, పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాలనీ వాసులు ఈ సమస్యను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి నివేదించారు. గతంలో ఈ ఘటనపై కమిషనర్, హైడ్రా, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వెంటనే చర్యలు తీసుకోవడం లేదని వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న లక్ష్మారెడ్డి, హైడ్రా, మున్సిపల్, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున హైడ్రా, ర్‌పేట్ పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టి, పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన కంటైనర్‌ను ధ్వంసం చేశారు. చిన్నారులు ఆడుకునేందుకు ఆటవస్తువులను తిరిగి ఏర్పాటు చేశారు. హైడ్రా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, ఇతర పార్కు స్థలాల ఆక్రమణలపై కూడా ఫిర్యాదులు అందాయని, వాటిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ చర్యలతో బడంగ్‌పేటలో భూకబ్జాదారులకు గట్టి హెచ్చరిక వెళ్లిందని విశ్లేషకులు అంటున్నారు.