– గుజరాత్ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ఆహ్వానం
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
అహ్మదాబాద్, నవంబర్ 17: గుజరాత్ పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార కార్యకలాపాలను తెలంగాణకు విస్తరించి దక్షిణ భారతదేశంలో హైదరాబాద్‌ను రెండో ప్రధాన వ్యాపార కేంద్రంగా మలచుకోవాలని ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్, రక్షణ, ఐటీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో తెలంగాణలో అపార పెట్టుబడి అవకాశాలున్నాయని చెప్పారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 సన్నాహాల్లో భాగంగా ఫిక్కీతో కలిసి అహ్మదాబాద్‌లో మంగళవారం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులనుద్దేశించి ప్రసంగించారు. రోడ్‌షో అనంతరం గుజరాత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఇంధన, ఔషధ, వస్త్ర, రసాయన, ఆహార శుద్ధి, సాంకేతిక రంగాలకు చెందిన సంస్థల ఉన్నతాధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఫిక్కీ గుజరాత్ రాష్ట్ర మండలి సభ్యుడు, బ్లూక్రాఫ్ట్ ఆగ్రో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధార్థ్ చౌధరి, ఫిక్కీ గుజరాత్ రాష్ట్ర మండలి డైరెక్టర్ బిజు నంబూదిరిలు కూడా పాల్గొన్నారు. గుజరాత్ నుంచి పెట్టుబడులను తరలించుకుపోవడం తెలంగాణ ఉద్దేశం కాదని, ఇక్కడి వ్యాపారాలను మరింత విస్తరించుకునేందుకు కొత్త అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ‘గుజరాత్ పశ్చిమ భారతదేశ కేంద్రంగా ఉంటే హైదరాబాద్‌ను దక్షిణ భారతదేశంలో మరో కేంద్రంగా మలచుకోండి.. గుజరాత్‌కు అదనంగా తెలంగాణను ఎంచుకోండి’ అని శ్రీధర్‌బాబు అన్నారు. వస్త్ర పరిశ్రమలు, వజ్రాల వ్యాపారం, ఔషధ రంగం, ఓడరేవులు, పెట్రోకెమికల్స్ వంటి రంగాల్లో భవిష్యత్ అవకాశాలను ముందుగానే గుర్తించి గుజరాత్ వ్యాపారవేత్తలు విజయాలు సాధించారని కొనియాడారు. ఇప్పుడు డేటా సెంటర్ల రంగంలోనూ అదే దూరదృష్టితో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అవకాశాలను ఇతరులు గుర్తించకముందే వాటిని అందిపుచ్చుకుని, కొత్త మార్కెట్లలో వ్యాపారాన్ని విస్తరించుకోవడం గుజరాత్ పారిశ్రామికవేత్తల ప్రత్యేకత అని చెప్పారు.
భారత్ ఫ్యూచర్ సిటీ.. భవిష్యత్ పెట్టుబడులకు చిరునామా
భారత్ ఫ్యూచర్ సిటీ భవిష్యత్ పారిశ్రామిక, సాంకేతిక రంగాల పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా నిలవనుందని మంత్రి వివరించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి 25 కి.మీ లోపు దూరంలో ఉన్న ఈ నగరాన్ని నెట్‌జీరో లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో డేటా సెంటర్లకు సుమారు 1,200 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ పరిశ్రమలకు మరో 1,200 ఎకరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన నిల్వ వ్యవస్థలకు 800 ఎకరాలకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. ఏఐ సిటీ, 500 ఎకరాల విద్యా కేంద్రంతో పాటు 15 వేల ఎకరాలకు పైగా పచ్చదనానికి కేటాయించామని చెప్పారు. భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతమైన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ పూర్తయిన తర్వాత చాలామంది దాని గొప్పతనాన్ని చూస్తారు.. కానీ గుజరాత్ వ్యాపారవేత్తలు ఇప్పుడే అందులోని అవకాశాలను గుర్తించాలి. భూములు సిద్ధంగా ఉన్నప్పుడు, విధానాలు కొత్తగా అమలులోకి వస్తున్నప్పుడు, తొలి పెట్టుబడిదారులకే భవిష్యత్ అవకాశాలను నిర్దేశించే అవకాశం ఉంటుంది’ అని శ్రీధర్‌బాబు అన్నారు.
మార్కెట్.. లాభదాయకత.. విశ్వసనీయత
పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ మార్కెట్, లాభదాయకత, విశ్వసనీయత అనే మూడు ప్రధాన అంశాలను మంత్రి ప్రస్తావించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ విలువ 189 బిలియన్ డాలర్లకు చేరిందని, దేశ జీడీపీలో రాష్ట్ర వాటా సుమారు ఐదు శాతమని చెప్పారు. గత ఏడాది రాష్ట్ర ఆర్థిక వృద్ధి 10.75 శాతంగా నమోదైందని, తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 1.9 రెట్లు అధికంగా ఉందని వివరించారు. దాదాపు 10 లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్న హైదరాబాద్ గుజరాత్ ఉత్పత్తులకు పెద్ద మార్కెట్‌గా ఉందన్నారు. వస్త్రాలు, చీరలు, ఆభరణాలు, సిరామిక్స్, ఆహార ఉత్పత్తులు, ఫర్నిచర్ తదితర రంగాల ఉత్పత్తులకు ఇక్కడ విస్తృతమైన వినియోగదారుల మార్కెట్ ఉందని చెప్పారు. పెట్టుబడులు, పారిశ్రామిక కార్యకలాపాల పరంగానూ హైదరాబాద్ కీలక కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. రాష్ట్రంలో 2,000కు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు, 500కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఉన్నాయని, వీటికి రసాయనాలు, ప్యాకేజింగ్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, సేవలు, మౌలిక సదుపాయాల అవసరం నిరంతరం ఉంటుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు హైదరాబాద్ వ్యయపరంగా కూడా అనుకూలమైన నగరమని శ్రీధర్‌బాబు చెప్పారు. న్యూయార్క్‌తో పోలిస్తే హైదరాబాద్‌లో జీవన వ్యయం ఐదో వంతు మాత్రమేనని వివరించారు. పారిశ్రామిక భూములపై 100 శాతం స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, ఏడేళ్ల వరకు 75 శాతం వరకూ ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్, భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలు అందిస్తున్నామని వెల్లడించారు.
15 రోజుల్లో అనుమతులు.. ప్రతి సంస్థకు ప్రత్యేక అధికారి
పెట్టుబడిదారులకు వేగవంతమైన అనుమతులు, పారదర్శక సేవలు అందించడంలో తెలంగాణ ముందుందని మంత్రి పేర్కొన్నారు. టీజీ-ఐపాస్ విధానం ద్వారా భారీ ప్రాజెక్టులకు 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని, సుమారు 98 శాతం అనుమతులను నిర్దేశిత గడువులోనే అందిస్తున్నామని వివరించారు. పెట్టుబడులు పెట్టే ప్రతి గుజరాత్ కంపెనీకి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని ప్రకటించారు. పెట్టుబడిదారులు తొలిసారి రాష్ట్రానికి వచ్చినప్పటి నుంచి పరిశ్రమ ప్రారంభించి, తొలి విక్రయాలు చేపట్టే వరకు ఆ అధికారి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా వ్యవహరిస్తారని హామీ ఇచ్చారు. ‘గుజరాత్‌కు చెందిన అనేక కుటుంబాలు తరతరాలుగా హైదరాబాద్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. మీరు తెలంగాణకు కొత్తవారిగా రావడం లేదు. మిత్రుల మధ్యకు వస్తున్నారు. పెట్టుబడిదారులను వ్యాపార భాగస్వాములుగా కాక రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా చూస్తున్నాం’ అని శ్రీధర్‌బాబు అన్నారు.
క్యూర్, ప్యూర్, రేర్‌తో సమగ్ర ఆర్థికాభివృద్ధి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్–2047 దార్శనికతలో భాగంగా రాష్ట్రాన్ని మూడు ఆర్థిక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ ఆగ్రి రీజియన్ ఎకానమీ (రేర్)గా విభజించి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గుజరాత్ కుటుంబ వ్యాపార వ్యవస్థతో పోలుస్తూ క్యూర్‌ను వ్యాపార కేంద్రం (గద్దీ), ప్యూర్‌ను పరిశ్రమ, గోదాము (కార్ఖానా), రేర్‌ను ముడి సరుకులు, సరఫరా కేంద్రంగా అభివర్ణించారు. ఒకే రాష్ట్రంలో వ్యాపారానికి అవసరమైన అన్ని వనరులను సమన్వయం చేసే విధంగా ఈ ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పారిశ్రామిక అభివృద్ధిని విస్తరించడమే లక్ష్యమని తెలిపారు.
100 అంతర్జాతీయ సంస్థలతో రక్షణ ప్రదర్శన
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో పాల్గొనాలని గుజరాత్ పారిశ్రామికవేత్తలకు శ్రీధర్‌బాబు ఆహ్వానం పలికారు. ప్రతిపాదిత పారిశ్రామిక నగరాన్ని స్వయంగా సందర్శించి అక్కడి పెట్టుబడి అవకాశాలను ప్రత్యక్షంగా పరిశీలించేలా సమ్మిట్‌ను ఫ్యూచర్ సిటీలోనే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమ్మిట్‌లో భాగంగా సుమారు 100 అంతర్జాతీయ ఏరోస్పేస్, రక్షణ రంగ సంస్థల భాగస్వామ్యంతో రక్షణ ప్రదర్శన (రక్షా ఎక్స్‌పో) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ–2.0తోపాటు పలు కీలక పారిశ్రామిక విధానాలను కూడా ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. గుజరాత్ పారిశ్రామిక కుటుంబాలు తమ వ్యాపారాల తదుపరి తరం ప్రతినిధులను కూడా సమ్మిట్‌కు తీసుకురావాలని కోరారు. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీపడటం కాక పరస్పర బలాలను ఉపయోగించుకుని దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని మంత్రి పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





