-ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణలో తెలంగాణ సత్తా చాటుదాం
– క్రీడలు, యువజనుల శాఖల మంత్రి వాకిటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 నిర్వహణ రాష్ట్ర క్రీడా చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకబోతోందని పేర్కొన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అంశాలపై ప్రముఖ క్రీడా ప్రముఖులతో సచివాలయంలో మంగళవారం ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను తెలంగాణకు తీసుకురావడం ఒక గొప్ప అవకాశమైతే వాటిని దేశంలోనే అత్యుత్తమంగా నిర్వహించడం అంతకంటే పెద్ద బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో ఏడు ఎడిషన్లలో జరిగిన క్రీడా పోటీలకంటే మెరుగైన ప్రమాణాలతో ఎనిమిదో ఎడిషన్‌ను నిర్వహించి తెలంగాణ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. తెలంగాణలో ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులు ఎదగాలని, ప్రతి జిల్లాలో అత్యుత్తమ క్రీడా సదుపాయాలు అందుబాటులోకి రావాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ పతకాలు సాధించే క్రీడాకారులకు తెలంగాణ కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడలను కేవలం పోటీలకే పరిమితం చేయకుండా యువత జీవన విధానంలో భాగంగా మార్చాలని, రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని వివరించారు. ఇన్వెస్ట్ తెలంగాణ ద్వారా క్రీడా రంగానికి పెట్టుబడులు ఇన్వెస్ట్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర క్రీడా రంగానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునిక శిక్షణ కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియాలు, క్రీడా పరికరాలు, స్పోర్ట్స్ సైన్స్, ఇతర అనుబంధ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని వివరించారు. కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ భాగస్వామ్యంతో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి క్రీడా సదుపాయాలు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు ముఖ్యమంత్రి రూ.203.36 కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు. ఈ నిధులను కేవలం తాత్కాలిక ఏర్పాట్ల కోసం కాక భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే శాశ్వత క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తున్నామని చెప్పారు.
క్రీడాకారుల భాగస్వామ్యంతోనే విజయవంతమైన నిర్వహణ
ఖేలో ఇండియా నిర్వహణలో అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చిన క్రీడాకారుల భాగస్వామ్యం అత్యంత అవసరమని మంత్రి పేర్కొన్నారు. తాను కూడా గతంలో క్రీడాకారుడినేనని, అందువల్ల క్రీడాకారుల అవసరాలు, సమస్యలు తనకు తెలుసని చెప్పారు. క్రీడాకారులు ఇచ్చే ప్రతి సూచనను గౌరవించి ఆచరణ సాధ్యమైన వాటిని వెంటనే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రముఖ క్రీడాకారులకు ఒక్కో క్రీడా వేదిక బాధ్యత అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల్లో చేరి ప్రస్తుతం శిక్షణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లను ఆయా క్రీడలకు నోడల్ అధికారులుగా నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయొద్దు
పోటీల నిర్వహణలో చిన్నపాటి సమస్య కూడా రాష్ట్ర ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశం ఉందని మంత్రి హెచ్చరించారు. క్రీడాకారులకు వసతి, నాణ్యమైన ఆహారం, తాగునీరు, రవాణా, క్రీడా పరికరాలు, గ్రౌండ్లు, ట్రాక్‌లు తదితర అన్ని సదుపాయాలు అత్యుత్తమంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తాను స్వయంగా నిర్మాణ పనులను రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే కాంట్రాక్టర్లు, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా మంత్రులు, కలెక్టర్లకు బాధ్యతలు హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్వహించే క్రీడా పోటీలకు సంబంధిత జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి క్రీడా వేదిక వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
క్రీడా పండుగ వాతావరణం
డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పండుగ వాతావరణం నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. 28 రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు తెలంగాణ ఆతిథ్యం చిరస్మరణీయంగా నిలిచేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. క్రీడల నిర్వహణలో కేవలం అధికారులు మాత్రమే కాక ప్రజలు, యువత, విద్యార్థులు, ప్రముఖ క్రీడాకారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
గ్రామీణ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి నింపుతాం
గ్రామీణ ప్రాంతాలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని 8 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులను ప్రత్యేక బస్సుల ద్వారా క్రీడా వేదికలకు తీసుకువచ్చి పోటీలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయస్థాయి క్రీడాకారుల ఆటతీరును ప్రత్యక్షంగా చూసినప్పుడు గ్రామీణ విద్యార్థుల్లో కూడా తాము గొప్ప క్రీడాకారులుగా ఎదగాలనే పట్టుదల పెరుగుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఖేలో ఇండియా ఒక గొప్ప వేదికగా మారాలని ఆకాంక్షించారు.
తెలంగాణపై అంతర్జాతీయ మీడియా దృష్టి పడాలి
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ద్వారా తెలంగాణ క్రీడా సామర్థ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పాలని మంత్రి పేర్కొన్నారు. ప్రముఖ క్రీడాకారులు, క్రీడా దిగ్గజాలు, ఇతర ప్రముఖులను భాగస్వాములను చేయడం ద్వారా క్రీడలపై ప్రజల్లో మరింత ఆసక్తి పెంచాలని భావిస్తున్నామని తెలిపారు. కొన్ని రాష్ట్రాలు క్రీడా రంగంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని, వాటితో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలంటే క్రీడా మౌలిక సదుపాయాలు, శిక్షణ, క్రీడాకారుల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ క్రీడా రంగం
ఖేలో ఇండియా నిర్వహణ కేవలం ఒక క్రీడా కార్యక్రమానికి పరిమితం కాకూడదని, భవిష్యత్తులో ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులను తయారు చేసే దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని మంత్రి తెలిపారు. సంవత్సరంలో నాలుగు సీజన్లలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం, నిరంతర శిక్షణ, పోటీల ద్వారా క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలో క్రీడా రంగానికి ప్రభుత్వం ఈ ఏడాది రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించిందని చెప్పారు. ఖేలో ఇండియా ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇందులో ప్రముఖ క్రీడాకారులను కూడా చేర్చి వారి సూచనలు స్వీకరించాలని అధికారులకు సూచించారు.క్రీడా వేదికల్లో ఎదురయ్యే సమస్యలు, అవసరమైన మార్పులు, మెరుగైన నిర్వహణకు సంబంధించిన సూచనలను ఎప్పటికప్పుడు అందించాలని కోరారు.ఆ సూచనలను పరిశీలించి ఆచరణ సాధ్యమైన వాటిని వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (క్రీడలు) వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ వీసీ అండ్ ఎండీ సోనిబాలాదేవి, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రముఖ క్రీడాకారులు జె.జె.శోభ, నీతా ఎల్.దాడ్వే, ఇస్మాయిల్ బేగ్, ఈషా సింగ్, అంబటి తిరుపతి రాయుడు, అగసర నందిని, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా, కల్నల్ నచ్ఛతర్ సింగ్ జోహల్, బోరియా మజుందార్, నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





