ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. యాక్టివైన రిపబ్లిక్..!

“కొన్నేళ్లుగా దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక విధానాలు, చట్టాలు తీసుకువస్తున్నాయి. రైతు నల్ల చట్టాలు సహా అనేక జన వ్యతిరేక , ప్రజాస్వామ్య తిరోగమన నిర్ణయాలను పార్లమెంట్ తీసుకుంటోంది. అది ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పాటైన వ్యవస్థే అయినా అక్కడ నిర్ణయాలు ప్రజా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉంటున్నాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని చెప్పడానికి ఇది ఉదాహరణ..”
మానవ వికాసానికి, సమాజ పురోభివృద్ధికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనేవి రెండు కళ్ళలాంటివి. ఒంటికంటితో చూడటం ఎంత అసంపూర్ణంగా ఉంటుందో, మానవ, సమాజ పురోభివృద్ధిలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో ఏ ఒక్కటి లేకున్నా అది అంతే అసంపూర్ణంగా మిగిలిపోతోంది. అయితే స్థల, కాల పరిస్థితులు, ప్రజల చైతన్యాన్ని ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలు భిన్నంగా ఉంటాయి. కానీ అన్నీ దేశాల్లో ఇవి రెండూ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం రెండింటిలో ఏ ఒక్కటి ప్రమాదంలో పడుతుందన్న భౌతిక పరిస్థితులు కనిపించిన ఆటోమేటిక్ గా రెండో వ్యవస్థ  యాక్టీవ్ అవుతుంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు రాజ్యాంగం వేగంగా స్పందిస్తుంది. రాజ్యాంగం ప్రమాదంలో పడుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ఉత్సహాంగా స్పందిస్తుంది.

డెమొక్రసీ అంటే ప్రజాస్వామ్యం, రిపబ్లిక్ అంటే రాజ్యాంగం. ఆధునిక సమాజ వికాసంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కీలక అంగాలు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం దేనికదే గొప్పది. ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యంటారు. గత కొంతకాలంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్న భౌతిక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యమే క్షీణతకు గురైతోంది. ఎన్నికల్లో గెలిచిన పార్టీలు అప్రజాస్వామికంగా పాలన చేస్తున్నాయి. చట్ట సభల్లో మంద బలం ఉందని, అదే ప్రజాస్వామ్యామన్న అహంకారంతో పాలకులు అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం గత కొన్నేళ్లుగా దేశంలో చూస్తున్నాం.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు, ప్రజల వోట్లతో గెలిచిన ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా పాలన చేస్తోన్నాయి. పార్లమెంట్, అసెంబ్లీలలో ప్రతిపక్షాలను బుల్డోజ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలను కూడా ప్రజలే గెలిపిస్తారు. కానీ వాటికి చట్టసభల్లో తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. ఇవాళా దేశంలో ఉన్న 40 శాతం వోట్లేస్తే , 40 శాతం మంది మద్దతు ఉన్న పార్టీలు అధికారంలో ఉంటున్నాయి. 60 శాతం మద్దతున్న పార్టీలు ప్రతిపక్షంలో ఉంటున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎక్కడో దెబ్బతీస్తుంది. అదే సందర్భం ఇప్దేపుడు శంలో కనిపిస్తుంది.

కొన్నేళ్లుగా దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక విధానాలు, చట్టాలు తీసుకువస్తున్నాయి. రైతు నల్ల చట్టాలు సహా అనేక జన వ్యతిరేక , ప్రజాస్వామ్య తిరోగమన నిర్ణయాలను పార్లమెంట్ తీసుకుంటోంది. అది ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పాటైన వ్యవస్థే అయినా అక్కడ నిర్ణయాలు ప్రజా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉంటున్నాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని చెప్పడానికి ఇది ఉదాహరణ. అయితే ఏ ప్రజాస్వామ్య బద్ధంగా పార్లమెంట్ ఏర్పాటైందో అక్కడే ప్రమాదంలో పడుతున్న సమయంలో రాజ్యాంగం యాక్టీవ్ కావడమే కాదు క్రీయాశీలకంగా పని చేసింది. రాజ్యాంగం కల్పించిన హక్కులతో ప్రజలు, రైతులు, నిన్నమొన్నటి జెన్ జీ లు పోరాటాలు చేయడంతో, న్యాయ వ్యవస్థ జోక్యంతో  కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది. జెన్ జీ లు ప్రభుత్వ జవాబుదారీతనం తీసుకువచ్చారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు వోట్లు ఎంత కీలకమైన అంశాలలో ఇవాళా ఆదే వోటు హక్కు ప్రమాదంలో పడుతోంది. సర్ ముసుగులో రకరకాల కండీషన్ల పేర్లతో దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల వోటును తొలగించే ప్రయత్నాలు కేంద్రం చేస్తోంది. వోట్ల తొలగింపు అంటే పరోక్షంగా బలమైన ప్రజాస్వామ్యాన్ని బలహీన పర్చడమే అవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్, చట్ట సభలకు ప్రాధాన్యత ఉంటుంది. పార్టీలు, ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి ధర్మకర్తల్లాంటివి మాత్రమే. అదే విధంగా రిపబ్లిక్ (రాజ్యాంగం) వ్యవస్థకు న్యాయ వ్యవస్థ, ఇతర రాజ్యాంగ సంస్థలు ముఖ్యమైనవి, రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంటుంది. రాజ్యాంగానికి ధర్మకర్త న్యాయ వ్యవస్థ.

ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్న లక్షణాలు కనిపిస్తోన్నాయి. అధికార పార్టీలు, ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని చెప్పడానికి, ప్రతి పక్షాల విమర్శలే కాదు, క్రీయాశీలకంగా పని చేస్తున్న న్యాయ వ్యవస్థ పనితీరును బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యం సరిగ్గా అమలైతే రాజ్యాంగానికి, న్యాయ వ్యవస్థకు పెద్దగా పని ఉండదు. ప్రజాస్వామ్యం సరిగ్గా అమలు కానప్పుడే రాజ్యాంగ, న్యాయ వ్యవస్థ యాక్టీవ్ అవుతుంది. ఇవాళా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నాయంటే ప్రజాస్వామ్యం ఎక్కడో గాడి తప్పుందా అన్న సంకేతాలు ఇవ్వడమే.

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలైన పార్లమెంట్, అసెంబ్లీలు రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొన్నాయి. న్యాయ వ్యవస్థను కూడా క్రమంగా గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇతర వ్యవస్థలపై ఆధిపత్యం చెలాయించినంత ఈజీగా న్యాయ వ్యవస్థపై చెలాయించడం కొంత కష్టం, చాలా సమయం పడుతుంది. ఆ టైం కోసం కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఒకసారి న్యాయవ్యవస్థపై కూడా పట్టు సాధిస్తే ఇక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఏక కాలంలో నియంత్రించే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం మెజారిటీ ఉందని చెప్పి, మైనారిటీల హక్కులు తొక్కేయం, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకురావడం- అది డెమొక్రసీ పేరుతో జరిగినా, రిపబ్లిక్ (కోర్టులు, రాజ్యాంగం) అడ్డుకుంటుంది. ఎన్నికల్లో గెలిచామని చెప్పి, ఎవరైనా నియంతలా మారితే – రిపబ్లిక్ లోని వ్యవస్థలైన సుప్రీంకోర్టు, ఈసీ, మీడియా యాక్టివ్ అవుతాయి. దురదృష్టవశాత్తు ఇవాళా దేశంలో ఒక్క న్యాయ వ్యవస్థ తప్ప అన్నీ పాలక వర్గాల చేతుల్లో బంధిఅయ్యాయి. ప్రజాస్వామ్యం అంటే జనం గొంతు, రిపబ్లిక్ అంటే రాజ్యాంగం గొంతు. జనం గొంతు నొక్కబడినప్పుడు రాజ్యాంగం గొంతు విప్పుతుంది. రాజ్యాంగం గళం వినిపిస్తుంది. దేశంలో జనం గొంతు నొక్కే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. అందుకే రిపబ్లిక్ రక్షకుడైన న్యాయ వ్యవస్థ గొంతు విప్పుతోంది.

తెలంగాణ రాష్ట్రానికి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ ఓపెన్ గానే ఖూనీ చేస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ అదే పని చేస్తోంది. ఎంతైనా రెండు జాతీయ పార్టీలు నాణెంకు రెండు ముఖాలు కద. విచిత్రమేమంటే రాహుల్ గాంధీ దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుందంటూ రాజ్యాంగం పట్టుకుని దేశం మొత్తం తిరుగుతున్నారు..కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ గురించి మాట్లడటం లేదు. ఎన్నికల తర్వాత రాజ్యాంగాన్ని పట్టుకుని తెలంగాణకు రావడం లేదు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందనడానికి గత మూడేళ్లలో అనేక ఉదాహరణలు కళ్ళముందే ఉన్నాయి. వోట్ల ద్వారా ఎన్నికయ్యామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పాలన చేస్తోంది. ప్రతిపక్షాన్ని చట్టసభలను బుల్డోజ్ చేస్తోంది. లగచర్ల నుంచి హైడ్రా విధ్వంసం, మూసీ పేరుతో లూటీ, ప్రజల నిరసనలపై లాఠీలు, విద్యార్థి నిరుద్యోగుల ఆందోళనలను కఠినంగా అణిచివేయడం, జర్నలిస్టులపై, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు వరకు ప్రజాస్వామ్య ప్రభుత్వం పేరుతో అరచాకాలే.

ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రభుత్వం ప్రమాదంలో పడేస్తుంది. అందుకే రిపబ్లిక్ యాక్టివ్ అవుతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కుతుంటే, రాజ్యాంగ న్యాయ వ్యవస్థ ప్రజల గొంతు వినిపిస్తుంది. లగచర్ల నుంచి హైడ్రా విధ్వంసంపై మూసీ వరకు, ప్రతిపక్షాలపై, జర్నలిస్టులపై అక్రమ కేసులపై న్యాయ స్థానం సీరియస్ గా స్పందిస్తూ ప్రభుత్వానికి చీవాట్లు పెడుతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ముసుగులో రాజ్యాంగాన్ని అతిక్రమించి కాంగ్రెస్ వ్యవహరిస్తుండటాన్ని గట్టిగానే రిపబ్లిక్ హెచ్చరిస్తోంది.

అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును పరిశీలిస్తే ప్రజాస్వామ్యం ఎంతలా ప్రమాదంలో పడుతుందో అర్థమైతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఎంత అపహాస్యం చేసిందో తెలుస్తోంది. కళ్ళముందే స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవంటూ స్పీకర్ చెప్పడమంటే ప్రజాస్వామ్య అధికారం ఉందని బహిరంగ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే కాదు, రాజ్యాంగాన్ని కూడా కించపరిచమే. ఫిరాయింపు కేసులో దానం నాగేందర్ అంశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఒత్తికి తలొగ్గి ప్రజాభిప్రాయాన్ని అవమానించడమే కాదు ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో పడుతుందో స్పీకర్ తీర్పు స్పష్టం చేసింది . నిజానికి దానం నాగేందర్ అంశంలో స్పీకర్ ఓడిపోయారు. ప్రజాస్వామ్య ఓడిపోయింది. స్పీకర్ ఓడిపోయారు అంటే అసెంబ్లీ ఓడిపోయిందన్నట్లే. అసెంబ్లీ ఓడిపోయింది అంటే ప్రభుత్వం ఓడిపోనట్లు. దానం ఓడిపోలేదు. న్యాయం గెలిచింది. ప్రతిపక్షం గెలిచింది.మొత్తం ఎపిసోడ్ లో స్పీకర్ పరువు పోయింది. స్పీకర్ వ్యవస్థను కలుషితం చేసిన కాంగ్రెస్ ఓడిపోయింది.

ప్రజాస్వామ్యంలో భాగంగానే చట్ట సభలు ఏర్పడుతాయి. ఆ సభలకు స్పీకర్ ధర్మకర్త. అంటే ప్రజాస్వామ్యానికి కాపాలాదారుడు. ఇవాళా ఆ స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని న్యాయ వ్యవస్థ అభిప్రాయపడిందంటే, ఇక్కడ స్పీకర్ వ్యవస్థ రాజ్యాంగ బద్ధంగా ఏర్పడినా,  ప్రజాస్వామ్య వ్యవస్థతో ముడిపడి ఉంది. స్పీకర్ వ్యవస్థను ఆ కుర్చి లో కూర్చున్న వారు ప్రజాస్వామ్య వ్యవస్థగానే భావిస్తున్నారు. అందుకే అధికార పార్టీ ప్రలోభాలకు లొంగుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు, హైకోర్టు తీర్పుల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థనో, రాజ్యాంగం వ్యవస్థనో , ఒక వ్యవస్థను తక్కువ చేసి, మరో వ్యవస్థను ఎక్కువ చేసి చెప్పడం కాదు. రెండు కూడా సమాజ పురోభివృద్ధికి రెండు కళ్ళలాంటివి, రెండు కూడా సమానమే ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. డెమొక్రసీ, రిపబ్లిక్ రెండు విడదీయలేని పదార్థం. ఒకటి ఉంటేనే రెండోదానికి అర్థం.ఒకదాని ఉనికిలో మరోకటి ఉంటుంది. ఒకటి విఫలమైన చోటే మరోకటి పని మొదలు పెడుతుంది. ఇవాళా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి..అదే సమయంలో రిపబ్లిక్ క్రీయాశీలకంగా తన పాత్ర పోషిస్తోంది.

తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *