పట్టణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు

– ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన
– రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో నిర్మాణ పనులకు శ్రీకారం
– పేదవాడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
– వచ్చే బోనాలు ఇక్కడి నుంచే ఎత్తించేలా పనులు పూర్తి చేస్తాం
– ఉచిత రిజిస్ట్రేషన్‌తో హక్కులు
– రెవెన్యూ మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : హైదరాబాద్‌ మహా నగరంలోని క్యూర్ పరిధిలో పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలోని మల్కం చెరువు సమీపంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ పేదలకు వారు నివసిస్తున్న ప్రాంతాలకు సాధ్యమైనంత దగ్గరలోనే సొంతింటిని అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. హైదరాబాద్‌లో భూముల విలువ భారీగా ఉన్న ప్రాంతాల్లోనే పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఎకరం వందల కోట్ల విలువ చేసే ప్రాంతంలో పేద కుటుంబాలకు ఇల్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వారికి భద్రత, భరోసా కల్పిస్తోందన్నారు. ఇందిరమ్మ టవర్స్‌లో లబ్ధిదారులకు 17 నుంచి 20 గజాల వరకు అన్‌డివైడెడ్ షేర్‌తోపాటు అపార్ట్‌మెంట్‌పై పూర్తి హక్కులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని, సేల్ డీడ్‌ను రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. టవర్స్ లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యానికి, పైరవీలకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు. లాటరీ విధానంలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, ఎవరి సిఫార్సులు, ఒత్తిళ్లకు లొంగకుండా అర్హత ఆధారంగా ఎంపిక జరుగుతోందన్నారు. హౌసింగ్ బోర్డు కూడా ‘క్యూర్’ ప్రాంతంలో లాటరీ ఎంపికలను పబ్లిక్‌గా ప్రకటించి, అభ్యంతరాలు స్వీకరించే విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గంలో తొలి విడతగా 480 ఇళ్ల చొప్పున నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే పలుచోట్ల టెండర్లు, అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో నిర్మాణ పనులు వేగం పుంజుకుంటాయని చెప్పారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలల్లో తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని, రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.  హైదరాబాద్ నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. “ఇక్కడ దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి పేద కుటుంబం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. రెండో విడత, మూడో విడత, నాలుగో విడత, ఐదో విడతగా కూడా ఇళ్లు నిర్మిస్తాం. రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ‘క్యూర్’ ప్రాంతంలో అర్హులైన పేదలకు దశలవారీగా ఇళ్లు అందిస్తాం” అని మంత్రి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి, వచ్చే బోనాల నాటికి ఇక్కడి నుంచే లబ్ధిదారులతో బోనాలు ఎత్తించే విధంగా నిర్మాణాలను వేగవంతం చేస్తామని అన్నారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, లబ్దిదారులు తమ ఇల్లు ఎలా కడుతున్నారో మీ కళ్ల ముందే మీరు చూసుకోవచ్చు. వారానికి ఒకసారి వచ్చి నిర్మాణ పనులను పరిశీలించండి. నాణ్యతలో లోపం కనిపిస్తే అక్కడే ఉన్న అధికారులకు ఫిర్యాదు చేయండి. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.   “ఇది ప్రభుత్వం ఇచ్చే ఒక గిఫ్ట్ కాదు.. మీ పిల్లలకు, మీ భవిష్యత్ తరాలకు మిగిలే ఆస్తి. రాయదుర్గం వంటి ప్రాంతంలో ‘నాకూ ఒక సొంత అపార్ట్‌మెంట్ ఉంది’ అని మీ పిల్లలు గర్వంగా చెప్పుకునేలా ఈ ఇంటిని కాపాడుకోండి” అని మంత్రి కోరారు. గతంలో పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి నగరానికి 30–40 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన విధానాలకు భిన్నంగా, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డునే పేదలకు ఇళ్లు నిర్మిస్తోందని మంత్రి అన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని కూడా రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవడం సరికాదని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పేదల ఇళ్ల విషయంలో ఇచ్చిన హామీలు, అమలు చేసిన పనులపై ప్రజలే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు శుభవార్త

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నిధులు అందేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన లబ్దిదారులకు ఇబ్బంది కలగకుండా నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల పోర్టల్‌లో ఇప్పటికే మంజూరై బేస్‌మెంట్ లేదా అంతకంటే పైస్థాయికి చేరుకున్న ఇళ్లకు ఎల్ 3 నుంచి ఎల1 కేసులకు ఒకేసారి ప్రత్యేక అనుమతి (వన్ టైం క్లియరెన్స్) ఇస్తూ నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. ఈ ప్రత్యేక సడలింపు ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని, భవిష్యత్తులో ఎల3 మంజూరుకు దీనిని ప్రాతిపదికగా పరిగణించరాదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఏర్పడే మొత్తం ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అదేవిధంగా ఇల్లు మంజూరైనప్పటికీ నిర్మాణం ప్రారంభం కాని వాటిని రద్దు చేసి అర్హులైన వారికి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *