•జనాభాను తక్కువ చేసి చూపారన్న విపక్షాలు
•సర్వే తీర్మానంతో సరిపోదన్న బిఆర్‌ఎస్, బిజెపి
•సమగ్రత లేదన్న శ్రీనివాస్ యాదవ్, పాయల్ శంకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి4: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సర్వేపై వాడివేడి చర్చ జరిగింది. కులగణన సర్వే నివేదికలో పొందుపర్చిన అంశాలపై బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కులగణన సర్వేపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని భారాస నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‘గత 15 ఏళ్లలో బీసీ జనాభా అంతగా పెరగలేదని, ఎస్సీ, ముస్లింల జనాభా తగ్గినట్లు సర్వే నివేదిక చెబుతోంది. జీహెచ్‌ఎంసీలో 30 శాతం కూడా సర్వేలో పాల్గొనలేదు. అంతేకాకుండా చాలామంది వివరాలు చెప్పలేదు. కేవలం సర్వే చేయించి, తీర్మానం చేస్తే సరిపోదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించాలి. ఏ కులం జనాభా ఎంతో ప్రభుత్వం వెల్లడించాలి. సర్వేలో 56 అంశాలు ప్రస్తావించారు. అందుకే చాలా మంది వివరాలు చెప్పలేదు.
ఫార్మాట్ మార్చి మరోసారి సర్వే చేయించాలి. సర్వే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని తలసాని కోరారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తుకు వస్తున్నారని భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఓట్లు పొందేందుకే బీసీ నినాదం అందుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు, రాష్ట్ర జనాభా సంఖ్యకు పొంతన లేదన్నారు. ‘ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.33 కోట్లు అని తెలుస్తోంది. కులగణన సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3.76 కోట్లుగా తెలుస్తోంది. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే బీసీలకు అన్యాయం జరుగుతోంది. జనాభా ప్రకారం బీసీలకు సగం సీట్లు ఇస్తామని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. గెలుపు అవకాశాలు లేని స్థానాలకు బీసీలను పరిమితం చేస్తున్నారు.
కులసంఘాల భవనాలకు స్థలం కేటాయింపులోనూ బీసీలకు అన్యాయం జరుగుతోంది. హైదరాబాద్‌కు 60 కిలోవ్నిటర్ల దూరంలో బీసీ సంఘాల భవనాలకు స్థలం కేటాయిస్తున్నారు. అగ్రవర్ణాల వారి కులసంఘాల భవనాలకు మాత్రం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో కేటాయించారు. బలహీనవర్గాల విషయంలో కేవలం తీర్మానాలు చేసి వదిలేస్తున్నారు. ఈ సర్వేలో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని కొత్త పదాలు సృష్టించారు. కోర్టుల్లో కేసులు వేసి బీసీలకు రిజర్వేషన్ల పెంపును జాప్యం చేయాలని చూస్తున్నారు. కోర్టుల పేరు చెప్పి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల పెంపును పక్కకు పెడుతోంది‘ అని ఆరోపించారు.