కెసిఆర్ మౌనంపై ఆందోళనలు .. విమర్శలు
ప్రస్తుత రాజకీయాల్లో కెసిఆర్ పేరెత్తకుండా మాట్లాడే పరిస్థితిలేదు. నేటికి ఇరవై నాలుగేళ్ళుగా ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజల మధ్య నలుగుతూనే ఉన్నారు. రాష్ట్రం నుండి దిల్లీ వరకు ఆయన చర్చలేకుండా రాజకీయాలులేవన్న పరిస్థితిని కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక్కసారే మౌనవ్రతం దాల్చడాన్ని ఎవరూ ఊహించుకోలేకపోతున్నారు. ఈ ఇరవై నాలుగేళ్ళలో రాష్ట్రంలోగాని, కేంద్రంలోగాని ఏ విషయం చర్చకువొచ్చినా దానిపై వెంటనే స్పందించడం ద్వారా రాజకీయల్లో తన ఉనికిని చాటుకున్న వ్యక్తి మౌనం వహించడం వెనుక అర్థాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి నాయకులకు ఏర్పడిరది. ఎంతటి పెనుతుఫాను వొచ్చినా చలించవొద్దని, భయపడి ‘ఆగమాగం’ కావొద్దని తరుచు చెప్పే కెసిఆర్ అసలు ముఖం చాటేయట మేంటంటూ రాష్ట్ర ప్రజలు ఆయోమయం చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధిస్తామన్న నమ్మకం ఒమ్ము కావడం, పార్లమెంటు ఎన్నికల్లో జీరో మార్కులు తెచ్చుకోవడంతో ముఖం చెల్లక ప్రజల ముందుకు రావడం లేదేమోనన్న విమర్శ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నది. ప్రతీ చిన్న విషయానికి ఆగమాగం కావొద్దంటూ ధైర్యం చెప్పే కెసిఆరే ధైర్యం కోల్పోయాడా అన్నది కూడా అర్థం కావడం లేదంటున్నారు అభిమానులు.
ఎంతో రాజకీయ పరిజ్ఞానం ఉండి, ఒక మహోద్యమాన్ని నడపడమేకాదు, లక్ష్యాన్ని ముద్దాడి, ఒక దశాబ్ధంపాటు పాలకుడిగా పలువురు ప్రశంసలను అందుకున్న వ్యక్తి బీరువుగా మారడమేంటన్న ప్రశ్న ప్రజలమధ్య చర్చకు దారితీస్తున్నది. తన దశాబ్దకాల పాలనలో అనేక సంచలనాత్మక నిర్ణయాలను తీసుకున్న వ్యక్తి. రైతుబంధు, 24 గంటల కరెంటులాంటి పథకాలు రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా గుర్తించబడ్డాయి. అలాంటప్పుడు ధరణి, కాళేశ్వరంపై వొస్తున్న విమర్శల పైన కూడా ఆయన మౌనం వహించడాన్ని ముఖ్యంగా బిఆర్‌ఎస్ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి. ఇటీవల కాలంలో విపక్షాలనుండి ముఖ్యంగా అధికారపార్టీ నుండి అనేక ఆరోపణలు చేస్తున్న ఒక్కటంటే ఒక్కదానిపైన కూడా ఆయన స్పందించకపోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తున్నది. తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు బిఆర్‌ఎస్ పార్టీని, పార్టీ అధినేతను పూర్తిగా డామేజీ చేసేవిగా ఉన్నా అసలా విషయమేది తనకు తెలియదన్నట్లుగా కెసిఆర్ నుండి చలనంలేదు. అంతకు ముందు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంఘటన అయితేనేమీ, శాసనసభలో, బయట తమ పార్టీకి చెందిన మాజీ మహిళా మంత్రులపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల విషయంలోనైతేనేమీ ఆయన ఏ ఒక్కదానిపైన తన వివరణగాని, విమర్షగాని చేయకపోవడం గమనార్హం. ఎంతసేపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ట్రబుల్‌షూటర్ హరీష్‌రావులు విమర్శలను తిప్పికొడుతున్న పరిస్థితిలో కెసిఆర్‌లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నదంటున్నారు.
కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్ పార్టీని డామేజ్ చేసే అనేక సంఘటనలు వెలుగులోకి వొచ్చినా, సిగ్గు, బుద్ది లాంటి పదప్రయోగం విపక్ష పార్టీలు చేస్తున్నా, వాటిపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా తనకేమీ పట్టనట్లుగా ఆయన వ్యవహరిస్తున్న తీరును ఎవరూ అర్థంచేసుకోలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక ఆ ఆపార్టీ మరుగుపడినట్లేనని, ఫాంహైజ్‌కే పరిమితమేనంటూ విపక్షాలు కోడైకూస్తున్నా అధినాయకుడి నుండి ఉలుకూ పలుకులేదు. పదిమంది ఎమ్మెల్యేలు ఏకమొత్తంగా కాంగ్రెస్ గూటికి చేరినప్పుడుగాని, మరో పదిమంది అందుకు సిద్దంగా ఉన్నారన్న వార్తలు విస్తృతమవుతున్నా కెసిఆర్ మాత్రం మౌనాన్ని వీడడంలేదు. విచిత్రమేమంటే కూతురు నెలల తరబడి జైల్ జీవితాన్ని అనుభవిస్తున్న ఏమాత్రం చలించని వ్యక్తి. కనీసం ఆమెపై వొస్తున్న ఆరోపణలపై స్పందించక పోవడం కూడా ఆశ్చర్యమే. అయితే తుఫాన్‌కు ముందు ఆకాశంలో ఏర్పడే ప్రశాంతతలాగా, ఆయన మౌనం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. కాగా కొత్త ప్రభుత్వానికి కనీసం ఒక ఏడాది సమయమైనా ఇవ్వాలన్న ఉద్దేశ్యంగానే ఆయన ఈ ఏడాదికాలం కాంగ్రెస్‌ను విమర్శించకుండా ఓపిక పడుతున్నట్లు అనుమాయులు చెబుతున్నమాట. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు వొస్తాయంటున్నారు.
కనీసం ఈ ఎన్నికల్లోనైనా తన పార్టీని గెలిపించుకునేందుకు కెసిఆర్ రంగ ప్రవేశం చేస్తాడా లేదా అన్న మీమాంసలో ఇప్పుడు క్యాడర్ ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పార్టీని పునర్‌నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఆ పార్టీకి ఎంత్లైనా ఉంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఆయా జిల్లాల్లో సమర్థనాయకులను ఎంచుకోవాల్సి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా కెసిఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెడుతాడేమో అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌కు అవసరమున్న నేతలను రప్పించుకుని రాష్ట్రంలోని పరిణామాలపై మాట్లాడుతున్నట్లు వినికిడి. అలా కెసిఆర్‌తో ప్రత్యక్షంగా మాట్లాడివచ్చిన నేతలు చెబుతున్నదాని ప్రకారం కెసిఆర్ డిసెంబర్‌లో మౌనం వీడుతారని తెలుస్తున్నది. శిశుపాలుడి తప్పులను లెక్కిస్తున్న కృష్ణుడిలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెరవేర్చని హామీలనే ఆయుధాలుగా మల్చుకుని ఆయన ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ డిసెంబర్ ఏడవతేదీకి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టి సంవత్సరకాలం కావొస్తున్నది. ఈ సంవత్సరకాలంలో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నెరవేర్చలేక పోవడం, వందరోజుల్లో వాటిని అమలుచేస్తామన్న మాటను నిలబెట్టుకోలేకపోయిన అంశాన్ని ఆస్త్రాలుగా ప్రజల ముందు సంధించేందుకు ఆయన సిద్ధమవుతున్నారన్నది ఆయన సన్నితవర్గాలు చెబుతున్నమాట.





