స్వర్ణం సాధించిన చికిత, జాదవ్‌లకు సీఎం అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు-2026లో మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీలో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడమే కాక 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హత సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ చికిత తానిపర్తితోపాటు సాహిల్ జాదవ్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుభాభి నందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో ఒకేరోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చేసిన ఆర్చరీ క్రీడాకారిణి చికిత రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. పెద్దపల్లికి చెందిన చికిత ప్రతిభను గుర్తించి ఆమెను వెన్నంటి ప్రోత్సహించిన తల్లిదండ్రులు, కోచ్‌లను ముఖ్యమంత్రి అభినందించారు. కాంపౌండ్ ఉమెన్స్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించడంతోపాటు మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సాహిల్ జాదవ్‌తో కలిసి దక్షిణ కొరియాపై విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న చికిత పేరు తెలంగాణ క్రీడారంగ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. చికిత నిరంతర సాధన, పట్టుదల, దృఢసంకల్పంతో సాధించిన ఈ విజయం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

మంత్రి వాకిటి అభినందనలు

ఆసియా క్రీడల్లో ఆర్చరీ కాంపౌండ్ టీం ఈవెంట్లో స్వర్ణం సాధించిన క్రీడాకారిణి చికితారావుకు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. స్వర్ణ పతకాలు సాధించి 2028 లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన చికితారావు మన తెలంగాణ క్రీడాకారులు అందరికీ గర్వంగా, ఆదర్శంగా నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చికిత తండ్రి శ్రీనివాసరావుతో ఫోన్‌లో మాట్లాడి మంత్రి వాకిటి అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *