– సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థులు
– ప్రచారం, వ్యూహాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించి ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ స్థానానికి అభ్యర్థిగా టీపీసీసీ మీడియా విభాగాధిపతి, న్యాయవాది సామ రామ్మోహన్ రెడ్డి ఎంపికయ్యారు. అలాగే నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఎంపికయ్యారు. వీరిద్దరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమను అభ్యర్థులుగా ప్రకటించి అవకాశం కల్పించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఇద్దరు అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ అత్యంత కీలకమైనందున అర్హులైన ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించారు. ప్రచారం, క్షేత్రస్థాయి వ్యూహాలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునే అంశాలపై అభ్యర్థులకు తగిన మార్గదర్శకత్వం చేశారు. వీరితోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కూడా సీఎంను కలిశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





