– అన్నదాతలకు అండగా బీజేపీ
– నల్గొండ జిల్లా పర్యటనలో రామచందర్‌రావు
నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్రంగా మోసం చేసిందని, వరి పంటలు ఎండిపోవడానికి కారణమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మండిపడ్డారు. పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన నల్గొండ జిల్లాలో బుధవారం పర్యటించారు. క్షేత్రస్థాయిలో రైతులను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడమే తమ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలకు బీజేపీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. తోరగల్ గ్రామంలో ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. అనంతరం నల్గొండలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో రామచందర్ రావు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అక్కడ నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. సేవా భావం, స్వచ్ఛత అనేవి విస్తృత ప్రజా ఉద్యమంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ స్ఫూర్తిని ప్రతి బీజేపీ కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని, సమాజం, దేశ సేవకు అంకితభావంతో పనిచేయాలని కోరారు. అనంతరం రామచందర్ రావు నాగార్జునసాగర్‌కు బయలుదేరారు. అక్కడ పంట నష్టపోయిన రైతులను స్వయంగా కలిసి వారి బాధలను, సమస్యలను అడిగి తెలుసుకుంటామని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





