- 31 మంది మావోయిస్టులు మృతి.. మృతదేహాలు లభ్యం
- బస్తర్ ఐజి సుందర్ రాజు వెల్లడి
- మృతుల్లో కీలక నేతలు
- పోస్టుమార్టం కోసం మృతదేహాల తరలింపు
ఛత్తీష్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దులో గల అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారనీ . శనివారం మధ్యాహ్నం వరకు 31 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజి సుందర్ రాజు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 28 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా శనివారం మరో మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏప్రిల్ 16న కాంకీర్ అటవీ ప్రాంతంలో 29 మంది మావోయిస్టులు మృతి చెందారని 5 నెలల తరువాత మళ్లీ శుక్రవారం 31 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. మృతి చెందిన మావోయిస్టులు టిఎన్‌జిఏ కంపెనీ 6, ప్లాటూన్ 16కు చెందినవారిగా తెలిపారు. మృతుల్లో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు కమలేష్, సురేష్, సలామ్ ఉన్నట్లు ఐజి తెలిపారు. మిగతా మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు.
ఈ సంఘటనో రామచంద్రయాదవ్ అనే జవాన్ గాయపడినట్లు ఐజి తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో 10 కి. మీ విస్తీర్ణంలో జరిగినట్లు ఐజి తెలిపారు. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం మధ్యాహ్నం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరగగా.. 31 మంది మావోయిస్టులు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే …అయితే శుక్రవారం రాత్రి వరకు అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో కాల్పుల మోత కొనసాగుతూనే ఉంది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ నారాయణ్‌పూర్ జిల్లాల్లో మావోయిస్టులకు, పోలీసులకు భారీగా ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. కాల్పుల అనంతరం అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపట్టారు. ఈ సంఘటనలో 31 మావోయిస్టు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు దోరిగా నాగరాజు అలియాస్ కమలేష్, రామకృష్ణ, ఆర్‌కె విష్ణు అనే వివిధ పేర్లతో పిలిచే నాగరాజు మృతి చెందినట్లు తెలిసింది. ఇప్పటికే ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. ఇతని స్వస్థలం విజయవాడగా గుర్తించారు. మరో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. వారిపై సుమారు కోటికి పైగా రివార్డులు ఉన్నట్లు తెలిసింది.
మావోయిస్టులు నారాయణ్‌పూర్, దంతెవాడ జిల్లాల్లో ని నెందూర్, తులతులి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో అటవీ ప్రాంతాన్ని డిఆర్‌జి, సిఆర్‌పిఎఫ్ కోబ్రా బలగాలు అటవీ ప్రాంతంలోకి రంగంలోకి దిగాయి. పోలీస్ బలగాలను పసిగట్టిన మావోయిస్టులు ఒక్కసారిగా తుపాకుల మోత మోగించారు. దీ దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరపటంతో 31 మంది మావోయిస్టులు అక్కడిక్కడే మృతి చెందారు. మరికొంతమందికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు శనివారం 31 మృతదేహాలతోపాటు వీరి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.





