– నిరుద్యోగులకు టీజీపీఎస్సీ షాక్
- త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల
హైదారాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( టీజీపీఎస్సీ ) బిగ్ అలర్ట్ ఇచ్చింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించి 2022లో జారీ చేసిన బ్రీఫ్ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 544 ఖాళీల భర్తీకి ఇచ్చిన ఈ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కమిషన్ వెబ్‌నోట్ ద్వారా వెల్లడించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 డిసెంబర్ 31న కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టుల భర్తీ కోసం బ్రీఫ్ నోటిఫికేషన్ నంబర్ 33/2022ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 544 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివిధ అంశాలపై కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. అన్ని పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన తర్వాత 33/2022 బ్రీఫ్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. పాత నోటిఫికేషన్ రద్దు కావడంతో ఈ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. కొత్త నోటిఫికేషన్‌ను ప్రస్తుత నిబంధనలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ విధానాలకు అనుగుణంగా రూపొందించే అవకాశం ఉంది. కమిషన్ వెబ్‌నోట్ ప్రకారం 2022 డిసెంబర్ 31న జారీ చేసిన బ్రీఫ్ నోటిఫికేషన్ నంబర్ 33/2022ను తక్షణమే రద్దు చేశారు. 544 ఖాళీలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఇక చెల్లుబాటు కాదని అభ్యర్థులు గుర్తించాలని కమిషన్ సూచించింది. పాత నోటిఫికేషన్ రద్దు కావడంతో గతంలో జారీ చేసిన బ్రీఫ్ నోటిఫికేషన్ ఆధారంగా నియామక ప్రక్రియ కొనసాగదని అభ్యర్థులు గమనించాలి. కొత్త నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అందులో పేర్కొనే పోస్టుల సంఖ్య, అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, దరఖాస్తు తేదీలు, ఎంపిక విధానం వంటి వివరాలను అభ్యర్థులు తప్పనిసరిగా పరిశీలించాలి. కొత్త నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ తన వెబ్‌నోట్‌లో పేర్కొంది. దీంతో డిగ్రీ కాలేజీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కొత్త ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంటుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





