“తెలంగాణలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య కేవలం భవిష్యత్తులో రాబోయే రోబో వాహనాలది కాదు,సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో వికాలవిడిగా ప్రైవేట్ వాహనాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడం, టాక్సీ వాహనాల పర్మిట్లు, పన్నులు, ఫిట్‌నెస్ బదిలీని గుర్తించడంలో లోపాలు వంటి అంశాలు ఇప్పటికే రవాణా వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి. 2025 మార్చి 31 నాటికి తెలంగాణలో 23,47,479 వ్యక్తిగత కార్లు 1,44,215 మోటార్ క్యాబ్స్, 26,968 మ్యాక్సీ క్యాబ్స్, 8,644 కాంట్రాక్ట్ క్యారేజీలు నమోదై ఉన్నట్లు రవాణా శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇవి కేవలం వాహనాలు కావు. వేలాది డ్రైవర్లు, యజమానులు, మెకానిక్‌లు, సర్వీసింగ్ కేంద్రాలు, బీమా సంస్థలు, ఫైనాన్స్ రంగాలకు ఇవి జీవనాధారం.ఇలాంటి సమయంలో ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా వినియోగించే పరిస్థితి ఉంటే, అది చట్టబద్ధంగా పన్నులు, పర్మిట్లు చెల్లిస్తూ జీవనం సాగించే టాక్సీ యజమానులకు అన్యాయం చేయడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికీ నష్టం కలిగించే అంశంగా మారుతుంది.”
సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న కొద్దీ రవాణా రంగం కూడా కొత్త రూపాన్ని సంతరించుకుం టోంది. డ్రైవర్ అవసరం లేకుండా ప్రయాణించే స్వయంచాలక వాహనాల ఆలోచన భవిష్యత్తులో వాస్తవ రూపం దాల్చే అవకాశముంది. అయితే సాంకేతికతను స్వాగతించే ముందు దాని ఉపాధి, ప్రభుత్వ ఆదాయం, ప్రయాణికుల భద్రతపై పడే ప్రభావాన్ని అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య కేవలం భవిష్యత్తులో రాబోయే రోబో వాహనాలది కాదు,సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో వికాలవిడిగా ప్రైవేట్ వాహనాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడం, టాక్సీ వాహనాల పర్మిట్లు, పన్నులు, ఫిట్‌నెస్ బదిలీని గుర్తించడంలో లోపాలు వంటి అంశాలు ఇప్పటికే రవాణా వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి.
2025 మార్చి 31 నాటికి తెలంగాణలో 23,47,479 వ్యక్తిగత కార్లు 1,44,215 మోటార్ క్యాబ్స్, 26,968 మ్యాక్సీ క్యాబ్స్, 8,644 కాంట్రాక్ట్ క్యారేజీలు నమోదై ఉన్నట్లు రవాణా శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇవి కేవలం వాహనాలు కావు. వేలాది డ్రైవర్లు, యజమానులు, మెకానిక్‌లు, సర్వీసింగ్ కేంద్రాలు, బీమా సంస్థలు, ఫైనాన్స్ రంగాలకు ఇవి జీవనాధారం.ఇలాంటి సమయంలో ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా వినియోగించే పరిస్థితి ఉంటే, అది చట్టబద్ధంగా పన్నులు, పర్మిట్లు చెల్లిస్తూ జీవనం సాగించే టాక్సీ యజమానులకు అన్యాయం చేయడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికీ నష్టం కలిగించే అంశంగా మారుతుంది. రవాణా శాఖ వద్ద వాహనం వివరాలు ఉండి.. పోలీసుల తనిఖీలో ఆ వివరాలు ఎందుకు ప్రతిబింబించడం లేదు ? డిజిటల్ యుగంలో రిజిస్ట్రేషన్, పర్మిట్, ఫిట్‌నెస్, పన్ను, బీమా వంటి వివరాలు ఒకే వ్యవస్థలో అందుబాటులో ఉండాలి. డేటా ఒక శాఖ వద్ద, తనిఖీ మరో శాఖ వద్ద ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
తెలంగాణ రవాణా శాఖ అధికారిక గణాంకాల ప్రకారం 2022–23లో రూ.6,390.80 కోట్లు, 2023–24లో రూ.6,990.29 కోట్లు, 2024–25లో సుమారు రూ.6,910.79 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ ఆదాయంలో పన్నులు, ఫీజులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వసూళ్లు తదితరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.టాక్సీ రంగంలో వాహనాల సంఖ్య, వినియోగం లేదా కొత్త వాహనాల కొనుగోళ్లు తగ్గితే రవాణా శాఖ ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ప్రభుత్వం ముందుగానే అధ్యయనం చేయాలి. పన్నులు, పర్మిట్ ఫీజులు, ఫిట్‌నెస్ ఫీజులు వంటి వసూళ్లలో సంభవించే మార్పులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.అదే సమయంలో సెల్ఫ్ డ్రైవింగ్ సాంకేతికతను అడ్డుకోవడం పరిష్కారం కాదు. దాని రాకను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వాహనాల నమోదు, భద్రతా ప్రమాణాలు, బీమా, ప్రమాద పరిహారం, బాధ్యత నిర్ధారణ, డేటా రక్షణ, సాఫ్ట్‌వేర్ భద్రత, వాహన పరీక్షలపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి.
తెలంగాణలో నమోదైన రోడ్డు ప్రమాదాలు 2023లో 22,903 నుంచి 2024లో 25,934కు పెరిగాయి. ఇదే సమయంలో ప్రమాద మరణాలు 7,660 నుంచి 7,281కు తగ్గాయి. ప్రమాదాల కారణాలు అనేకం కావచ్చు. వయోవృద్ధ డ్రైవర్లు, మైనర్ల డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, నియమాల ఉల్లంఘన వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం అవసరం.ఏ వాహనం అయినా ప్రమాదానికి గురైనప్పుడు బాధ్యత ఎవరిది? డ్రైవర్‌దా? యజమానిదా? వాహన తయారీదారుదా? సాంకేతిక వ్యవస్థదా? అనే ప్రశ్నలకు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల విస్తరణకు ముందే చట్టపరమైన స్పష్టత ఉండాలి.మరోవైపు టాక్సీ రంగంపై సాంకేతిక మార్పుల ప్రభావం పడితే డ్రైవర్ల ఉపాధి ప్రశ్నార్థకమవుతుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయ నైపుణ్య శిక్షణ, కొత్త రవాణా సేవల్లో ఉపాధి, పునర్‌శిక్షణ కార్యక్రమాలను ముందుగానే రూపొందించాలి.
ప్రైవేట్ వాహనాలను అనధికారికంగా ప్రయాణికుల రవాణాకు ఉపయోగించడం జరిగితే అది కేవలం రవాణా నిబంధనల సమస్యగా చూడకూడదు. భద్రత, బీమా, పన్నులు, పర్మిట్లు, ప్రయాణికుల బాధ్యత వంటి అనేక అంశాలు దీనితో ముడిపడి ఉంటాయి.ఒక్కోసారి ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం కంటే రిస్క్ ఆధారిత తనిఖీ విధానం అవసరం. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వాహనాలు, గడువు ముగిసిన పర్మిట్లు, ఫిట్‌నెస్ లోపాలు, పన్ను బకాయిలు ఉన్న వాహనాలను డిజిటల్‌గా గుర్తించి ముందుగానే చర్యలు తీసుకోవాలి. టాక్సీ రంగంలో సరైన పర్యవేక్షణ లేకపోతే రవాణా శాఖ ఆదాయానికి నష్టం, చట్టబద్ధంగా పనిచేసే టాక్సీ ఆపరేటర్లకు అన్యాయం, ప్రయాణికుల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. పొరుగు రాష్ట్రాలకు వెళ్లే బస్సుల పర్మిట్లలో బదలాయింపు పై అనేక మార్లు కేసులు అయినప్పటికీ నిఘా కరువై అది ఏ కేటగిరీకి చెందిందో వ్యవస్థకు తెలియకపోతే, అది కేవలం తనిఖీ వైఫల్యం కాదు,పాలనా వ్యవస్థలోని డేటా, నిఘా, సమన్వయ లోపానికి నిదర్శనం.”రవాణా శాఖ పర్మిట్ ఇస్తుంది.. పోలీసులు రోడ్డుపై పర్యవేక్షిస్తారు.
కానీ ఈ రెండు వ్యవస్థలు కలవకపోతే అక్రమ రవాణాకు దారులు తెరచి రాష్ట్రానికి ప్రధాన ఆదాయాల్లో ఒక్కటైనా రవాణా శాఖ నష్టం పోయే ప్రమాదం ఉంది. నగరాలు, హైవేలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల వద్ద లక్ష్యిత తనిఖీలు,ప్రతి జిల్లాలో సంయుక్త రవాణా, పోలీసు పర్యవేక్షణ బృందాలు,నెలవారీగా తనిఖీలు, ఉల్లంఘనలు, కేసులు, వసూలైన జరిమానాలపై ప్రజలకు నివేదిక అందించాలి, మొత్తానికి: టాక్సీ వాహనాలను గుర్తించడం కేవలం రోడ్డుపై వాహనాన్ని ఆపి ఆన్ లైన్ యాప్ లో పత్రాలు చూడటంతో ముగియకూడదు.“డేటా, గుర్తింపు, తనిఖీ, చర్య” అనే నాలుగు దశల సమగ్ర వ్యవస్థ ఏర్పడితేనే రవాణా నియంత్రణలో పారదర్శకత, పోలీసు పర్యవేక్షణలో సామర్థ్యం పెరుగుతాయి. ప్రభుత్వానికి ఆదాయం, డ్రైవర్లకు ఉపాధితో పాటు ప్రమాదాలు అరికట్టడానికి దోహదపడుతుంది.
మూడు కేటగిరీలను కలిపితే 2025 వరకు 1,79,827 వాహనాలు ఉన్నాయి. కానీ ఈ మొత్తం “టాక్సీలు” “క్యాబ్ లు , ప్యాసింజర్ క్యారేజ్ కేటగిరీలుగా చలామణి అవుతున్నాయి. రవాణా శాఖ అధికారులు చెక్ పోస్టులమీద ఉన్న ప్రేమ, ఫోర్ వీల్స్ మోటార్ వ్యవస్థ మీద ఉండడంలేదని విమర్శ ఉంది. పోలీసులు ప్రమాదాలకు సాయంత్రం బ్రీత్ అనలైజర్స్ పెట్టి ,ఎదో సాధించామని ఫీల్ అవుచున్నారు, అసలు దొంగలను పట్టుకోకుండా రోజంతా పని చేసుకొని మందు త్రాగిన కూలీలు,సరదాగా ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్ళినవారు ఎక్కువ బలి కావాల్సి వస్తుందనే విమర్శ ఉంది. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. పోలీసు, రవాణా శాఖలు కేవలం చలాన్లు విధించడానికే పరిమితం కాకుండా వాహనం ఏ కేటగిరీలో నమోదైంది? ఎవరు నడుపుతున్నారు? వాణిజ్య వినియోగానికి పర్మిట్ ఉందా? ఫిట్‌నెస్ చెల్లుబాటులో ఉందా? పన్నులు చెల్లించారా? అనే అంశాలను సమగ్రంగా పరిశీలించాలి.వ్యక్తిగత కారు ఎవరి పేరుతో ఉంది? ప్రధాన కూడళ్లలో లక్ష్యిత తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రతి జిల్లాలో సంయుక్త రవాణా,పోలీసు పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలి.
తనిఖీలతో వసూలైన జరిమానాలపై పారదర్శకంగా నెలవారీ నివేదిక విడుదల చేయాలి.“వాహనం రోడ్డుపై తిరుగుతోంది.. కానీ అది ఏ కేటగిరీకి చెందిందో ప్రభుత్వ వ్యవస్థకు తెలియకపోతే, అది కేవలం తనిఖీ వైఫల్యం కాదు, డేటా, నిఘా, సమన్వయ లోపానికి నిదర్శనం. ”సాంకేతికతను ఆపడం కాదు.. దాన్ని నియంత్రించే సమర్థవంతమైన విధానాన్ని నిర్మించడమే ప్రభుత్వ బాధ్యత. రవాణా శాఖ ఆదాయం కాపాడాలి. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు పెరిగి, గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వానికి ఆదాయం పెరగడంలేదు. టాక్సీ ఎగవేతకు పుట్టగొడుగుల్లా వ్యక్తిగత వాహనాలను సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతోప్రభుత్వ ఖజానాకు గండిపెడుతున్న కేంద్రాలను కట్టడికోసం నిఘా పటిష్టం చేసి, టాక్సీ డ్రైవర్ల ఉపాధిని రక్షించాలి.అనుభవం లేని వాహన చోదకులనుండి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలి. దీనికోసం డిజిటల్ యుగంలో “డేటా,గుర్తింపు, తనిఖీ,చర్య” అనే నాలుగు దశల సమగ్ర వ్యవస్థను తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉంది.





