– నిరుద్యోగ పరిష్కారానికి ఇదే చక్కటి మార్గం
– 19న కోదాడలో మెగా జాబ్‌మేళా
– ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు
– ఆఫర్ లెటర్లు అందజేయనున్న పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల
– ప్రతి అభ్యర్థికి ఐదు సంస్థల్లో ఇంటర్వ్యూ అవకాశాలు కల్పించేలా ఏర్పాట్లు
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్/సూర్యాపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : గ్రామీణ ప్రాంతాల్లోని విద్యావంతులైన నిరుద్యోగ యువతకు, ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు మధ్య బలమైన, నిరంతర అనుసంధానం ఏర్పడాల్సిన అవసరం ఉందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ యువతలో ప్రతిభకు కొదవ లేకపోయినా సంఘటిత రంగంలోని ఉద్యోగావకాశాలను అందుకునేందుకు సరైన వేదిక లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఈ అంతరాన్ని తొలగించేందుకు ప్రభుత్వం వ్యవస్థీకృత కార్యాచరణతో ముందుకు సాగుతోందని చెప్పారు. 19న కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా ఏర్పాట్లపై మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొనే కంపెనీల ప్రతినిధులు, వందకు పైగా విద్యాసంస్థల ప్రతినిధులు, స్థానిక అధికారులను ఉద్దేశించి మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. నిరుద్యోగం సమాజాన్ని వేధిస్తున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో ఒకటని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీతోపాటు వివిధ వృత్తి విద్యాకోర్సులు చదివించేందుకు తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు చేస్తున్నప్పటికీ,చదువు పూర్తయ్యాక పిల్లలకు తగిన ఉద్యోగాలు లభించక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, టీపీసీసీ అధ్యక్షుడిగా తన సుదీర్ఘ ప్రజాజీవితంలో ఇటువంటి తల్లిదండ్రులను అనేకమందిని కలిశానని చెప్పారు. మునగాల వంటి గ్రామంలో చదివిన ఇంజినీరింగ్ లేదా వృత్తి విద్యా పట్టభద్రుడికి హైదరాబాద్‌లో నివసించే యువకుడితో సమానంగా ప్రముఖ కంపెనీలను సంప్రదించే అవకాశం ఉండదని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగ ఖాళీల వివరాలు తెలుసుకోవడం, పేరొందిన సంస్థలను సంప్రదించడం, పదేపదే హైదరాబాద్‌కు ప్రయాణించడం, ఇంటర్వ్యూలకు హాజరుకావడం గ్రామీణ యువతకు ఆర్థికంగా, సామాజికంగా పెద్ద సవాల్‌గా మారుతోందన్నారు. గ్రామీణ యువత ప్రముఖ కంపెనీల వద్దకు సులభంగా చేరుకోలేకపోతే, ఆ కంపెనీలనే గ్రామీణ యువత ముంగిటకు తీసుకురావాలి. అదే కోదాడ మెగా జాబ్‌మేళా ప్రధాన ఉద్దేశం అని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, విద్యాసంస్థలు అందిస్తున్న అర్హతలు, యువతలో ఉన్న ప్రతిభ…ఈ మూడింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నమని తెలిపారు. ఒకే ప్రాంగణంలో అనేక సంస్థల ప్రతినిధులను కలిసి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం గ్రామీణ నిరుద్యోగులకు కల్పించనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఒక్కొక్కరికి ఐదు సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత ఏడాది హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జాబ్‌మేళాలో 200కు పైగా కంపెనీలు పాల్గొనగా ఈసారి కోదాడ జాబ్‌మేళాకు సుమారు 300 కంపెనీలను ఆహ్వానించినట్లు మంత్రి వెల్లడించారు. అపోలో గ్రూప్, జీఎంఆర్, రాంకీ, మహీంద్రా అండ్ మహీంద్రాతోపాటు సిమెంట్, తయారీ, సేవలు, ఐటీ, ఫార్మా, నిర్మాణ, వ్యాపార రంగాలకు చెందిన అనేక ప్రముఖ సంస్థలను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి పరిశ్రమ జాబ్‌మేళాలో పాల్గొనేలా పరిశ్రమల శాఖ అధికారులు వ్యక్తిగతంగా సంప్రదించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం, పరిశ్రమల శాఖ, సింగరేణి సంస్థ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్‌మేళా ద్వారా 3,500 మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులకు సాధ్యమైనంత వరకు జాబ్‌మేళా ప్రాంగణంలోనే ఆఫర్ లెటర్లు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై ఆఫర్ లెటర్లు అందజేస్తారని వెల్లడించారు. జాబ్‌మేళాపై ఇప్పటికే సుమారు లక్షన్నర మంది ఉద్యోగార్థులకు బల్క్ సందేశాలు పంపించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. పత్రికా ప్రకటనలు, కరపత్రాలు, పోస్టర్లు, సామాజిక మాధ్యమాల ద్వారా క్యూఆర్ కోడ్‌ను గ్రామస్థాయి వరకు చేరవేస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ నమోదు ద్వారా అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవం వంటి వివరాలను ముందుగానే వర్గీకరించి, కంపెనీలు తెలిపిన మానవ వనరుల అవసరాలకు అనుగుణంగా అనుసంధానం చేసేందుకు వీలవుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, పార్టీల కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ, మండలస్థాయి అధికారులు తమ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను గుర్తించి జాబ్‌మేళా సమాచారం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధాన వేదికకు ఇరువైపులా సుమారు 200 మీటర్ల వరకు వాహనాల రాకపోకలను నియంత్రించి, అభ్యర్థులు సులభంగా నడిచి వెళ్లేందుకు అనువైన పరిస్థితులు కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు. కంపెనీల ప్రతినిధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు రవాణా, వసతి, భోజన సదుపాయాల సమన్వయ బాధ్యతలను కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట ఆర్డీవోలకు అప్పగించినట్లు తెలిపారు. ప్రభుత్వ బాధ్యత అవకాశాల వేదికను నిర్మించడం, పేరొందిన కంపెనీలను గ్రామీణ యువత వద్దకు తీసుకురావడం.. ఆ వేదికపై తమ ప్రతిభను నిరూపించుకొని ఉద్యోగాన్ని సాధించే అవకాశం ప్రతి యువతీయువకుడికీ కల్పిస్తాం అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కోదాడ మెగా జాబ్‌మేళా కేవలం ఒక్కరోజు నిర్వహించే నియామక కార్యక్రమంగా మిగిలిపోకూడదని, గ్రామీణ ప్రతిభను విద్యాసంస్థలు, సంఘటిత పారిశ్రామిక రంగంతో అనుసంధానించే శాశ్వతమైన, ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయగల ఆదర్శ నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు. తరగతి గది నుంచి ఇంటర్వ్యూ గదికి, అక్కడినుంచి ఉద్యోగ నియామక పత్రం వరకు యువత ప్రయాణాన్ని ఒకే వేదికపై సాకారం చేయడమే ఈ జాబ్‌మేళా లక్ష్యమని స్పష్టం చేశారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె.నరసింహ, వివిధ శాఖల అధికారులు, విద్యాసంస్థలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





