అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా

– అయిదుగురి మృతి, 12మందికి గాయాలు

వికారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ ఘాట్‌రోడ్డులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం ఉదయం అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా 12 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్ని రక్షించేందుకు స్థానికులు, పోలీసులు రంగంలోకి దిగారు. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వాళ్లను చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరొకరు కన్నుమూశారు. పటాన్‌చెరులోని కేసారంలో ఓ వ్యక్తి మరణించగా అతని అంత్యక్రియలు చింతకుంటలో నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం హాజరయ్యేందుకు 50మంది ప్రైవేట్ బస్సులో బయల్దేరారు. ఘాట్ రోడ్డు గుండా కిందకు దిగుతున్న సమయంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు వేగంగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ప్రమాదం జరగగానే ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయాందోళనకరంగా మారింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ స్నేహా మెహ్రా

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును ఆరా తీశారు. అనంతరం హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు ఎలాంటి లోటు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.

సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

వికారాబాద్ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. అనంతగిరి హిల్స్ ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రైవేటు బస్సు ప్రయాణికులు దుర్మరణం పాలైన ఘటనపై ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. క్షతగాత్రులైన వారికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుటుందని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *