బిజెపి మూస రాజకీయాలు !

మొన్నటి దిల్లీ ఎన్నికల్లో ఘన విజయం తరవాత బిజెపి ఏ మాత్రం తగ్గడం లేదు. దిల్లీ గెలుపును ఆకాశమంత చేసి ప్రచారం చేసుకున్నారు. దిల్లీ ఎన్నికలకు ముందే జరిగిన వరుస ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా రావడంతో ఇక బిజెపి మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతున్న వేళ బీజేపీ సత్తా చాటి తనకు తిరుగులేదన్న సంకేతాలు ఇచ్చింది. బీహార్‌లోనూ సొంతంగా పాగా వేసేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. బెంగాల్‌ ‌లో  మరోమారు తమవంతుగా ప్రయత్నాలు చేపట్టారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు బిజెపికి అత్యంత ముఖ్యం. ఓ రకంగా చెప్పాలంటే బిజెపి ఎత్తుల ముందు కాంగ్రెస్‌ ‌పెద్దగా ప్రభావం చూపలేక పోతోంది. అంబేడ్కర్‌, ‌రాజ్యాంగం పేరుతో కాంగ్రెస్‌ ఎం‌త రచ్చ చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. అలాగే బిజెపి ఎత్తులన్నీ కాంగ్రెస్‌ను పెద్ద దెబ్బకొట్టేలా ఉంటాయి. ఇవేవీ  పెద్దగా ప్రభావం చూపవని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లాంటి వారు కొట్టి పారేసినా.. ప్రజల్లో నాటుకున్న భావనలను మాత్రం తోసిపుచ్చలేం.

బీజేపీ కూటమి వరుస విజయాలు బిజెపిని తిన్నగా కూర్చోనివ్వడం లేదు. అందుకే దక్షిణాదిలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. తమిళనాడు, కేరళలో త్వరలో ఎన్నికలు రానున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే బీజేపీతో చేతులు కలిపేందుకు ఆయా రాష్ట్రాల్లో చిన్నాచితక పార్టీలు క్యూ కడుతున్నాయి.దిల్లీ  విజయం బీజేపీకి జాతీయ స్థాయిలో మరింత బలాన్ని ఇచ్చింది. అలాగే రేపు జరగగబోయే వివిధ రాష్ట్రాల ఎన్నికలకు కూడా బూస్ట్ ‌కానుంది. తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మున్ముందు మేలు చేస్తుందనే భావన ఉంది. ఈశాన్య రాష్ట్రాలు  దేశ రాజకీయాలను ప్రభావితం చేయలేకపోయినా.. దేశంలో అంతటా బిజెపికి బలం ఉందని చెప్పుకోవడానికి పనికి వొస్తుంది. చిన్న రాష్ట్రాలనైనా గుప్పిట పెట్టుకోవాల్సిందే అన్నది బిజెపి రాజకీయం. దేశ రాజకీయాలు ప్రధానంగా ఉత్తర భారతదేశం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టే ఇటు ఈశాన్య రాష్ట్రాలను జాతీయ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు.

అక్కడ లోక్‌సభ స్థానాలు కూడా చాలా తక్కువ కావడం అందుకు మరో కారణం. కానీ బిజెపి వొచ్చాక ఈ చిన్న రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలన్న లక్ష్యంతో పనిచేసింది. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా పాగా వేయాలన్న పట్టుదలతో ఉంది. అందుకే తెలంగాణ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఎపిలోనూ పాగా వేయకున్నా బలపడాలన్న పట్టుదలతో ఉంది. అందుకే టీడీపీతో కలిసి అధికారం పంచుకుంది. పవన్‌ ‌కళ్యాణ్‌ ఇప్పుడు దక్షిణాదిలో బిజెపికి తురుపు ముక్క కానున్నారు. ప్రస్తుత సమీకరణాలను మాత్రం బీజేపీ బాగా అధ్యయనం చేయడం ద్వారా రానున్న ఎన్నికల నాటికి బలోపేతం కావాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. వీటన్నింటిపై అమిత్‌ ‌షా బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఉన్న అగ్రనాయకత్వాలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఇలా ప్రతి అంశంపై  చర్చించిన బీజేపీ పెద్దలు మార్గనిర్దేశనం చేయబోతున్నట్లు సమాచారం. అమిత్‌ ‌షా రాష్ట్ర రాజకీయాల్లో తరచూ జోక్యం చేసుకుని ఎలా ముందుకు వెళ్లాలో సూచిస్తున్నారు.

విచిత్రమేమంటే ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్‌ అనుసరించిన సంస్కతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ , అమిత్‌ ‌షాలు అమలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం, పార్టీల్లో సీనియర్లను పక్కన పెట్టడం, ముఖ్యమంత్రులను మార్చడం తదితర నిర్ణయాలన్నీ గతంలో కాంగ్రెస్‌ ‌చేసి చూపింది. బిజెపి రాజకీయాల  తీరు కాంగ్రెస్‌ ‌సంస్కతికి ఏ మాత్రం భిన్నంగా లేవనడానికి అనేక నిర్ణయాలు ఉదాహరణగా నిలుస్తాయి. ఈ మొత్తం వ్యవహారంలో అధికారమే లక్ష్యంగా మోదీ  ద్వయం అడుగులు వేస్తోంది. మన్మోహన్‌ ‌సింగ్‌ను కీలుబొమ్మ ప్రధానమంత్రిగా అభివర్ణించిన వారే మోదీ హయాంలో ఇప్పుడంతా కీలుబొమ్మలుగా మారారు. మోదీ హయాంలో బిజెపి కూడా కాంగ్రెస్‌ ‌మాదిరే అధిష్ఠానవర్గాన్ని అత్యంత బలోపేతంగా మార్చి ప్రజలు, వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల అభిప్రాయానికి విలువ లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నది. మోదీ హవా కూడా ఆయన ఆకర్షణ వోట్లు తేగలిగినంత కాలమే సాగుతుంది. స్థానికంగా బలహీనులైన, కీలుబొమ్మలైన నేతలను ప్రోత్సహిస్తే కేంద్రం బలహీనపడ్డప్పుడు తదనుగుణంగా రాష్ట్రాల స్థాయిలో కూడా బిజెపి కుప్పకూలిపోతుంది. అయితే ఇకముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపైనే భవిష్యత్‌ ‌రాజకీయం ఆధారపడి ఉంటుంది.

ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాల్సి ఉంది. బలమైన నేత కోసం గాలిస్తున్నారు. పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకుని వెళ్లగలిగే నేత కావాలి. దక్షిణాదికి చెందిన నేతల్లో ఒకరిని కూడా పరిశీంచే అవకాశం ఉంది. నిజానికి వెంకయ్య నాయుడు లాంటివారు పార్టీలో ఉండివుంటే అధ్యక్ష పదవికి అవకాశం ఉండేది. దక్షిణాదిలో అలాంటి నేతలు లేరనే చెప్పాలి. తెలంగాణలో కూడా సమర్థుడైన, బలమైన నేతను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి ఉంది. నిజానికి బిజెపి ఇప్పుడు మైనార్టీలో ఉంది. ముందుగా మెజార్టీ సాధించే ప్రయత్నాలు చేయడానికి మోదీ ద్వయం ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎన్‌డిఎగా ఉన్నప్పటికీ సొంత బలం కోసమే బిజెపి ప్రయత్నాలు చేస్తుంది. అది కూడా ఈ యేడు మొదలు పెట్టినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.

పార్టీని బలోపేతం చేయడం, అన్ని రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవడమే బిజెపి ముందున్న ప్రధాన లక్ష్యంగా చూడాలి.  బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న పార్టీలు ఒక్క తాటిపైకి రావడానికి కసరత్తు కూడా పెద్దగా జరగడం లేదు. బీజేపీ ని  వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కూడా అవకాశం కోసం చూస్తున్నాయి. ఇప్పటికే బిఆర్‌ఎస్‌, ‌టీఎంసీ,డీఎంకే,ఎన్సీపీ, శివసేన ,ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నాయి. హిందీ వ్యతిరేకతతో తమిళనాడు సిఎం స్టాలిన్‌ ‌తన స్థానం పదిలం చేసుకునే పనిలో ఉన్నారు. బిజెపిని నిలువరించాలని అనుకుంటున్న శక్తులను కూడగట్టాలని చూస్తున్నా.. ఎవరికి కాలం కలసి రావడం లేదు. అన్ని ప్రాంతీయ పార్టీలు జట్టుగా బీజేపీపై రాజకీయ పోరాటం కోసం ఎజెండా సిద్ధం చేసే కసరత్తు చేస్తే తప్ప ఫలితం ఉండదు. బీజేపీ ని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుపై మరింత వేగం పెంచే అవకాశం కోసం చూస్తున్నాయి. అయతే అది సాధ్యం కాదని ఇప్పటికే తేలింది.
– ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page