– భారత అంతర్గత రాజకీయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు
– ఎప్ఆర్ఆర్వోలో బీజేపీ బృందం ఫిర్యాదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : హైదరాబాద్‌లో ఈనెల 14న జరిగిన భారత్ సమ్మిట్ వేదికగా దేశ అంతర్గత రాజకీయాలనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇటలీకి చెందిన పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్(పీఈఎస్) సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం శంషాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్వో)కు వెళ్లి జియాకోమోపై ఫిర్యాదు సమర్పించింది. భారత్ సమ్మిట్‌లో జియాకోమో ఫిలిబెక్ పాల్గొనడం, ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. భారత్ సమ్మిట్ వేదికగా భారతదేశ అంతర్గత ఎన్నికల రాజకీయాలను ఉద్దేశించి ఓట్ చోర్, గద్దీ ఛోడ్ అంటూ ఆ విదేశీ నేత రాజకీయ నినాదాలు చేయడాన్ని ఫిర్యాదులో ప్రధానంగా ప్రస్తావించారు. ఆ విదేశీ ప్రతినిధి ఏ కేటగిరీ వీసాపై భారత్‌కు వచ్చారు.. పర్యటనకు ప్రకటించిన ఉద్దేశం ఏమిటి.. భారత ఇమ్మిగ్రేషన్ చట్టాలను పాటించారా.. అనే అంశాలపై లోతైన విచారణ జరపాలి అని బీజేపీ ప్రతినిధి బందం కోరింది. భారతదేశ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఆ విదేశీ రాజకీయ నాయకుడు తన వీసా నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించారని అనుమానం వ్యక్తం చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025లోని సెక్షన్లు 23, 24 ప్రకారం విచారణ చేపట్టి చట్ట ఉల్లంఘనలు నిర్ధారణైతే తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. విదేశీ రాజకీయ నాయకుడి వ్యాఖ్యలకు సంబంధించి ముందస్తు సమన్వయం, సహకారం లేదా ఇమ్మిగ్రేషన్ చట్టాల ఉల్లంఘనకు ప్రేరేపించడం వంటి అంశాల్లో భారత్ సమ్మిట్ నిర్వాహకుల పాత్రపైనా విచారణ జరపాలన్నది. సమ్మిట్ నిర్వహణకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన అనుమతులు, పొలిటికల్ క్లియరెన్స్‌లు పొందారా లేదా అనేది పరిశీలించాలని, విదేశీ ప్రతినిధికి పంపిన ఆహ్వాన పత్రాలు, వీసా దరఖాస్తులు, అధికారులకు సమర్పించిన డిక్లరేషన్లు, నిర్వాహకులతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆ బందం కోరింది. విచారణలో కాగ్నిజబుల్ నేరాలకు సంబంధించిన ఆధారాలు వెల్లడైతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులైన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన కారణాలు నిర్ధారణైతే ఆ విదేశీ రాజకీయ నాయకుడిని భారత్ నుంచి బహిష్కరించే చర్యలను సైతం పరిశీలించాలన్నది. భారత చట్టాల ఉల్లంఘనకు ఉద్దేశపూర్వకంగా సహకరించినట్లు తేలిన నిర్వాహకులు, స్పాన్సర్లు, ఇతర వ్యక్తులందరిపైనా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. రాజకీయ హోదా, అంతర్జాతీయ స్థాయి పదవి ఏదైనా సరే.. విదేశీ పౌరులెవరూ భారత చట్టాలకు అతీతులు కారని రామచందర్ రావు స్పష్టం చేశారు.
జియాకోమో ఫిలిబెక్, రాహుల్ గాంధీ, నిర్వాహక సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టాలి
భారత్ సమ్మిట్ వేదికగా భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానిస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేసిన ఇటలీకి చెందిన యూరోపియన్ సోషలిస్ట్ పార్టీ సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్, సదస్సు నిర్వాహకులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రామచందర్ రావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈ బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య, లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు. డీజీపీకి ఫిర్యాదు అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ శంషాబాద్‌లోని ఎఫ్ఆర్ఆర్వో అధికారులకు ఫిర్యాదు చేశామని, ఇప్పుడు డీజీపీని కలిసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. జియాకోమో ఫిలిబెక్ మన దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రపంచం ముందు భారత ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఉన్నప్పటికీ అతడిని అడ్డుకోకపోగా ప్రోత్సహించడం దారుణమన్నారు. ఈ నేరానికి ప్రత్యక్షంగా ప్రేరేపించిన నిర్వాహక సంస్థలపైనా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ సదస్సును నిర్వహించిన వారు కాంగ్రెస్ థింక్ ట్యాంక్ సమృద్ధి భారత్ ఫౌండేషన్, కో-స్పాన్సర్ అయిన ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్, అర్బన్ నక్సల్స్ ప్రేరిత వ్యక్తులని, ఈ ఈవెంట్‌ను స్పాన్సర్ చేసిన బెంగళూరుకు చెందిన ఫేజ్ 1 కంపెనీతోపాటు ఈ కార్యక్రమానికి వేదిక కల్పించిన తెలంగాణ ప్రభుత్వంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాహుల్ గాంధీయే ప్రధాన ప్రేరేపకుడు కాబట్టి చట్టప్రకారం ఆయనపై కూడా కేసు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. సదస్సు కోసం వచ్చిన విదేశీయులు కాన్ఫరెన్స్ రూమ్ మీటింగ్ అని తప్పుడు కారణాలు చెప్పి మోసపూర్వకంగా భారత్‌లోకి ప్రవేశించారని ఆరోపించారు. వీరు భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం వస్తున్నారని చివరి నిమిషంలో తెలియడంతోనే కేంద్ర ప్రభుత్వం 115 మంది వీసాలను విమానం ఎక్కే ముందు రద్దు చేసిందని వెల్లడించారు. ఇది భారత్ సమ్మిట్ కాదు.. పక్కా యాంటీ భారత్ సమ్మిట్అ ని ఆయన మండిపడ్డారు. ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకొని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆ సంస్థలపై చర్యలు తీసుకోకపోతే బీజేపీ తరఫున న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, ఈ దేశ వ్యతిరేక శక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని రామచందర్ రావు తేల్చిచెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





