అభివృద్ధి ఊసేది? సంక్షేమం ఎక్కడిది?

“ముఖ్యమంత్రి గారూ.. కేసీఆర్ కుటుంబంపై విమర్శలకు కేటాయించిన సమయంలో సగం అయినా ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయించండి. బూతుల వర్షంతో రైతుల పొలాలకు నీళ్లు రావు. దండయాత్రల హెచ్చరికలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. రాజకీయ కక్షలతో ఆరు గ్యారంటీలు అమలు కావు. ప్రజలు కోరేది మీ బూతు పురాణం కాదు.. అభివృద్ధి ప్రణాళిక. రాజకీయ ప్రతీకారాలు కాదు.. సంక్షేమ భరోసా. విమర్శలు కాదు.. చేతల్లో అభివృద్ధి!”
ప్రజా సమస్యలకు పాతర.. రాజకీయ కక్షలకు పెద్దపీట! బూతు పురాణమే ముఖ్యమంత్రి ప్రసంగం అజెండానా? ఉద్యమ చరిత్రపై మాట్లాడే ముందు మీ పాత్ర ఏమిటో చెప్పండి!
-జీడిపల్లి రాంరెడ్డి (ఎం.ఎ. ఎంసీజే)
ప్రిలాన్స్ జర్నలిస్ట్ 9666680051

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతున్నారంటే ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తారు. తమ ప్రాంతానికి కొత్తగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటిస్తారు? పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపిస్తారా? రైతులకు భరోసా కల్పిస్తారా? నిరుద్యోగులకు ఉద్యోగాలపై స్పష్టత ఇస్తారా? ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఏమైనా ప్రకటన చేస్తారా? అని ఆసక్తిగా గమనిస్తారు. కానీ సిద్ధిపేటలో ఇందిరమ్మ బీమా పేరుతో రేవంత్‌రెడ్డి నిర్వహించిన సభ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపించింది. అభివృద్ధి లేదు.. సంక్షేమం లేదు.. ప్రజా సమస్యల ప్రస్తావన లేదు. గంటసేపు సాగిన ప్రసంగంలో దాదాపు 99 శాతం సమయం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలకే కేటాయించినట్లుగా కనిపించింది. ‘నా భూతో.. నా భవిష్యత్తు’ అన్నట్టుగా వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలతో సభను నడిపించడం ముఖ్యమంత్రి హోదాకు తగినదేనా?

సిరిసిల్లలో దండయాత్ర చేస్తా.. సిద్ధిపేటలో దండయాత్ర చేస్తా అంటూ ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు చూస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారా? లేక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా రాజకీయ ప్రత్యర్థులపై యుద్ధం ప్రకటిస్తున్నారా? అనే సందేహం కలుగుతుంది . ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీకి మాత్రమే ప్రతినిధి కాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు బాధ్యత వహించాల్సిన వ్యక్తి. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన వేదికపై రాజకీయ కక్షలు, వ్యక్తిగత దూషణలే ప్రధాన అంశాలుగా మారడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమా?
రంగబలం.. అర్థబలం.. అధికార బలంతో జనసమీకరణ!
సుమారు 25 నియోజకవర్గాల నుంచి 1,800 బస్సుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను తీసుకొచ్చారు..ఉమ్మడి మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి మహిళలను తరలించి సభను విజయవంతం చేయాలని ప్రయత్నించారు. సిద్ధిపేట జిల్లా ప్రజలే పెద్ద సంఖ్యలో సభకు వస్తారన్న నమ్మకం లేదా? కేసీఆర్, హరీశ్‌రావులకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని ఇతర జిల్లాల నుంచి జనసమీకరణ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సభకు వచ్చిన జనసంఖ్య కంటే ప్రజలకు ఉపయోగపడే ప్రకటనలు ఎన్ని చేశారన్నదే ముఖ్యం.
తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే ముందు మీ పాత్ర ఏమిటి రేవంత్‌రెడ్డీ?
తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ కుటుంబం అన్యాయం చేసిందంటూ రేవంత్‌రెడ్డి మొసలి  కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ కోసం విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు రోడ్లపైకి వచ్చి ఉద్యమించినప్పుడు రేవంత్‌రెడ్డి ఎక్కడ ఉన్నారు? ఏ పార్టీ తరఫున పనిచేశారు? ఉద్యమానికి ఆయన చేసిన ప్రత్యక్ష సహకారం ఏమిటి?
2009లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన రాజకీయ వైఖరి, ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు నేటికీ చర్చకు వస్తున్నాయి.
కరీంనగర్‌లో ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టారనే ఆరోపణలు అప్పట్లో రాజకీయ వివాదానికి దారితీశాయి. తాను పదేళ్లపాటు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామినని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి ఆ ఉద్యమ ప్రస్థానంలో చేసిన పోరాటాలేమిటో వివరించాలి. అమరవీరుల కుటుంబాలను ఎప్పుడు పరామర్శించారు? ఉద్యమకారులపై నిర్బంధం జరిగినప్పుడు వారి పక్షాన ఎప్పుడు నిలిచారు? ఏనాడైనా జై తెలంగాణ అని నినదించారా? తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారా? సిద్ధిపేటకు వచ్చిన ముఖ్యమంత్రి రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించకుండా ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. సభలో మాత్రం అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడారు. శ్రీకాంతాచారి తల్లిపై ప్రేమ ఒలకబోసే ముందు ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి. ఆమెను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓడించిన విషయం మరిచిపోయారా? అమరవీరుల కుటుంబాల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాజకీయ వేదికలపై కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. వారికి న్యాయం చేయాలి.
అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా?
అమరవీరుల పేర్లు ప్రస్తావించడం సులభమే. కానీ వారి కుటుంబాలకు ఎవరు అండగా నిలిచారు? వారి త్యాగాలకు గుర్తింపు ఇచ్చింది ఎవరు? అన్నది కూడా మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గుర్తించిన అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టింది. 2014లో గుర్తించిన 459 అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ చేపట్టింది. 2016 జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు చెందిన 598 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందించారు. అర్హతల ఆధారంగా కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, ఇతర సంక్షేమ ప్రయోజనాలు కల్పించారు. ఆ చర్యల్లో ఏమైనా లోపాలుంటే సరిదిద్దాలి. మిగిలిన కుటుంబాలకు న్యాయం చేయాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని అమరవీరుల కుటుంబాలకు ఏయే ప్రయోజనాలు కల్పించిందో చెప్పాలి. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తారో ప్రకటించాలి.
తెలంగాణ కళాకారులకు గుర్తింపు ఇచ్చింది ఎవరు?
తెలంగాణ ఉద్యమంలో పాటలు, ఆటలు, ధూంధాం కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం నింపిన కళాకారుల పాత్ర మరువలేనిది. తమ కళనే ఆయుధంగా చేసుకుని తెలంగాణ ఆకాంక్షను గ్రామగ్రామానికి తీసుకెళ్లారు. కేసీఆర్ ప్రభుత్వం వారి సేవలను గుర్తించి తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి వందలాది మంది కళాకారులకు ఉపాధి కల్పించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారికి అవకాశం కల్పించింది. మరి నేటి ప్రభుత్వం కళాకారుల సంక్షేమానికి ఏం చేసింది? వారి వేతనాలు, ఉద్యోగ భద్రత, ఉపాధి అవకాశాలపై ఏం చర్యలు తీసుకుంది? ఎన్నికల సమయంలో జానపద కళాకారుల పాటలను ప్రచారానికి ఉపయోగించుకున్న కాంగ్రెస్ నాయకత్వం, ఇప్పుడు వారి జీవితాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత లేదా?
ముత్యంరెడ్డి, సోలిపేట గురించి మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకోవాలి!
స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి, స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి వంటి నాయకులను కేసీఆర్‌, హరీశ్ రావులతో పోలుస్తూ రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు రాజకీయ అవగాహనకు అద్దం పడుతుంది . చెరుకు ముత్యంరెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటికే రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభ దశలో కూడా లేదు. ముత్యంరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి అదే పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతోనే ముత్యంరెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలు వేరైనా మానవీయ సంబంధాలకు విలువ ఇవ్వడం ఎలా ఉంటుందో కేసీఆర్ చూపించారు. ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడినప్పుడు కేసీఆర్ అండగా నిలిచి అమెరికాలో చికిత్స చేయించిన విషయం ప్రజలకు తెలిసిందే. అలాంటి నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు కనీస రాజకీయ సంస్కారం పాటించాలి.
మరి అదే తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగారు? దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో పనిచేస్తూ పార్టీ కోసం త్యాగాలు చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్ హనుమంతరావు, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ వంటి నాయకులను కాదని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? రాజకీయ ఎదుగుదల గురించి ఇతరులను ప్రశ్నించే ముందు తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం తర్వాత ఆయన కుటుంబానికి కేసీఆర్, హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి అండగా నిలిచారు. ఉప ఎన్నికల్లో ఆయన భార్య సుజాతను బరిలోకి దించి గెలిపించేందుకు ప్రయత్నించారు. ఓటమి ఎదురైనా ఆ కుటుంబంతో బీఆర్‌ఎస్ నాయకుల అనుబంధం కొనసాగింది. ఇప్పుడు ఆ కుటుంబం గురించి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి, రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిన ఆదరణ ఏమిటో కూడా చెప్పాలి.
పార్టీ మారితే రాజకీయ వ్యూహం.. కేసీఆర్ చేస్తే వెన్నుపోటా?
కేసీఆర్ గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో పనిచేశారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవులకు రాజీనామా చేసి ప్రత్యేక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యంతో ఉద్యమాన్ని నడిపించారు. మరి రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఏమిటి? తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసి, 2017లో ఆ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్‌లో చేరారు. రాజకీయంగా ఎదిగిన పార్టీని వదిలి మరో పార్టీలో చేరడం ఆయన వ్యక్తిగత నిర్ణయం. అందులో తప్పు లేదు. కానీ ఇతరులు పార్టీలు మారితే విమర్శలు, తాను మారితే రాజకీయ ఎదుగుదల అన్నట్లుగా మాట్లాడటం ద్వంద్వ వైఖరి కాదా? కేసీఆర్ తెలంగాణ కోసం పార్టీ ఏర్పాటు చేస్తే వెన్నుపోటు అంటారు. మరి రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్‌లో చేరడం ఏమిటి? రాజకీయ ప్రత్యర్థుల గతాన్ని తవ్వే ముందు తమ గతాన్ని కూడా ప్రజలకు వివరించాలి.
కవిత విషయంలో అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట!
కేసీఆర్ కుమార్తె కవిత విషయంలో రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరి కూడా రాజకీయ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. గతంలో ఆమె అరెస్టు, బెయిల్ వ్యవహారంపై రాజకీయ విమర్శలు చేస్తూ, బీఆర్‌ఎస్–బీజేపీ ఒప్పందం ఉందంటూ ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు అభ్యంతరాల నేపథ్యంలో 2024 ఆగస్టు 30న బేషరతుగా విచారం వ్యక్తం చేసిన విషయం కూడా ప్రజలకు గుర్తుంది. ఇప్పుడు సిద్ధిపేట సభలో మాత్రం కవితకు అన్యాయం జరిగినట్లుగా మాట్లాడుతున్నారు. అప్పుడొక మాట.. ఇప్పుడు మరో మాటా? నిజంగా అన్యాయం జరిగిందని భావిస్తే గతంలో చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి. రాజకీయ అవసరాన్ని బట్టి ఒకే అంశంపై వైఖరి మార్చుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగినదేనా?
కుటుంబ పాలనపై విమర్శలు చేసే ముందు మీ కుటుంబం గురించి చెప్పాలి!
కేసీఆర్ కుటుంబం ఆస్తులు కూడబెట్టుకుందని, కుటుంబ పాలన సాగించిందని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. మరి తన కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆస్తులు, ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యవహారాలపై బీఆర్‌ఎస్ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా? ముఖ్యంగా ఆయన సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి సంబంధించిన టెస్సరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపు వ్యవహారంపై కేటీఆర్, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యమంత్రి కుమార్తెకు సంబంధించిన వ్యాపార, ఆస్తుల వ్యవహారాలపైనా ఆరోపణలు వచ్చాయి. ఇవి ఆరోపణలే అయినప్పటికీ వాటిపై పారదర్శకంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దగా రేవంత్‌రెడ్డిపై ఉంది. ఇతరుల ఆస్తుల గురించి, కుటుంబ సభ్యుల గురించి సభల్లో ప్రశ్నించే ముఖ్యమంత్రి తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలకు ఎందుకు సమాధానం చెప్పకూడదు? ఆరోపణలు నిజమో కాదో తేల్చాల్సింది చట్టబద్ధమైన విచారణే. అందుకు సిద్ధమా? ఇతరులకు వర్తించే ప్రమాణాలే తనకూ వర్తిస్తాయన్న విషయాన్ని గుర్తించాలి.
సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేక విమర్శలా?
కేసీఆర్, హరీశ్‌రావు కృషితో సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, విద్యాసంస్థలు, వైద్య సదుపాయాలు, తాగునీటి పథకాలు, గ్రామీణ అభివృద్ధి వంటి అనేక రంగాల్లో సిద్దిపేటకు గుర్తింపు తీసుకొచ్చారు. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఒక్కరోజులో జరిగే పని కాదు. నిరంతర ప్రణాళిక, నిధులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ అవసరం. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో లోపాలుంటే సరిదిద్దాలి. మరిన్ని నిధులు కేటాయించి కొత్త పనులు చేపట్టాలి. అంతేకానీ గతంలో చేసిన పనులను విమర్శించడం మాత్రమే పాలన కాదు. సిద్ధిపేట సభకు వచ్చిన ముఖ్యమంత్రి కొత్తగా ఏం ప్రకటించారు? వెయ్యి పడకల ప్రభుత్వ హాస్పిటల్  పనుల పురోగతి ఏమిటి? వైద్యుల నియామకాలు ఎప్పుడు చేపడతారు? ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు ఎప్పుడు?  గ్రామీణ రహదారులకు నిధులు ఎప్పుడు మంజూరు చేస్తారు? కొత్త పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలపై ఏమైనా ప్రకటన ఉందా? ప్రజలు ఎదురుచూసిన ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ?
కాళేశ్వరం కమిషన్‌పై ఆరోపణలు.. హైకోర్టు తీర్పుపై సమాధానం ఏది?
కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2025 జూలై 31న కమిషన్ నివేదిక సమర్పించింది. అయితే 2026 ఏప్రిల్ 22న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేస్తూనే, విచారణలో సహజ న్యాయసూత్రాలు, చట్టపరమైన విధానాలు పాటించలేదని పేర్కొంది. నివేదికలోని నిర్ధారణల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. ఈ పరిణామాల తర్వాత కూడా రాజకీయ ఆరోపణలేనా? అదే సమయంలో ప్రాజెక్టును పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించాలి. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, అనంతగిరి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఎంత ఉన్నాయి? రబీ సాగుకు నీటిని విడుదల చేస్తారా? కాలువల మరమ్మతులు ఎప్పుడు చేపడతారు? కాళేశ్వరం పునరుద్ధరణకు ప్రభుత్వం వద్ద ఉన్న కార్యాచరణ ఏమిటి? రాజకీయ ఆరోపణలతో రైతుల పొలాలకు నీళ్లు రావు కదా!
కరువు కమ్ముకుంటుంటే రైతుల గురించి ఒక్క మాట లేదా?
ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.  సిద్ధిపేట జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు ఎండిపోతున్నాయి. బోర్లు అడుగంటుతున్నాయి. రబీ సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రైతులు అప్పులు చేసి సాగు చేయాలా? పంటలు వేయకుండా ఖాలీ గా  ఉండాలా? అనే అయోమయంలో ఉన్నారు. రైతుల పరిస్థితి, రైతు కూలీల జీవనోపాధి, పశువులకు మేత, తాగునీటి సమస్యలపై ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కరువు మండలాల ప్రకటనపై స్పష్టత లేదు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఎంత ఇస్తారు? సాగునీటి విడుదలకు ఏమైనా ప్రణాళిక ఉందా? రైతు భరోసా ఎప్పుడు అందుతుంది? పంట పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్న రైతులకు భరోసా ఏమిటి? ఇవన్నీ ప్రజలు ఎదురుచూస్తున్న ప్రశ్నలు.
ఆరు గ్యారంటీలు ఎక్కడ? 420 హామీల అమలు ఏమైంది?
ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా అన్ని హామీల అమలుపై స్పష్టత లేదు. ఎన్నికల ముందు వివిధ ప్రాంతాల్లో ప్రకటించిన డిక్లరేషన్లు ఏమయ్యాయి? 420 హామీల్లో ఎన్ని పూర్తయ్యాయి? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? మహిళలకు నెలకు రూ.2,500, కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు రూ.4,000 పింఛన్ వంటి హామీల అమలుపై స్పష్టత లేదు, రైతు భరోసా కౌలు రైతులకు, రైతు కూలీలకు అందేలా ఏం చేస్తున్నారు? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?
నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినా ఉద్యోగాల భర్తీపై ఆశించిన పురోగతి లేదు.జాబ్ క్యాలెండర్ కాస్తా జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మారింది. ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా ముఖ్యమంత్రి సమాధానం లేదు.
గత ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మంగళం పాడి..చిలుక పలుకులేలా?
కేసీఆర్ పాలనలో అమలైన రైతు బీమా, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, గొర్రెల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు, న్యూట్రిషన్ కిట్లు వంటి పథకాలు  నిలిచిపోయాయి.
ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా కొనసాగించాలి. మరింత మెరుగుపరచాలి. రాజకీయ కక్షతో వాటిని నిలిపివేస్తే నష్టపోయేది ప్రజలే.
జగన్‌పై విమర్శలు.. చంద్రబాబు విషయంలో మౌనం ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చి జగన్మోహన్‌రెడ్డిపై, కేసీఆర్‌తో సంబంధాలపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసమే అన్న అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబునాయుడుతో రాజకీయ సాన్నిహిత్యం ఉన్నప్పుడు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను ఎంత గట్టిగా కాపాడుతున్నారు? కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? తెలంగాణ రైతుల నీటి హక్కుల విషయంలో రాజీ పడకుండా ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాజకీయ సంబంధాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి.
ముఖ్యమంత్రి అధికారిక పర్యటనలు, బహిరంగ సభలు ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాలి. ప్రభుత్వ యంత్రాంగం, అధికారిక వనరులు, ప్రజాధనం వినియోగించి సభ నిర్వహించినప్పుడు అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు, సంక్షేమ హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రకటనలు ఉండాలి. రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే పార్టీ వేదికలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా ఉండాలి. సిద్ధిపేట సభలో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడారు. కానీ ప్రజలకు కావాల్సిన ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి.
రైతులకు సాగునీరు ఎప్పుడు అందుతుంది? కరెంటు సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయి? యూరియా కొరత ఎప్పుడు తీరుతుంది? బీడీ కార్మికులకు పింఛన్లు ఎప్పుడు పెరుగుతాయి? వృద్ధులకు రూ.4,000 పింఛన్ ఎప్పుడు వస్తుంది? మహిళలకు నెలకు రూ.2,500 ఎప్పుడు అందుతుంది? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? విద్యార్థులకు విద్యా భరోసా ఎప్పుడు అమలవుతుంది? నిర్వాసితులకు పెండింగ్ పరిహారాలు ఎప్పుడు అందుతాయి? ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఎప్పుడు ఇస్తారు?
ఇవే ప్రజల ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది.
ప్రజలు కోరేది బూతుల పురాణం కాదు.. భరోసా ఇచ్చే పాలన!
రాజకీయాల్లో విమర్శలు సహజం. ప్రతిపక్షాల తప్పులను ఎత్తిచూపవచ్చు. అవినీతి జరిగితే ఆధారాలతో నిరూపించవచ్చు. తప్పు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై విమర్శలు, ప్రత్యర్థులను అవమానించే వ్యాఖ్యలే ఒక ముఖ్యమంత్రి ప్రసంగానికి ప్రధాన అంశాలైతే ప్రజలకు ఒరిగేదేమిటి? కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేసే ముందు తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలి. ఇతరుల రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నించే ముందు తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే ముందు ఉద్యమ సమయంలో తన పాత్రను ప్రజలకు వివరించాలి. అమరవీరుల పేర్లు ప్రస్తావించే ముందు వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. ముఖ్యమంత్రిగా ఉండటం శాశ్వతం కాదు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి. గతంలో కేసీఆర్‌ను ప్రజలు గెలిపించారు.. ఆ తర్వాత కాంగ్రెస్‌ను గెలిపించారు. రేపు ఎవరిని గెలిపించాలో కూడా ప్రజలే నిర్ణయిస్తారు.
సిద్ధిపేట సభ ముగిసింది.. కానీ ప్రజల ప్రశ్నలు మాత్రం ముగియలేదు!
ముఖ్యమంత్రి గారూ.. కేసీఆర్ కుటుంబంపై విమర్శలకు కేటాయించిన సమయంలో సగం అయినా ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయించండి. బూతుల వర్షంతో రైతుల పొలాలకు నీళ్లు రావు. దండయాత్రల హెచ్చరికలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. రాజకీయ కక్షలతో ఆరు గ్యారంటీలు అమలు కావు. ప్రజలు కోరేది మీ బూతు పురాణం కాదు.. అభివృద్ధి ప్రణాళిక. రాజకీయ ప్రతీకారాలు కాదు.. సంక్షేమ భరోసా. విమర్శలు కాదు.. చేతల్లో అభివృద్ధి!
-జీడిపల్లి రాంరెడ్డి, MA, MCJ
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
9666680051

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *