నాడు నిర్వాసితుల కోసం పోరాటం.. నేడు వారి సమస్యలపై మౌనమెందుకు?

“గతంలో తాను డిమాండ్ చేసిన పరిహారం, పునరావాసం, నిర్వాసితుల హక్కులకు సంబంధించిన అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన ప్రభుత్వంపైనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక సమస్యను ప్రస్తావించడం సులభం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సమస్యకు పరిష్కారం చూపించడం పాలకుడి బాధ్యత. నాడు బాధితుల మధ్య నిలబడి మాట్లాడిన మాటలు నేడు పాలనలోనూ ప్రతిఫలించాలి. అప్పుడే ప్రజలకు రాజకీయ నాయకత్వంపై విశ్వాసం పెరుగుతుంది..”

-జీడిపల్లి రాంరెడ్డి (ఎం.ఎ . ఎంసీజే)
ప్రిలాన్స్ జర్నలిస్ట్ 9666680051

ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలో మరో మాటా? మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ బాధితుల సమస్యలపై రేవంత్‌రెడ్డి వైఖరికి కాలమే సాక్ష్యం! నాడు నిర్వాసితుల కోసం రోడ్డెక్కారు.. నిరాహార దీక్షలు చేశారు.. ప్రభుత్వాన్ని నిలదీశారు.. నేడు ముఖ్యమంత్రి హోదాలో అదే బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది! రాజకీయాల్లో అధికారాలు మారవచ్చు.. పార్టీలు మారవచ్చు.. ప్రభుత్వాలు మారవచ్చు. కానీ ప్రజల సమస్యలు మాత్రం పాలకులు మారినప్పుడల్లా కొత్తగా పుట్టుకురావు. ముఖ్యంగా అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూములు, ఇళ్లు, పుట్టిపెరిగిన గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యలు రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కావాల్సినవి. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి వారి పక్షాన పోరాడిన నాయకుడే నేడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు, ఆ బాధితుల సమస్యలు మరింత ప్రాధాన్యతతో పరిష్కారం కావాలని ప్రజలు ఆశించడం సహజం.

నాడు నిర్వాసితులకోసం ఆందోళన
2016లో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామం నిర్వాసితుల ఆందోళనలతో అట్టుడికింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చేరుకుని నిర్వాసితుల పక్షాన నిలిచారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. బాధితులతో మాట్లాడారు. వారి ఆందోళనల్లో పాల్గొన్నారు. అప్పటి ప్రభుత్వం భూసేకరణ కోసం తీసుకొచ్చిన జీఓ  123ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, ఇతర వృత్తులపై ఆధారపడిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలని కోరారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా 2016 జూన్‌లో ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 48 గంటల నిరాహార దీక్షకు కూడా దిగారు.

ఇతర ప్రాజెక్టుల బాధితుల కోసం కూడా!
రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, నిర్వాసితుల సమస్యలు పలుమార్లు ప్రస్తావనకు వచ్చాయి. కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు బాధిత రైతుల పరిహారం విషయంలోనూ ఆయన స్పందించారు. 2019లో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో గజ్వేల్‌లో రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డికి మద్దతు తెలిపారు. 2013 భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ విషయంలోనూ కొల్లాపూర్ ప్రాంత రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచారు. భూసేకరణలో రైతులకు జరుగుతున్న నష్టంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా గజ్వేల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతుల ఆందోళనల్లో తాను పాల్గొన్నానని గుర్తుచేశారు. నిర్వాసితులకు తగిన పరిహారం అందించడంలో అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అంటే మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ బాధితుల సమస్యలు రేవంత్‌రెడ్డికి కొత్తగా తెలిసినవి కావు. ఏ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? నిర్వాసితులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అనే విషయాలపై గతంలోనే ఆయనకు అవగాహన ఉంది.

ఎన్నికల మేనిఫెస్టోలోనూ ప్రాజెక్టు బాధితులకు హామీ!
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభయహస్తం మేనిఫెస్టోలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన రైతులకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొంది. 2013 భూసేకరణ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని, భూసేకరణ పరిహారాన్ని సమీక్షిస్తామని హామీ ఇచ్చింది. అసైన్డ్, పోడు భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం అందిస్తామని తెలిపింది. అంటే ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలు కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ హామీల్లో చోటు సంపాదించాయి. ఇప్పుడు ఆ హామీల అమలుపై ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది.

మిగిలిన పది శాతం సంగతేంటి?
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ సాగునీటి చరిత్రలో కీలక ఘట్టం. ఈ ప్రాజెక్టు ద్వారా అనేక ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందుతున్నప్పటికీ, ఇందుకోసం తమ భూములు, ఇళ్లు, గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల జీవితాల్లోనూ అభివృద్ధి కనిపించాలి. గత ప్రభుత్వ హయాంలో మల్లన్నసాగర్‌కు సంబంధించి దాదాపు 90 శాతం పునరావాసం, పునఃస్థాపన పనులు పూర్తయినట్లు బీఆర్‌ఎస్ నాయకులతో పాటు పోరాటం చేస్తున్న ముంపు బాధితుల సంఘం నాయకులు కూడా పేర్కొంటున్నారు. 2025 ఫిబ్రవరిలో హరీశ్‌రావు సైతం 90 శాతం ఆర్‌అండ్‌ఆర్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అంటే ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు సుమారు పది శాతం వరకు ఉన్నాయి. ఆ మిగిలిన సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాల్సి ఉంది. అర్హులైన నిర్వాసితులకు పరిహారం, ఇళ్ల స్థలాలు, పునరావాస ప్రయోజనాలు అందించాలి. ఒక్కో కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి అధికారులతో సమీక్షించి పరిష్కరించాలి.

ఫోటో : నాడు ఆయన చేసిన ప్రసంగాలు, డిమాండ్లు పత్రికా పుటల్లో నేటికీ సాక్ష్యాలుగా నిలిచాయి. (మన తెలంగాణ, 27 జూన్ 2016 నాటి వార్తా కథనం).

అయితే బాధితుల ఆవేదన ఏమిటంటే.. ప్రభుత్వం మారిన తర్వాత తమ సమస్యల పరిష్కారంపై ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదన్నది. గతంలో తమ పక్షాన పోరాడిన నాయకుడే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మిగిలిన సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మల్లన్నసాగర్ నిర్వాసితుల పరిహారం, పునరావాస ప్రయోజనాల విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. 2026 సెప్టెంబర్‌లో హైకోర్టు తొగుట, రాంపూర్ ప్రాంతాలకు చెందిన కొందరు చిన్న, సన్నకారు రైతుల పిటిషన్లపై విచారణ సందర్భంగా అర్హులైన వారికి పునరావాస, పునఃస్థాపన ప్రయోజనాలు నిరాకరించరాదని స్పష్టం చేసింది. వారి అర్హతలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాలు నిర్వాసితుల సమస్యలు ఇంకా పూర్తిగా ముగియలేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి.

నాడు ప్రశ్నించారు…నేడు పరిష్కారం ఏదీ?
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. నాడు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు మల్లన్నసాగర్ బాధితుల కోసం పోరాడారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వివిధ ప్రాజెక్టుల బాధితుల సమస్యలను ప్రస్తావించారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల సమయంలో నిర్వాసితుల సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లారు.కానీ నేడు ఆయనే ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఆయనే. గతంలో తాను డిమాండ్ చేసిన పరిహారం, పునరావాసం, నిర్వాసితుల హక్కులకు సంబంధించిన అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన ప్రభుత్వంపైనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక సమస్యను ప్రస్తావించడం సులభం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సమస్యకు పరిష్కారం చూపించడం పాలకుడి బాధ్యత. నాడు బాధితుల మధ్య నిలబడి మాట్లాడిన మాటలు నేడు పాలనలోనూ ప్రతిఫలించాలి. అప్పుడే ప్రజలకు రాజకీయ నాయకత్వంపై విశ్వాసం పెరుగుతుంది.

నిర్వాసితులకు భరోసా ఇస్తారా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  19న సిద్దిపేట పర్యటన నేపథ్యంలో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ నిర్వాసితుల సమస్యలు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి బాధితుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.మల్లన్నసాగర్, రంగనాయకసాగర్‌తో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్వాసితులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సమగ్ర నివేదిక తెప్పించుకోవాలి. ఎవరికి పరిహారం అందలేదు? ఎవరికి ఇళ్ల స్థలాలు, పునరావాస ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయి? అర్హులైన వారికి ఏయే ప్రయోజనాలు అందించాల్సి ఉంది? అనే అంశాలను పరిశీలించాలి. అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, పెండింగ్ సమస్యల పరిష్కారానికి గడువు నిర్ణయించాలి. బాధితులతో నేరుగా మాట్లాడి వారికి స్పష్టమైన భరోసా కల్పించాలి. ప్రాజెక్టుల నిర్మాణం అభివృద్ధికి గుర్తు కావచ్చు. కానీ ఆ అభివృద్ధి కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన కుటుంబాల జీవితాల్లోనూ వెలుగులు నింపినప్పుడే ఆ అభివృద్ధికి సార్థకత చేకూరుతుంది.

సాగునీటి ప్రాజెక్టులు లక్షలాది ఎకరాలకు నీళ్లందిస్తే, నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత. నాడు ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నిర్వాసితుల కోసం పోరాడిన రేవంత్‌రెడ్డి.. నేడు ముఖ్యమంత్రిగా వారి మిగిలిన సమస్యలను పరిష్కరించి తన పాత మాటలకు కార్యరూపం ఇస్తారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన డిమాండ్లు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలో ఉన్నప్పుడు అమలైతేనే ప్రజాస్వామ్యంలో వాటికి నిజమైన విలువ ఉంటుంది. మా సమస్యల కోసం నాడు రేవంత్ రెడ్డి మాకు అండగా నిలిచారు.. ఆయన ముఖ్యమంత్రి కావడంతో మేము మా అనందానికి అవధులు లేవు.. నాడు ప్రశ్నించిన వ్యక్తే సీఎం కావడంతో మా సమస్యలు పరిష్కారం అవుతాయాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాము.. 3ఏళ్లుగా మంత్రుల చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరిగినా మా ఫైల్ ముందుకు కదలడం లేదని మల్లన్న సాగర్ ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సీఎం పర్యటన సందర్బంగా మా గోడు వెళ్ళబోసుకోవడానికి పాదయాత్ర చేయాలని సంకల్పించారు.. చివరికి కలెక్టర్ జోక్యంతో వారు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.. . అధికారం అనేది ప్రజలకు ఇచ్చిన మాటను మరచిపోవడానికి కాదు.. ఆ మాటను నిలబెట్టుకోవడానికి లభించిన బాధ్యత! నాడు నిర్వాసితుల పక్షాన వినిపించిన గొంతు.. నేడు ముఖ్యమంత్రి హోదాలో వారి సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *