నగర పాలనకు ‘ఎన్నికల’ గ్రహణం!

ప్రజాస్వామ్యానికి పునాది స్థానిక స్వపరిపాలన. ప్రజల రోజువారీ సమస్యలను నేరుగా వినే వేదిక నగరపాలక సంస్థలు. కానీ, కోటికి పైగా జనాభా కలిగిన భాగ్యనగరంలో నేడు ప్రజాప్రతినిధుల గొంతు వినిపించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికైన పాలకమండలి పదవీకాలం 2026 ఫిబ్రవరి 10న ముగిసి తొమ్మిది నెలలు గడుస్తున్నా, నేటికీ ఎన్నికల నగారా మోగకపోవడం ఆందోళనకరం. పరిపాలనా సౌలభ్యం పేరుతో ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించారు.
కార్పొరేషన్ల సంఖ్య పెరిగింది కానీ, ప్రజలకు జవాబుదారీగా ఉండే కార్పొరేటర్లు మాత్రం లేకుండా పోయారు. ప్రస్తుతం ఈ మూడు కార్పొరేషన్ల పాలన పూర్తిగా ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నది . అధికార యంత్రాంగం ఎంత సమర్థవంతంగా పనిచేసినా, ప్రజాప్రతినిధుల స్థానాన్ని భర్తీ చేయలేరు. ఒక సామాన్య పౌరుడికి వీధి దీపం వెలగకపోయినా, డ్రైనేజీ పొంగినా, చెత్త సేకరణ ఆలస్యమైనా నేరుగా వెళ్లి నిలదీసే అవకాశం స్థానిక కార్పొరేటర్ వద్ద ఉంటుంది. నేడు ఆ ప్రజా వేదిక కనుమరుగైంది. అధికారులు తమ కార్యాలయాలకే పరిమితమవుతుండటంతో, క్షేత్రస్థాయిలో ప్రజల గోడు వినే నాథుడే కరువయ్యారు. పౌర సేవల్లో వేగం తగ్గడమే కాకుండా, ప్రజాభిప్రాయానికి విలువలేని ఏకపక్ష నిర్ణయాలు జరిగే ప్రమాదం పొంచి ఉంది.
పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 పురపాలికలను విలీనం చేసి, వార్డుల సంఖ్యను 300కు పెంచి మూడు కార్పొరేషన్లుగా విభజించడం విధానపరంగా ఆహ్వానించదగ్గ పరిణామం. విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా ఈ మార్పు అవసరమే. అయితే, పునర్విభజన, వార్డుల డీలిమిటేషన్, వోటర్ ల  జాబితా సవరణ వంటి సాంకేతిక కారణాలను చూపుతూ ఎన్నికల నోటిఫికేషన్‌లో తీవ్ర ఆలస్యం  చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగంలోని 74వ సవరణ ప్రకారం, నగరపాలక సంస్థల పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకమండలిని కొలువుదీర్చాలి. ప్రత్యేక అధికారుల పాలన అనేది కేవలం అత్యవసర పరిస్థితుల్లో స్వల్పకాలానికి మాత్రమే పరిమితం కావాలి తప్ప, నెలల తరబడి కొనసాగకూడదు.
కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) చట్టం–2026 ద్వారా నగర పరిధిని 650 చదరపు కిలోమీటర్ల నుంచి ఏకంగా 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. దీనివల్ల సుమారు 1.34 కోట్ల మంది జనాభా ఈ మూడు కార్పొరేషన్ల పరిధిలో ఉన్నారు. కొత్త విభజన ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ (689 చ.కి.మీ., 6 జోన్లు, 150 వార్డులు), మల్కాజిగిరి (727 చ.కి.మీ., 3 జోన్లు, 74 వార్డులు), సైబరాబాద్ (637 చ.కి.మీ., 3 జోన్లు, 76 వార్డులు) కార్పొరేషన్లు కొలువుదీరాయి. ప్రభుత్వ వైఖరిని పరిశీలిస్తే, వేగంగా విస్తరిస్తున్న నగర జనాభాకు అనుగుణంగా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ఈ భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు స్పష్టం చేస్తున్నది .
అయితే, విలీనమైన 27 పురపాలికల అనుసంధానం, జనాభా ప్రాతిపదికన వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు, వోటర్ ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) వంటి క్లిష్టమైన ప్రక్రియల వల్లే ఎన్నికల ప్రకటన ఆలస్యమవుఉందని  సర్కారు సమర్థించుకుంటున్నది . మరోవైపు, వార్డుల విభజన నిబంధనలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లు కూడా ప్రక్రియపై ప్రభావం చూపాయి. మరోవైపు, న్యాయపరమైన చిక్కులు కూడా ఎన్నికల ప్రక్రియకు అడ్డంకిగా మారాయి. జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన జరగలేదని దాఖలైన పిటిషన్లపై స్పందించిన హైకోర్టు, సరిహద్దులను తిరిగి నిర్ధారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయొద్దని  జూలై 2026లో మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మూడు కార్పొరేషన్ల చట్టబద్ధత, బీసీ రిజర్వేషన్ల అంశం కూడా న్యాయస్థానం విచారణలో ఉండటం ఎన్నికల ఆలస్యానికి ప్రధాన కారణమైంది.
హైదరాబాద్ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలు అధిక స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో పూర్తి పట్టు సాధించే వరకు ఎన్నికలను వాయిదా వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులను ఒక సాకుగా వాడుకుంటుందని  ప్రతిపక్షాలు, మిషన్ తెలంగాణ వంటి వేదికలు ఆరోపిస్తున్నాయి. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు, హైడ్రా కూల్చివేతలు, హామీల అమలులో ఆలస్యం  వంటి అంశాల వల్ల నగర ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన ప్రభుత్వానికి ఉందన్నది విపక్షాల విమర్శ.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, కీలకమైన ఆదాయ వనరులు కలిగిన ఈ మూడు కార్పొరేషన్లను నేరుగా ప్రభుత్వ నియంత్రణలోని ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఉంచుకోవడం ద్వారా మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులను ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకుపోవొచ్చని  ఆలోచన కూడా ఉందన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్నది . అయితే ఎన్నికలు ఆలస్యమైతే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం  చేయడం లేదని, నవంబర్ 24న హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించే దిశగా కసరత్తు చేస్తుందన్న  అభిప్రాయాలు కూడా ఉన్నాయి .  ఏది ఏమైనా రాష్ట్రంలోని మిగిలిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరిలోనే ఎన్నికలు పూర్తిచేసి కొత్త పాలకమండళ్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, రాష్ట్ర ఆదాయానికి ప్రధాన వనరుగా ఉన్న రాజధాని ప్రాంతాన్ని మాత్రం నెలల తరబడి ప్రత్యేక అధికారుల పాలనలో ఉంచడం విమర్శలకు తావిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *