“వీర్లపాలెం ప్రాజెక్టుపై నిర్ణయానికి పెట్టుబడి అంచనాలతో పాటు స్థానికంగా దక్కే ఉపాధి, రైతులకు లభించే మార్కెట్, నీటి లభ్యత, ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం అన్నీ ఆధారం కావాలి. తాగునీరు, సాగునీరు, అటవీ సంపదకు తగిన రక్షణ కల్పించగలమని శాస్త్రీయ ఆధారాలు చూపినప్పుడే తదుపరి నిర్ణయం తీసుకోవాలి. తీవ్రమైన సమస్యలు తేలితే, వాటికి అమలు చేయగల పరిష్కారాలు నిర్ధారించే వరకు అనుమతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకూడదు..”
షేక్ బాబా | ప్రజాసైన్స్ వేదిక రాష్ట్ర నాయకులు
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం వీర్లపాలెంలో ప్రతిపాదిత ఇథనాల్ పరిశ్రమ స్థానికంగా కీలక చర్చకు దారితీసింది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై ఆశలు ఉన్నప్పటికీ, తాగునీరు, సాగునీరు, పంట భూములు, సమీప అటవీ ప్రాంతాలపై పరిశ్రమ ప్రభావం గురించి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోహమ్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుపై శుక్రవారం నవంబర్ 20 న నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులు, యాజమాన్యం ఈ ప్రశ్నలకు ఆధారాలతో సమాధానమివ్వాలి.
వార్తా కథనాల ప్రకారం, సుమారు 108.82 ఎకరాల్లో రూ.750 కోట్ల పెట్టుబడితో ఈ పారిశ్రామిక సముదాయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ధాన్యం ఆధారిత డిస్టిలరీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 600 కిలోలీటర్లు. ఇందులో 400 కిలోలీటర్ల ఇథనాల్, 200 కిలోలీటర్ల ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఉత్పత్తికి ప్రతిపాదన ఉంది. అదనంగా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. డిస్టిలరీ, విద్యుత్ కేంద్రం కలిసి పనిచేసేటప్పుడు వాటి మొత్తం నీటి వినియోగం, ఉద్గారాలు, వ్యర్థాలు, రవాణా ప్రభావాన్ని పర్యావరణ అంచనాలో పరిగణనలోకి తీసుకోవాలి.
ఉపాధి, రైతులకు మార్కెట్
పెట్రోల్లో ఇథనాల్ కలపడం ద్వారా పెట్రోలియం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, దేశీయ ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ విధాన లక్ష్యాలు. స్థానికంగా పరిశ్రమ నిర్మాణం, నిర్వహణ, రవాణా, అనుబంధ సేవల్లో ఉపాధి అవకాశాలు ఏర్పడవచ్చు. మొక్కజొన్న, ఇతర ధాన్యాలను స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేస్తే వారి పంటలకు అదనపు మార్కెట్ లభించవచ్చు. ఈ ప్రయోజనాలపై యాజమాన్యం నిర్దిష్ట ప్రణాళికను ప్రకటించాలి. స్థానిక యువతకు ఎన్ని శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పిస్తారు? వారికి ఎలాంటి శిక్షణ ఇస్తారు? రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ధర, ఒప్పందం, చెల్లింపు గడువు ఎలా నిర్ణయిస్తారు? ఈ వివరాలను లిఖితపూర్వకంగా వెల్లడిస్తే స్థానికంగా దక్కే ప్రయోజనాన్ని అంచనా వేయవచ్చు.
నీటి కేటాయింపులు, కాలుష్య నియంత్రణ
పరిశ్రమ రోజువారీ నీటి అవసరం ఎంత, అందులో ఎంత పునర్వినియోగిస్తారు, మిగిలిన నీటిని ఏ వనరు నుంచి తీసుకుంటారు అనే వివరాలు ముందుగా వెల్లడించాలి. కృష్ణానది నుంచి నీరు తీసుకోవాలని ప్రతిపాదిస్తే కేటాయింపు పరిమాణం, అనుమతులు, నీటి లభ్యత తగ్గినప్పుడు అమలు చేసే పరిమితులు తెలియాలి. భూగర్భ జలాలను వినియోగిస్తే సమీప గ్రామాల బావులపై ప్రభావాన్ని అంచనా వేయాలి. వీర్లపాలెం, ముదిమాణిక్యం, అడవిదేవులపల్లి గ్రామాల తాగునీటి అవసరాలు, రైతుల సాగునీటి హక్కులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారో స్పష్టం చేయాలి. వీర్లపాలెం–2 ఎత్తిపోతల పథకం పైప్లైన్ మార్గం, నిర్మాణం, ఆయకట్టుపై పరిశ్రమ స్థలం వల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా అన్నది పటాలతో వివరించాలి.
డిస్టిలరీలో అధిక సేంద్రీయ పదార్థాలు కలిగిన వ్యర్థ జలాలు ఉత్పత్తి కావచ్చు. అవి శుద్ధి లేకుండా బయటకు చేరితే నేల, ఉపరితల జలాలు, భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల వ్యర్థ జలాల శుద్ధి కేంద్రం సామర్థ్యం, ద్రవ వ్యర్థాలను బయటకు విడుదల చేయకుండా నిర్వహించే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (జెడ్ఎల్డీ) వ్యవస్థ, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగం గురించి యాజమాన్యం వివరించాలి. శుద్ధి వ్యవస్థలో లోపం తలెత్తితే వ్యర్థ జలాలను ఎలా నిల్వ చేస్తారు, ఉత్పత్తిని ఏ పరిస్థితుల్లో నిలిపివేస్తారు అనే వివరాలు కూడా వెల్లడించాలి.
బాయిలర్లు, విద్యుత్ కేంద్రంలో వాడే ఇంధనం, వాటి నుంచి వెలువడే ఉద్గారాలు, కాలుష్య నియంత్రణ పరికరాల సామర్థ్యం ప్రజలకు తెలియాలి. పరిశ్రమ ప్రారంభానికి ముందు గాలి, నీరు, నేల నాణ్యతను నమోదు చేసి, ఆ తర్వాత క్రమం తప్పకుండా పరీక్షించి ఫలితాలను బహిర్గతం చేయాలి. ముడిసరుకు, ఉత్పత్తుల రవాణా వల్ల గ్రామాల్లో పెరిగే భారీ వాహనాల రాకపోకలు, దుమ్ము, శబ్దాన్ని అంచనా వేయాలి. పది కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలతో పాటు కృష్ణానది, అన్నమేరువాగు, వీర్లపాలెం రిజర్వ్ ఫారెస్ట్, అడవిదేవులపల్లి అటవీ ప్రాంతం, వన్యప్రాణులపై సంభావ్య ప్రభావాలను స్వతంత్ర నిపుణులతో పరిశీలించాలి.
ప్రజల అభ్యంతరాలకు లిఖితపూర్వక సమాధానాలు
ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. నవంబర్ 20న సేకరణను కొనసాగించి, పిటిషనర్లు తమ అభ్యంతరాలను ఆ వేదికపై తెలియజేయాలని హైకోర్టు సూచించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను స్థానికులకు అర్థమయ్యే రూపంలో అందుబాటులో ఉంచాలి. పరిశ్రమకు అనుకూలంగా, వ్యతిరేకంగా మాట్లాడేవారికి సమాన అవకాశం ఇచ్చి, వారి అభిప్రాయాలను అధికారికంగా నమోదు చేయాలి. ప్రతి ముఖ్యమైన అభ్యంతరానికీ అధికారులు, యాజమాన్యం లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలి. అనుమతి ఇచ్చే సందర్భంలో పర్యవేక్షణ బాధ్యత ఎవరిది, ప్రమాణాలు ఉల్లంఘిస్తే ఏ చర్యలు తీసుకుంటారు, కాలుష్యం వల్ల నష్టం జరిగితే పరిహారం ఎలా నిర్ణయిస్తారు అనే అంశాలను అమలు చేయగల షరతులుగా పొందుపరచాలి.
వీర్లపాలెం ప్రాజెక్టుపై నిర్ణయానికి పెట్టుబడి అంచనాలతో పాటు స్థానికంగా దక్కే ఉపాధి, రైతులకు లభించే మార్కెట్, నీటి లభ్యత, ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం అన్నీ ఆధారం కావాలి. తాగునీరు, సాగునీరు, అటవీ సంపదకు తగిన రక్షణ కల్పించగలమని శాస్త్రీయ ఆధారాలు చూపినప్పుడే తదుపరి నిర్ణయం తీసుకోవాలి. తీవ్రమైన సమస్యలు తేలితే, వాటికి అమలు చేయగల పరిష్కారాలు నిర్ధారించే వరకు అనుమతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకూడదు.





