– మానవ హక్కుల వేదిక డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలో సెప్టెంబర్ 23న పల్లాటి వెంకటమ్మ అనే వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యులపై జరిగిన మూక దాడి నేపథ్యంలో బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను, నిందితులను కలిసి వివరాలు సేకరించినట్లు మానవ హక్కుల వేదిక ఒక ప్రకటనలో తెలిపింది. మంచాల పోలీస్ స్టేషన్ కి వెళ్లి అధికారులతో మాట్లాడినట్లు కూడా తెలిపింది. భారత నాస్తిక సమాజం, విజ్ఞానదర్శినిలతో కలిసి సంయుక్తంగా నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి ఈ విచారణ కొనసాగించినట్టు వివరించింది. ఈ సంఘటనలో వెంకటమ్మ అనే ఎస్సీ మహిళపై అదే కులానికి చెందిన వారు హేయమైన దాడి జరిపారన్నారు. సమయానికి పోలీసులు రాకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం వాటిల్లి వుండేదని వివరించింది. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆమె భర్త, ఆమె కొడుకు కూడా దాడికి గురయ్యారు. వెంకటమ్మ రెండు చేతి వేళ్ళ ఎముకలు విరిగిపోయాయి. వీపు, కడుపు, ముఖం, కాళ్ళపై రక్త గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ దాడికి బాధ్యులైనవారిని చట్టపరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది. ఈ నిజ నిర్ధారణలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, రంగారెడ్డి జిల్లా బాధ్యులు ఎ.నరసింహ, సపావత్ రాజు, సభ్యులు వి.దిలీప్, సంజీవ్, వెంకట నారాయణ, అచ్యుత్ కుమార్, కిరణ్, భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షులు జీడి సారయ్య, జీడి స్పార్టకస్, విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు రమేష్, విజ్ఞానదర్శిని సభ్యులు నవీన్, ప్రశాంత్, జ్ఞానేశ్వర్, నరేష్ లు పాల్గొన్నట్టు వేదిక తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


