– రాజన్న ఆలయాన్ని కృష్ణ శిలలతో నిర్మించాలి
– కాళేశ్వరంతో సిరిసిల్ల, వేములవాడలకు ఒరిగిందేమీ లేదు
– నవంబర్ వరకు రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాల్సిందే
– సిరిసిల్ల సెస్‌లో రూ.32 కోట్ల అవినీతిపై విచారణ జరపాలి
– తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
వేములవాడ, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : వేములవాడ ఆలయ అభివృద్ధి పేరిట భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారంటూ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణశిల ఉంది.. ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్లు ఉన్నారు.. అయినా గుడిని కాంక్రీట్‌తో ఎందుకు నిర్మిసున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. వేములవాడ రాజన్నను మంగళవారం దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చోళుల కన్నా ముందు నుంచే ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన భార్య జాంబవతికి సంతానం కోసం ఇక్కడ కోడె మొక్కులు చెల్లించారని, నాటినుంచే కోడె మొక్కుల సంప్రదాయం ప్రారంభమైందని తెలిపారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయాన్ని కాంక్రీట్‌తో నిర్మించడం వల్ల ఆలయం ఎక్కువ కాలం నిలవదని, కృష్ణశిలతో ఆగమ శాస్త్ర ఆచారం ప్రకారం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎంపీ బండి సంజయ్ హిందూత్వం అంటారు కానీ కోడెలు చనిపోతుంటే పట్టించుకోవటం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా ప్రసాద్ స్కీమ్‌లో దక్షిణ కాశిగా ప్రశస్తి పొందిన వేములవాడ ఆలయాన్ని చేర్చలేదని, ఆలయానికి ఒక్క రూపాయి అయినా తేలదని అన్నారు. ఆలయానికి రూ.250 కోట్లు తాము ఇచ్చామంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రూ.5 కోట్లతో కట్టిన ఒక మార్కెట్ వృథాగా ఉండగా మరో మార్కెట్ సగం నిర్మించి వదిలేశారని కవిత విమర్శించారు. రుద్రమ చెరువు అపరిశుభ్రంగా ఉందంటూ హైడ్రా ఏం చేస్తోందని ప్రశ్నించారు. వేములవాడలో అండర్ డ్రైనేజీ అవసరం ఉందని, దానిపై ఎమ్మెల్యే శ్రీనివాస్ దృష్టి పెట్టాలని కోరారు. నేత, చేనేత కార్మికులు సిరిసిల్లలో ఎక్కువగా ఉంటే వేములవాడలో యారన్ డిపో పెట్టారన్నారు.
కాళేశ్వరంతో ఉపయోగం లేదు
కాళేశ్వరం ద్వారా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు ఉపయోగం జరగాలి కానీ ఇప్పటివరకు ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని, పనులన్నీ పెండింగ్‌లో పెట్టారని కవిత ఆరోపించారు. 2018 మేలో అప్పటి నీటిపారుదల మంత్రి హరీష్ వచ్చి నాలుగు నెలల్లో రుద్రంగి రిజర్వాయర్ పూర్తి చేస్తామన్నారు కానీ ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. వాటిని పూర్తి చేస్తే దాదాపు 63 వేల ఎకరాలకు కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వొచ్చునన్నారు. దూమ్పేట్ వద్ద రిజర్వాయర్ కట్టి నీళ్లను లిప్ట్ చేస్తే కథలాపూర్, మేడిపల్లికి నీళ్లు వస్తాయని, ఎర్రకుంట, పటేళ్ల చెరువును కలిపి అక్కడ రిజర్వాయర్ కడితే వేములవాడ, చందుర్తి, కోనరావుపేట మండలాలకు నీళ్లు వస్తాయని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లుగా ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. అప్పర్ మానేర్, మిడ్ మానేరు లింక్ పూర్తి చేస్తే లక్షా 10 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్చొచ్చునన్నారు. వర్షాలు లేక రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, వాళ్లకు నవంబరు వరకు 24 గంటలు కరెంట్ ఉచితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సిరిసిల్లలో మొన్న ముఖ్యమంత్రి సభ పెట్టి చేసేందేమీ లేదన్నారు. సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేసి ఏదో చేస్తారంట.. గత పదేళ్లుగా సిరిసిల్లకు మంత్రి ఉన్నప్పుడు నీళ్లు రాలేదు కదా అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయిన మీరే మంచి చేయవచ్చు కదా.. మళ్లీ మంత్రిని గెలిపించాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. సిరిసిల్ల రైల్వే లైన్ దశాబ్దాల కల అని, దీనిపై తమ పార్టీ తరఫున పోరాటాలు చేస్తామని చెప్పారు. నేషనల్ హైవే పెండింగ్ పెట్టారని, అది పూర్తి చేయాలని కోరారు. గల్ఫ్ కార్మికుల కోసం గత ప్రభుత్వం ఏమీ చేయలేదు.. ఈ ప్రభుత్వం అడ్వయిజరీ కమిటీ వేస్తే ఆ కమిటీ నిర్ణయాలు చూసి సభ్యులు రిజైన్ చేశారని తెలిపారు. ఇప్పటివరకు 112మంది గల్ఫ్ కార్మికులు చనిపోయారని, వారికి రూ.5లక్షల సాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.
‘సెస్’లో కేటీఆర్ అవినీతిపై విచారణ జరపాలి
సిరిసిల్ల ‘సెస్’ సహకార విద్యుత్ రంగంలోనే చరిత్ర సృష్టించిన సంస్థ. అలాంటి సంస్థను రద్దు చేసి ఎన్పీడీసీఎల్లో కలిపేశారు.. దీని కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నపుడు ‘సెస్’లో రూ.32 కోట్ల అవినీతి జరిగిందని, ఎన్నికలకు ముందు జరిగిన అగ్నిప్రమాదంలో ఫైల్స్ అన్నీ కాలిపోయాయని, ఇలా చాలాచోట్ల ఆధారాలు మాయం చేసేలా అగ్నిప్రమాదాలు జరిగాయని ఆరోపించారు. ‘సెస్’లో అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక నేరెళ్ల బాధితుల ఆధారాలను కూడా మాయం చేశారన్నారు. మొన్న సిరిసిల్లకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధితులను గ్రూపులుగా విడగొట్టి కొందరికి రూ.5 లక్షలు, కొందరికి రూ.10 లక్షల చెక్కులు ఇచ్చారన్నారు. బాధితులకు రూ.కోటి పరిహారం, మూడెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. నేరెళ్ల ఘటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎస్పీని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు పోరాటం చేయనందున తాము వాటికన్నా ఎక్కువగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని, ఆదిలాబాద్ రిమ్స్ ఘటన తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వెంటనే రూ.11 కోట్లు రిలీజ్ చేశారని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


