24న వరంగల్ కిట్స్ 43వ స్నాతకోత్సవం

  • ముఖ్య అతిథిగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్
  • ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక రెడ్డి
  • 700 మంది పట్టభద్రులకు డిగ్రీలు, 14 మంది ప్రతిభావంతులకు స్వర్ణ పతకాలు

హనుమకొండ ప్రజాతంత్ర , నవంబర్ 19: కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (KITS Warangal), వరంగల్ 43వ వార్షిక స్నాతకోత్సవం (KITSW 43rd Graduation Day) ఈ నెల 24న జరగనుంది. కళాశాల క్యాంపస్‌లోని క్రీడా మైదానంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు. గురువారం క్యాంపస్‌లోని కమిటీ హాల్‌లో 9వ అటానమస్ బ్యాచ్ (2022–2026) స్నాతకోత్సవ ఆహ్వాన పత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 700 మందికి పైగా యూజీ, పీజీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారని చెప్పారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల విద్యా ప్రస్థానంలో స్నాతకోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయని , అర్హులైన విద్యార్థులందరూ తప్పకుండా హాజరై స్వయంగా తమ డిగ్రీలను స్వీకరించాలని ఆయన సూచించారు.

KITSW 43rd Graduation Day

హాజరుకానున్న ప్రముఖులు:

ఈ కార్యక్రమానికి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభిస్తారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. రమణ గౌరవ అతిథిగా పాల్గొంటారు. రాజ్యసభ మాజీ సభ్యులు, కిట్స్ వరంగల్ గవర్నింగ్ బాడీ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు ఈ సభకు అధ్యక్షత వహిస్తారు. కళాశాల కోశాధికారి పి. నారాయణరెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, కిట్స్ అదనపు కార్యదర్శి వోడితాల సతీష్ కుమార్, యాజమాన్య సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.

ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్‌రెడ్డి, అకడమిక్ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ సూర నరసింహ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి (సీఓఈ) ప్రొఫెసర్ సి. వెంకటేష్, అదనపు సీఓఈలు డాక్టర్ బి. కిరణ్, డాక్టర్ రాజేందర్, డాక్టర్ హరికుమార్, వివిధ విభాగాల డీన్లు, అధిపతులు, పీఆర్ఓ డాక్టర్ డి. ప్రభాకరా చారి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *