పార్లమెంట్‌ ‌తరహాలో అసెంబ్లీ సెంట్రల్‌ ‌హాల్‌

ఆగాఖాన్ ట్ర‌స్టుకు పున‌రుద్ధ‌ర‌ణ‌ బాధ్య‌త‌లు
‌కెటిఆర్‌ ఈఆర్సీ వద్దకు వెళ్లడం జోక్‌
‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో బండారం బయటకపడక తప్పదు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌22: ‌పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌ ‌తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్‌ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీని అఘాఖాన్‌ ‌ట్రస్ట్ ‌రూ. 49 కోట్ల అంచనాతో రెనోవేట్‌ ‌చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 3 నెలల్లో అసెంబ్లీలో చేపట్టిన పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని అన్నారు. నిజాం తరహాలో అసెంబ్లీని ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నామని తెలిపారు.  మంగళవారం అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ…. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు వెళ్లాలంటే వాహనంలో సీఎం, మంత్రులు వెళ్లాల్సి వొస్తోందని తెలిపారు. ఒకే దగ్గర ఉంటే టైం సేవ్‌ అవుతుందని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ ‌చార్జీల అంశంపై ఈఆర్సీ దగ్గరకు వెళ్లడం పెద్ద జోక్‌.. ఆయన ఓ జోకర్‌ అని విమర్శించారు.

పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన కూడా బీఆర్‌ఎస్‌ ‌నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పేదవారికి తమ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. కేంద్ర మంత్రులు కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ ‌తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. బాధ్యత గల ప్రతిపక్షంగా మూసీ పునరుజ్జీవనానికి బీఆర్‌ఎస్‌ ‌సహకరించాలని మంత్రి  కోరారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో మూసీని భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. నిర్వాసితుల కష్టాలు తమకు తెలుసునని అన్నారు.. నిర్వాసితులకు ఏ కష్టం రానివ్వమని చెప్పారు. పునరావాసం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌వ్యవహారంలో త్వరలోనే వారి బండారం బయటపడుతుందని అన్నారు. అప్పుడు వారి రాజకీయ జీవితం ముగిసిపోతుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *