ఇటీవల తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో జరిగిన ఒక ఘటనపై గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక న్యాయ సాధనలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. సంస్థలో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేసిన కె. రామకృష్ణారెడ్డి 2014లో మరణించగా, ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ఆయన కుమార్తె కుంభం జ్యోతి కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కేవలం ఆమెకు వివాహమైందనే ఒకే ఒక్క కారణంతో అధికారులు ఆ హక్కును తిరస్కరించారు. సుదీర్ఘంగా సాగిన 11 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత, ఈ నిర్ణయాన్ని సవాలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ అత్యంత కీలకమైన తీర్పును వెలువరించారు. వివాహిత కుమార్తె అనే కారణంతో ఉద్యోగాన్ని నిరాకరించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేస్తూ, ఆమె నియామకానికి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని విద్యుత్ సంస్థను ఆదేశించారు. ఈ తీర్పు మన పాలనా వ్యవస్థల్లో ఇంకా వేళ్లూనుకుని ఉన్న పితృస్వామ్య ఆలోచనా విధానానికి గట్టి ఎదురుదెబ్బ. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, కారుణ్య నియామకాలు, కుటుంబ ఆధారిత ప్రయోజనాలకు సంబంధించిన పాత నిబంధనల్లో దాగి ఉన్న లింగ వివక్షను తక్షణమే తొలగించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి బలంగా చెప్పింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 ప్రకారం లింగ వివక్ష నిషిద్ధమని స్పష్టంగా ఉన్నప్పటికీ, ఆ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు తమ కార్మిక, ఉపాధి నిబంధనలను వేగంగా సవరించడం లేదు. న్యాయస్థానాలు వేర్వేరు సందర్భాల్లో ప్రభుత్వాలను హెచ్చరించినా, శాసన వ్యవస్థ ఈ నిబంధనలను మార్చడానికి అవసరమైన చట్ట సవరణలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టకపోవడం వల్ల ఈ శూన్యత ఏర్పడుతున్నది . ప్రస్తుతం అమలులో ఉన్న చాలా ప్రభుత్వ సేవా నిబంధనలు దశాబ్దాల క్రితం, అంటే పురుషుడే కుటుంబ యజమాని , సంపాదకుడు అనే భావన బలంగా ఉన్న రోజుల్లో రూపొందించబడ్డాయి. బ్రిటీష్ కాలం నాటి , స్వాతంత్ర్యానంతర తొలిరోజుల నాటి ‘సివిల్ సర్వీసెస్ రూల్స్’ ప్రకారం.. వివాహమైన స్త్రీ తన భర్త కుటుంబానికి చెందుతుంది తప్ప, పుట్టిన కుటుంబంలో సభ్యురాలిగా పరిగణించబడదు. ఈ పాత నిబంధనల పుస్తకాలను ఇప్పటివరకు సమూలంగా సమీక్షించి, ఆధునీకరించకపోవడమే ప్రధాన కారణం.
ఒక ఇంట్లో కుమారుడికి వివాహమైనా అతను ఆ కుటుంబంలో సభ్యుడిగానే చలామణీ అవుతాడు, తండ్రి మరణిస్తే కారుణ్య నియామకానికి అర్హత పొందుతాడు. మరి అదే అర్హత వివాహమైన కుమార్తెకు ఎందుకు వర్తించదు? వివాహం జరిగినంత మాత్రాన ఒక కుమార్తె తన పుట్టింటికి పరాయిది అయిపోతుందనే భావన ఆధునిక సమాజంలో ఎంతవరకు సమంజసం? కన్న తల్లిదండ్రుల పట్ల కుమార్తెకు ఉండే బాధ్యత, ప్రేమాభిమానాలు పెళ్లితో తుడిచి పెట్టుకుపోవు. జ్యోతి కేసులోనే కుమారుడు లండన్‌లో ఉంటూ ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరిస్తే, కుటుంబ భారాన్ని మోసేందుకు కుమార్తె ముందుకు వొచ్చింది.
అటువంటప్పుడు, కుటుంబ యజమాని అకాల మరణం చెందితే, ఆ కుటుంబానికి కారుణ్య నియామకం ద్వారా ఆసరాగా నిలిచే హక్కు కుమార్తెకు కూడా సమానంగా ఉండాలి. వివాహాన్ని ఒక అర్హతగానో లేదా అనర్హతగానో మార్చి మహిళల ఉపాధి హక్కులను దెబ్బతీయడం రాజ్యాంగ విరుద్ధం. కారుణ్య నియామకాల ముఖ్య ఉద్దేశం.. సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థికంగా ఆదుకోవడం. ఇక్కడ “ఆధారపడిన కుటుంబ సభ్యులు” అనే నిర్వచనం కిందకు వివాహిత కుమార్తె రాదని అధికారులు వాదిస్తారు. పెళ్లయిన తర్వాత ఆమె భర్త సంపాదనపై ఆధారపడుతుంది కాబట్టి, పుట్టింటి కుటుంబానికి ఆమె ఆర్థిక ఆసరా కాలేదనే సంకుచిత భావనతో ఈ నిబంధనలను కొనసాగిస్తున్నారు. కుమారుడికి వివాహమై, అతను వేరుగా ఉంటున్నా ‘కొడుకు’ అనే ఒకే ఒక్క కారణంతో అతనికి హక్కు కల్పిస్తూ, కుమార్తెకు నిరాకరిస్తున్నారు.
ఇలాంటి వివక్ష కేవలం కారుణ్య నియామకాలకే పరిమితం కాలేదు. ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలు, గ్రాట్యుటీ, పెన్షన్, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక వంటి అనేక కుటుంబ ఆధారిత ప్రయోజనాలలో కూడా ఇలాంటి అలిఖిత లేదా లిఖిత నిబంధనలు మహిళలపై వివక్షను చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి దాఖలవుతున్న కేసుల్లో దాదాపు 30% నుండి 40% వరకు వివాహిత కుమార్తెలకు హక్కుల నిరాకరణపైనే ఉంటున్నాయని న్యాయ నిపుణుల అంచనా. కాలం మారింది, మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. దేశంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్) క్రమంగా పెరుగుతున్న తరుణంలో, కుటుంబ భారాన్ని మోయడంలో తామేమీ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ చట్టాలు ,నిబంధనలు కూడా కాలానికి అనుగుణంగా మారవలసి ఉంది.
హైకోర్టులు, సుప్రీంకోర్టులు వివిధ సందర్భాల్లో స్పష్టమైన తీర్పులు ఇస్తున్నప్పటికీ—ముఖ్యంగా సుప్రీంకోర్టు సయారా ఖాతూన్ కేసులో లింగ వివక్ష నిబంధనలను కొట్టేసినప్పటికీ—క్షేత్రస్థాయి





