తప్పిదాలు ప్రభుత్వానివి.. షరతులు రైతులకా?

అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అని వేదికలపై ఉపన్యాసాలు దంచే ప్రభుత్వాలు, ఆచరణలోకి వొచ్చేసరికి ఆ వెన్నెముకను విరిచేలా ఆంక్షల కొరడా ఝుళిపించడం కాలం మారుతున్నా మారని చేదు నిజం. తెలంగాణలో యాసంగి (రబీ) సాగు ముంగిట నిలిచిన అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుందని  ప్రచారంలోకి వొచ్చిన ‘సెల్ఫ్ డిక్లరేషన్’ (స్వీయ అంగీకార పత్రం) నిబంధన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నది . ఒకవైపు కరువు ఛాయలు, మరోవైపు పాలకుల ముందస్తు ప్రణాళికా లోపాలు రైతాంగాన్ని వేధిస్తుంటే, వీటన్నింటికీ రైతులనే బాధ్యులను చేస్తూ సంతకాలు సేకరించాలనే ఆలోచన ప్రజాస్వామ్య ప్రభుత్వాల లౌక్యానికి పరాకాష్టగా నిలుస్తుంది . సోషల్ మీడియా వేదికలతో పాటు క్షేత్రస్థాయిలో వైరల్ అవుతున్న ఆ నిబంధనల సారాంశం చూస్తే ఎవరికైనా విస్మయం కలగక మానదు. “ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత ఉందని ప్రభుత్వం వరి వేయవొద్దని చెప్పింది. అయినా నా సొంత ఇష్టంతో వరి వేస్తున్నాను. భవిష్యత్తులో కరెంటు కోతలు లేదా సాగునీటి కొరత వల్ల పంట దెబ్బతింటే ప్రభుత్వానికి గానీ, విత్తన డీలర్లకు గానీ ఎలాంటి సంబంధం లేదు” అంటూ రైతుల నుంచి రాసి ముందే సంతకాలు తీసుకోవాలని అంతర్గత ఆదేశాలు వెళ్లినట్లు వార్తలు వొస్తున్నాయి.

విత్తనాలు కొనుగోలు చేయాలంటేనే ఈ పత్రం సమర్పించాలనే మెలిక పెట్టడం దారుణం. విపత్కర పరిస్థితుల్లో రైతాంగానికి భరోసా ఇవ్వాల్సిన సర్కారే, ముందే చేతులెత్తేస్తూ “నీ పంట ఎండిపోతే నీదే కర్మ” అని ఒక రాతపూర్వక అంగీకారాన్ని కోరడం ఏ రకమైన ప్రజాపాలన? ఈ విధానంపై గ్రామీణ ప్రాంతాల్లో ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ప్రజావాణి వేదికగా ఒక సాధారణ రైతు, అక్కడి అధికారులను నిలదీసిన తీరు క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తికి ప్రత్యక్ష నిదర్శనం. “మేమేమైనా పక్క దేశంలో పంటలు పండిస్తున్నామా? కరెంటు, నీళ్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా? కరెంట్ వృథా చేసే వారికి లేని నిబంధనలు, అన్నం పెట్టే రైతుపైనే ఎందుకు?” అంటూ ప్రజావాణి వేదికలపై ఎదురవుతున్న ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానాలు కరువవుతున్నాయి. ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అభయ హస్తాలు చూపిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వొచ్చాక ఆంక్షల రూపంలో కొర్రీలు పెట్టడం రాజకీయ స్వార్థానికి అద్దం పడుతుందని  ప్రతిపక్షాలు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

ఈ ‘సెల్ఫ్ డిక్లరేషన్’ వెనుక ప్రభుత్వం ఆడుతున్న వ్యూహాత్మక చదరంగం స్పష్టంగా కనిపిస్తున్నది . భవిష్యత్తులో సాగునీరు అందకనో, పగటిపూట నిరంతర విద్యుత్ లేకనో పంటలు ఎండిపోతే.. రైతులు రోడ్లపైకి వొచ్చి నష్టపరిహారం డిమాండ్ చేయకుండా ముందే వారి నోళ్లు నొక్కేసే కుట్ర ఇది. “మీరు వరి వేయవొద్దని ముందే చెప్పాం, మీరే సంతకం పెట్టి ఇచ్చారు కాబట్టి నష్టపరిహారం ఇచ్చే ప్రసక్తే లేదు” అని రేపు మొండిచేయి చూపడానికే ఈ పత్రాలను ఆయుధాలుగా మలుచుకుంటున్నార నే వాదనలో నిజం లేకపోలేదు. ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యాలు, నీటి నిల్వలపై ముందస్తు అంచనాలు లేకపోవడం వల్ల వొచ్చిన కృత్రిమ కరువును రైతుల ముడికి చుట్టడం ఎంతవరకు న్యాయం?

ఈ సంక్షోభానికి ప్రధాన కారణం పాలనాపరమైన, సాంకేతిక వైఫల్యాలేనని ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగా నిలదీస్తున్నది . గోదావరి నదిలో నీటి ప్రవాహాలు ఉన్నప్పటికీ, పంపింగ్ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడంలో సాంకేతిక లోపాలు తలెత్తడం, ముందుగానే విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేయకపోవడం పాలకుల ముందస్తు ప్రణాళికా లేమికి నిదర్శనం. నాడు ఉచిత విద్యుత్‌తో కళకళలాడిన పల్లెల్లో, నేడు రైతులకు రోజుకు ఆరు గంటల నాణ్యమైన విద్యుత్ కూడా అందడం లేదు. లో-వోల్టేజీ సమస్యలతో మోటర్లు కాలిపోతుంటే, మరోవైపు సాగునీరు అందక పంట చేలు ఎండిపోతున్నాయి. సరఫరా వ్యవస్థలో లోపాలు, సాంకేతిక వైఫల్యాల వంటి తప్పిదాలన్నీ తమ వైపు పెట్టుకుని, వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడు రైతులకు షరతులు పెట్టడం, పంట నష్టపోతే తమకు సంబంధం లేదని రాతపూర్వక పత్రాలు కోరడం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అత్యంత దారుణమైన చర్యగా పరిగణించాల్సి ఉంటుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత విద్యుత్, సాగునీటిపై కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీలను అస్త్రంగా చేసుకుని, ఇప్పుడు బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది. పాలనాపరమైన, సాంకేతిక వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ, భవిష్యత్తులో వొచ్చే రైతు ఆగ్రహం నుండి తప్పించుకోవడానికే సర్కార్ ఈ కండిషన్ల వ్యూహాన్ని తెరపైకి తెచ్చిందని, ఇది రైతులను బలిపశువులను చేయడం తప్ప మరోటికాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరి వరదనీరు దిగువకు వెళ్లడంతో కుప్పం సహా ఏపీలోని అన్ని ప్రాంతాలు పంటలు కళకళలాడుతుంటే, తెలంగాణలో క్రాప్ హాలీడే ప్రకటించడం నిజంగా ప్రభుత్వ అసమర్థతేనని విపక్షం చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు సరైన స్పందన కనిపించడంలేదు. మేడిగడ్డ మరమ్మతు పనులు రాజకీయాలకు అతీతంగా శరవేగంగా పూర్తిచేసినట్లయితే ఈ సమస్య ఉత్పన్నమయ్యేదే కాదన్న విపక్ష వాదనకు ప్రస్తుత దుస్థితి బలం చేకూరుస్తున్నది.

ప్రభుత్వం ఇప్పటికైనా ఈ వివాదాస్పద వైఖరిని వీడాలి. వ్యవసాయ శాఖ కేవలం ఆంక్షలకే పరిమితం కాకుండా, ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలనుకుంటే వారికి పూర్తి సబ్సిడీతో కూడిన నాణ్యమైన ప్రత్యామ్నాయ విత్తనాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. అన్నదాతలను భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి ‘బాధ్యతారాహిత్య’ పత్రాల సంస్కృతికి స్వస్తి పలకాలి. రైతులకు సాగునీరు, నిరంతర విద్యుత్ అందించడం ప్రజా ప్రభుత్వాల ప్రాథమిక విధి. ఆ విధి నుంచి తప్పుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా రైతాంగ ఉద్యమాలకు దారితీస్తుందని పాలకులు గుర్తుంచుకుంటే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *