గ‌డువుకు ముందే భద్రాద్రి ఆలయ పనులు పూర్తి

– నవంబర్ 15నుంచి రాతి కట్టడాల పనులు
– గోదావరి పుష్కరాల నాటికి సర్వాంగ సుందరంగా పట్టణం
– బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల పర్యాటక మార్గం
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
– రామాలయం అభివృద్ధి పనుల పరిశీలన

భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం అభివృద్ధి పనులను చేపట్టిందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పనులను వేగవంతం చేసిందన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని గురువారం దర్శించుకున్న అనంతరం మంత్రి పొంగులేటి, భద్రాచలం, పినపాక, అశ్వరావుపేట శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి ఆలయం చుట్టూ జరుగుతున్న పునరుద్ధరణ, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనం పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఆర్ అండ్ బి, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులు ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారని తెలిపారు. అధికారానికి యంత్రాంగం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ అభివృద్ధి పనులపై నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నామన్నారు.బాసర నుంచి భద్రాచలం వరకు ప్రధాన ఆలయాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఆలయ పర్యాటక మార్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలంతో పాటు మార్గంలోని ఇతర ఆలయాలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భద్రాచలం ఆలయ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని, ఇదే వేగంతో పనులు కొనసాగితే నిర్దేశిత గడువు కంటే సుమారు పది రోజుల ముందుగానే పూర్తి చేయగలమనే విశ్వాసం ఉందని తెలిపారు.ఇప్పటికే కొన్ని స్లాబుల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, రాతి కట్టడాలకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. నవంబర్ 15 నుంచి రాతి కట్టడాల పనులను ప్రారంభించి, వాటిని క్షేత్రస్థాయిలో ప్రతిష్ఠించే ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. మిగిలిన కాంక్రీట్ పనులతో పాటు మాడవీధులకు సంబంధించిన పనులను కూడా సమాంతరంగా కొనసాగిస్తామని చెప్పారు.ఆలయం ఒకవైపు, మరోవైపు నివాస ప్రాంతాలు ఉండటంతో కొండపై రాతిని తొలగించే పనులను అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సి వస్తోందని మంత్రి వివరించారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ, నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తూ ప్రాజెక్టు పురోగతికి కృషి చేస్తున్నారని అభినందించారు. గోదావరి పుష్కరాలకు లక్షలాదిమంది భక్తులు భద్రాచలానికి తరలివచ్చే అవకాశం ఉన్నందున పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను కూడా వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. పట్టణంలో వర్షాల కారణంగా వరద నీరు నిలిచిపోకుండా సులభంగా బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు ముఖ్యమంత్రి, ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇందుకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని, ఆ పనులను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఆలయంతోపాటు పట్టణాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేసి గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *