తుమ్మిడిహట్టికి రాజకీయ గ్రహణం వీడాలి!

తెలంగాణ సాగునీటి చరిత్రలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మరోసారి కదలిక వొచ్చింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో త్వరలో సమావేశం కానున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య జరగబోయే చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అక్టోబర్ 23 తరువాత చర్చలకు సిద్ధమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సంకేతమిచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. అయితే సమావేశం ఖచ్చితమైన తేదీ ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ప్రాణహిత నదిపై నిర్మించతలపెట్టిన ఈ బ్యారేజీ కేవలం సాగునీటి ప్రాజెక్టు కాదు. దశాబ్దాలుగా వెనుకబాటుతనంతో సతమతమవుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం, ఆదివాసీల అభివృద్ధి ఆకాంక్షలకు ప్రతీక. అందువల్ల ఈ చర్చలు రాజకీయ ప్రతిష్ఠకు కాకుండా ప్రజాప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే దిశగా సాగాలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి పథకంలో తుమ్మిడిహట్టి కీలకమైన భాగం. తెలంగాణ ఏర్పడిన తరువాత అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును పునరాకృతీకరించి కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో తుమ్మిడిహట్టి నిర్మాణం వెనుకబడింది. ప్రాజెక్టుల పునరాకృతీకరణపై గత, ప్రస్తుత ప్రభుత్వాల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నప్పటికీ, ప్రజలకు కావాల్సింది పరస్పర ఆరోపణలు కాదు. తక్కువ వ్యయంతో, పర్యావరణానికి సాధ్యమైనంత తక్కువ నష్టంతో, దీర్ఘకాలం ఉపయోగపడే సాగునీటి వ్యవస్థ. గత నిర్ణయాలను శాస్త్రీయంగా సమీక్షించి, వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
తుమ్మిడిహట్టి నిర్మాణంలో ప్రధాన వివాదం బ్యారేజీ ఎత్తు. గతంలో మహారాష్ట్ర 148 మీటర్ల స్థాయికి అంగీకరించింది. అయితే ఆ ఎత్తులో అవసరమైన నీటిని మళ్లించడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నది. తాజాగా 150, 152 మీటర్ల స్థాయిలను పరిశీలిస్తున్నది. అధికారుల అంచనాల ప్రకారం 152 మీటర్ల ఎత్తులో సుమారు 2,300 ఎకరాలు, 150 మీటర్ల ఎత్తులో వెయ్యి ఎకరాల కంటే తక్కువ భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్రలో గ్రామాలు ముంపునకు గురికావని తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు. ఈ అంచనాలపై మహారాష్ట్ర అంగీకారం, సమగ్ర సాంకేతిక పరిశీలన అవసరం.

ఇక్కడ ప్రభుత్వాలు గుర్తించాల్సిన మౌలిక సూత్రం ఒకటుంది. బ్యారేజీ ఎత్తు ఎంత ఎక్కువైతే అంత మంచిదనే అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోకూడదు. నీటి లభ్యత, నిల్వ సామర్థ్యం, మళ్లించగల పరిమాణం, నిర్మాణ వ్యయం, నిర్వహణ ఖర్చు, ముంపు ప్రభావం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలి. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో గతంలో జరిగిన సమావేశాల వివరాలను, సాంకేతిక నివేదికలను రెండు రాష్ట్రాలూ పరిశీలించాలి. అవసరమైతే స్వతంత్ర నిపుణుల అభిప్రాయాలను స్వీకరించాలి. శాస్త్రీయ ఆధారాలపై ఏర్పడే ఏకాభిప్రాయమే ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం చూపగలదు.

తుమ్మిడిహట్టి ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గ్రామాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సాగునీటి సౌకర్యాలు మెరుగుపడితే వ్యవసాయోత్పత్తి, గ్రామీణ ఉపాధి, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే అవకాశముంది. అయితే ప్రతిపాదిత ఆయకట్టు వివరాలు, నీటి పంపిణీ విధానం, చిన్న సన్నకారు రైతులకు కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలి. ఆదివాసీలకు భూమిపై హక్కులున్నప్పటికీ సాగునీటి సౌకర్యాలు అందని పరిస్థితులు తొలగాలి. ప్రాజెక్టు ప్రయోజనాలు పెద్ద భూయజమానులకే పరిమితం కాకుండా చూడాలి.

మరోవైపు అభివృద్ధి పేరుతో ఆదివాసీల భూములు, అడవులు, జీవనాధారాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి. ముంపునకు గురయ్యే భూముల యజమానులు, సాగుదారులు, అటవీ హక్కుదారుల వివరాలను పారదర్శకంగా గుర్తించాలి. అవసరమైన చోట చట్టబద్ధమైన సమ్మతి, న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలి. జల్‌–జంగల్‌–జమీన్ నినాదంతో తమ హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలకు సాగునీరు అందించడమంటే వారి భూమి హక్కులను బలహీనపరచడం కాకూడదు. పర్యావరణ పరిరక్షణ, సాగునీటి అభివృద్ధి, సామాజిక న్యాయం పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు కావు.

ఈ చర్చల్లో కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా కీలకం. అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారంలో కేంద్ర జలసంఘం సాంకేతిక సహకారం, అవసరమైన అనుమతులు, ఆర్థిక మద్దతు ప్రధానమైనవి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ భేదాలు పక్కనపెట్టి సహకరించాలి. రైతుల సాగునీటి అవసరాలను పార్టీల మధ్య రాజకీయ పోటీగా మార్చకూడదు. తెలంగాణ ప్రభుత్వం కూడా మహారాష్ట్ర అభ్యంతరాలను గౌరవిస్తూ పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాన్ని సాధించాలి.ప్రస్తుత కరువు పరిస్థితులు తుమ్మిడిహట్టి ప్రాధాన్యాన్ని మరింత పెంచుతున్నాయి. నీటి నిల్వలు తగ్గడం, సాగు విస్తీర్ణంపై అనిశ్చితి నెలకొనడం, రైతుల ఆదాయ భద్రత ప్రశ్నార్థకం కావడం దీర్ఘకాలిక జలవనరుల ప్రణాళిక అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. అయితే తుమ్మిడిహట్టి ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని భావించరాదు. చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల సంరక్షణ, నీటి పొదుపు వ్యవసాయం, సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థలతో అనుసంధానం చేసినప్పుడే ప్రాజెక్టు ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందుతాయి.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చల అనంతరం కేవలం సానుకూల స్పందన లభించిందనే ప్రకటనతో సరిపెట్టుకోకూడదు. బ్యారేజీ ఎత్తుపై ఏకాభిప్రాయం, సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక, అనుమతులు, నిధుల సమీకరణ, నిర్మాణ కాలపట్టికపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. ప్రాజెక్టు పురోగతిని ప్రజలకు క్రమం తప్పకుండా వెల్లడించాలి. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు రాజకీయ పార్టీల ప్రతిష్ఠకు సంబంధించిన వ్యవహారం కాదు. అది ఆదిలాబాద్ రైతుల భవిష్యత్తుకు, ఆదివాసీల జీవనోపాధికి సంబంధించిన అంశం. ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టులపై ప్రజల ఆశలు మారవు. దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. మహారాష్ట్రతో జరగబోయే చర్చలు మరో రాజకీయ ప్రకటనగా మిగిలిపోకుండా, నిర్మాణానికి మార్గం సుగమం చేయాలి. తుమ్మిడిహట్టికి రాజకీయ గ్రహణం వీడాలి.. ఆదిలాబాద్ రైతాంగానికి సాగునీటి వెలుగులు అందాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *