నోరు నొక్కి… అభిప్రాయం అడుగుతారా?

హైదరాబాద్ నగరాభివృద్ధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ఇప్పుడు కేవలం పర్యావరణ, పునరావాస అంశాలకే పరిమితం కాకుండా తీవ్ర రాజకీయ, ప్రజాస్వామ్య చర్చకు దారితీసింది. “ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ ముందుకెళ్తాం” అని పదే పదే ప్రకటించిన ప్రభుత్వం, తీరా క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే రోజున విపక్షాలు, పౌర సమాజ ప్రతినిధులపై ఆంక్షలు విధించడం, అదుపులోకి తీసుకోవడం శోచనీయం. ఒక మెగా ప్రాజెక్టును నిర్మించే క్రమంలో ప్రజల గొంతుకలను వినడానికి ఏర్పాటు చేసిన వేదికపైనే అప్రకటిత నిరోధాలు విధించడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలను లేవనెత్తుతున్నది .ఒకవైపు ఆన్‌లైన్ ద్వారా, సలహాల ద్వారా పారదర్శక ప్రక్రియను అనుసరిస్తున్నామని చెప్తూనే, మరోవైపు ప్రత్యక్షంగా బాధితుల, విపక్షాల వాదనలను వినడానికి విముఖత చూపడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కాకపోతే మరేంటి? ప్రజాస్వామ్యంలో విపక్షాల పాత్ర కేవలం విమర్శలకే పరిమితం కాదు. అవి బాధితుల తరఫున నిలబడే గొంతుకలు.

ప్రజాభిప్రాయ సేకరణ అనేది కేవలం ప్రభుత్వ అనుకూల వర్గాల అభిప్రాయాలను మాత్రమే సేకరించే రబ్బర్ స్టాంప్ ప్రక్రియ కాకూడదు. అందులో విమర్శలు, అభ్యంతరాలు, ఆందోళనలకు కూడా సమానమైన స్థానం ఉండాలి. విపక్ష నాయకుల కదలికలపై ఆంక్షలు విధించి, ప్రజాభిప్రాయ సేకరణ వేదికల వద్ద పోలీసు బలగాలను మోహరించడం భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది తప్ప, ఆరోగ్యకరమైన చర్చకు తావివ్వదు. మూసీ పరివాహక ప్రాంతంలోని నిర్వాసితుల ఆందోళనలను ఆసరాగా చేసుకుని విపక్షాలు రాజకీయంగా బలపడాలని చూస్తున్నాయని, ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయని అధికార పక్షం ఆరోపిస్తున్న నేపథ్యంలో, విపక్షాలకు మైలేజ్ రాకుండా చూడటమే ఈ ఆంక్షల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది. అంతేకాదు ప్రభుత్వం ఇచ్చే పునరావాస ప్యాకేజీలు, నష్టపరిహారంపై విపక్షాలు ప్రజల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తాయని, దీనివల్ల భూసేకరణ లేదా ఇళ్ల తొలగింపు ప్రక్రియ మరింత క్లిష్టంగా మారుతుందని ప్రభుత్వంలో నెలకొన్న ఆందోళన మరోకారణం. అయితే, ప్రజాస్వామ్యంలో విపక్షాల గొంతు నొక్కడం, ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని, అందరినీ భాగస్వామ్యం చేసినప్పుడే ప్రాజెక్టులకు పూర్తి స్థాయి మద్దతు లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు  స్పష్టం చేస్తున్నారు.

గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే—ఏ ప్రతిపక్ష పార్టీ కూడా మూసీ నది ప్రక్షాళనను లేదా శుద్ధీకరణను వ్యతిరేకించడం లేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భారీ వ్యయం,  నిర్వాసితుల అంశాలపైనే వారి ప్రధాన పోరాటం నడుస్తున్నది . రైతు భరోసా, ఫీజు రీఇంబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం, మూసీ ప్రాజెక్టు కోసం రూ.1.5లక్షలకోట్ల  భారీ మొత్తాన్ని ఎలా కేటాయిస్తోందని ప్రశ్నిస్తున్నది . ఇందులో భారీ అవినీతి, కమీషన్ల లూటీతోపాటు, పేదలను ఖాలి  చేయించి ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని  ఆరోపిస్తున్నది . నదిలోకి మురుగునీరు చేరకుండా ముందే శుద్ధి కేంద్రాలను నిర్మించకుండా, నివాస గృహాలను కూల్చడం అర్థరహితమన్నది బీఆర్ఎస్ వాదన. అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు, రిజిస్ట్రేషన్లు కలిగి ఉండి, బఫర్ జోన్ లేదా ఎఫ్టీఎల్ పరిధి వెలుపల ఉన్న మధ్యతరగతి ఇళ్లను , జవాన్ల ఫ్లాట్లను కూల్చివేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది . బాధితులకు సరైన నష్టపరిహారం అందించి, వారికి శాశ్వత గృహవసతి కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నది . ప్రజాస్వామ్య పద్ధతిలో అభిప్రాయ సేకరణ చేస్తామన్న ప్రభుత్వం విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రక్రియలో భాగంగా విధిస్తున్న ఆంక్షలు ఎంతమేర సమర్థనీయం? అంటే విపక్షాలు ఆరోపిస్తున్నట్టు, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కు  ప్రాధాన్యతనిస్తోందను కోవాలా?

మూసీ పరివాహక ప్రాంతంలోని వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తు ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉంది. సుమారు 10వేల నుంచి 12వేలకు పైగా కుటుంబాలు నిర్వాసితులు కాబోతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను పారదర్శకంగా ప్రజల ముందు ఉంచకపోవడం అనుమానాలకు బల చేకూరుస్తుంది. పర్యావరణ అనుమతులు, సామాజిక ప్రభావ అంచనా (ఎస్ఐఏ) నివేదికలను బహిర్గతం చేయకుండా నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలు కేవలం లాంఛనప్రాయంగానే మిగిలిపోతాయి. తమ సొంత ఇళ్లను, జీవనోపాధిని కోల్పోతున్న బాధితులకు తమ అభ్యంతరాలను నిష్పక్షపాతంగా చెప్పుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపైనే ఉంది. ఆ సమయంలో విపక్షాలను దూరం పెట్టడం అంటే ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అవుతుంది.

నవ హైదరాబాద్ నిర్మాణానికి, పర్యావరణ పరిరక్షణకు మూసీ ప్రక్షాళన అవసరమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ‘అభివృద్ధి’ అనే ముసుగులో ప్రజా హక్కులను, నిర్వాసితుల ప్రయోజనాలను విస్మరించకూడదు. గతంలో అనేక ప్రాజెక్టుల విషయంలో జరిగిన పొరపాట్లను పునరావృతం చేయకుండా, బాధితులకు ముందే శాశ్వత పునరావాసం, ఉపాధి హామీ కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలనే డిమాండ్లు న్యాయమైనవి. కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసం, రియల్ ఎస్టేట్ ముఖచిత్రం కోసమే పేదల ఇళ్లను కూల్చుతున్నారనే ఆరోపణలను ప్రభుత్వం పారదర్శకమైన చర్చల ద్వారానే తిప్పికొట్టగలదు తప్ప, అణచివేత చర్యల ద్వారా కాదు. సమగ్ర నగర వికాసం ప్రజా సంక్షేమంతోనే ముడిపడి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా విపక్షాలపై ఆంక్షల ధోరణిని వీడి, పౌర సమాజాన్ని, పర్యావరణ వేత్తలను, బాధితులను విశ్వాసంలోకి తీసుకోవాలి. నిజమైన ‘ప్రజా ప్రభుత్వం’ అనిపించుకోవాలంటే భిన్నాభిప్రాయాలను కూడా గౌరవించే సహనం ప్రదర్శించాలి. మూసీ పునరుజ్జీవనం కేవలం భౌతికమైన నది ప్రక్షాళనగా మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య విలువల ప్రక్షాళనకు కూడా ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *